వేడుకగా చక్రస్నానం
కార్వేటినగరం, న్యూస్‌లైన్: కార్వేటినగరం వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్కంధ పుష్కరిణిలో కంకణభట్టు సుందరవరదాచార్యులు, కిరణ్ భట్టాచార్యులు శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, అర్చన, శుద్ధి, కొలువు, మొదటి గంట, నిత్యకైంకర్యాలు నిర్వహించారు.
అనంతరం వేణుగోపాలస్వామిని ఓ వైపు, రుక్మిణీ సత్యభామలను మరో వైపు పల్లకిలో అధిష్టింపజేశారు. చక్రత్తాళ్వారు ముందు వెళుతుండగా వెనుక ఉభయ దేవేరులతో స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. ఉభయనాంచారుల సమేతుడైన వేణుగోపాలస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, తేనె, పసుపు, చందనం, నెయ్యి, తైలం, నారికేళి జలాలతో అభిషేకించారు.
స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళతాళాలు, మత్రోచ్ఛారణల మధ్య స్కంధ పుష్కరిణిలో స్వామివారి ఇష్టాయుధమైన (చక్రత్తాళ్వారుకు) చక్రానికి స్నానం చేయించారు.
ఆ సమయంలో పుష్కరిణిలో స్నానం చేయడానికి భక్తులు పోటీపడ్డారు. సాయంత్రం స్వామికి తిరివీధి ఉత్సవం , రాత్రి కుంభప్రోక్షణ, పూర్ణాహుతి, ధ్వజావరోహణంతో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి సిద్దారెడ్డి, జమేదార్ శివకేశవులు, వోఎస్‌డబ్ల్యూ శ్రీనివాసులు పాల్గొన్నారు.