బెంగళూరులోని భారతీయ ఉద్యాన తోటల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.హెచ్.ఆర్.) శాస్త్రవేత్తలు ఓ చదరపు మీటరు విస్తీర్ణంలో ఒదిగిపోయే నిలువు తోట చట్రం(వర్టికల్ గార్డెన్ స్ట్రక్చర్)ను రూపొందించారు. దీని పై భాగంలో నీటి కంటెయినర్‌ను అమర్చి, దాని ద్వారా మొక్కలకు సునాయాసంగా నీటిని అందించే ఏర్పాటు చేశారు. దీనికి అడుగున చక్రాలు ఏర్పాటు చేయడంతో సులభంగా అటూ ఇటూ జరుపుకోవడానికి వీలుంది. కుటుం ం అవసరాల కోసం కోరుకున్న కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ, పూల మొక్కలను ఇంటిపట్టున (పెరట్లో ఎండతగిలే చోట, బాల్కనీ లేదా మేడ పైన) తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు విత్తుకోవడానికి ఈ నిలువు తోట ఉపయోగపడుతుంది. ఇనుముతో తయారైన ఈ నిలువు తోట స్ట్రక్చర్‌లో మూడు భాగాలు.. బేస్ ఫ్రేమ్, మెయిన్ సెంట్రల్ సపోర్టు, కుండీలు/ గ్రోబాగ్స్‌కు సపోర్టుగా ఉండే ఊచలు ఉన్నాయి. కుండీలు/ గ్రోబాగ్స్‌లో మట్టి–సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని లేదా మట్టి లేకుండా కొబ్బరి పొట్టు–ఎరువు మిశ్రమాన్ని ఉపయోగించి ఇంటిపంటలు పండించుకోవచ్చు.
నిలువు తోట ప్రయోజనాలు
1. కేవలం ఒకే ఒక్క చదరపు మీటరు స్థలంలో దీన్ని పెట్టుకోవచ్చు. 2. రసాయనాలు వాడుకుండా తనకు తాను పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలను తాజాగా తినవచ్చు. 3. వేర్వేరు సైజుల కుండీలు / గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 4. మనిషికి నిలబడితే చేతికి అందేంత ఎత్తులో కుండీలు / గ్రోబాగ్స్ ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు కోసుకోవడానికి, చీడపీడలను గమనించుకోవడానికి సులువవుతుంది. దీనికి చక్రాలున్నాయి కాబట్టి ఎండను బట్టి, అవసరాన్ని బట్టి అటూ ఇటూ కదిలించవచ్చు.
2 అడుగుల వరకు ఎత్తు ఎదిగేందుకు అవకాశం ఉన్న టమాటో వంటి కూరగాయ మొక్కలు (కుండీ సైజు 16 అంగుళాల చుట్టుకొలత, 12 అంగుళాల ఎత్తు), మిరప, వంగ, చెట్టు చిక్కుడు, బఠాణీ తదితర మొక్కలు (కుండీ సైజు 12 అంగుళాల చుట్టుకొలత, 10 అంగుళాల ఎత్తు) పెరగడానికి కొంచెం పెద్దకుండీలతోపాటు తగినంత ఎక్కువ మట్టి – ఎరువు మిశ్రమం అవసరం. అందువల్ల వీటిని నిలువు తోట స్ట్రక్చర్‌లో కింది భాగంలో పెట్టుకోవాలి.
తోటకూర, కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలు (కుండీ సైజు 26 అం. పొడవు “ 8 అం. వెడల్పు“ 6 అం. ఎత్తు), బ్రహ్మి, పుదీన, అమృతవల్లి, మధునాశని, పిప్పళ్లు, అశ్వగంధ, శతావరి వంటి ఔషధ మొక్కల(కుండీ సైజు 14 అం. పొడవు “ 8 అం. వెడల్పు “ 6 అం. ఎత్తు)ను నిలువు తోట పై భాగంలో పెట్టుకోవాలి.
దీని పైన 25 లీటర్ల ప్లాస్టిక్ కంటెయినర్‌ను ఏర్పాటు చేసి.. దాని నుంచి డ్రిప్ లేటరల్స్‌ను, మైక్రో ట్యూబులను, డ్రిప్పర్లను బిగించుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కంటెయినర్ కుళాయిని తిప్పటం ద్వారా మొక్కలకు నీరు అందేలా ఈ నిలువు తోటను డిజైన్ చేశారు. మొక్కను బట్టి ఒక పంట కాలంలో ఒక్కో మొక్క నుంచి 200 గ్రాముల నుంచి 5 కిలోల వరకు దిగుబడి పొందవచ్చని, ఈ వర్టికల్ గార్డెన్ స్ట్రక్చర్ తయారీకి రూ. 22 వేలు ఖర్చవుతుందని ఐ.ఐ.హెచ్.ఆర్. శాస్త్రవేత్తల అంచనా. స్థానిక మెకానిక్‌లకు చూపించి ఇదే మాదిరిగా తయారు చేయించుకోవచ్చు. లేదా బెంగళూరులోని ఐ.ఐ.హెచ్.ఆర్.ను 080 2308 6100 నంబరులో సంప్రదించి కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment