
లంబ సింగారం
నర్సీపట్నానికి 29 కి.మీ దూరంలో లంబసింగి ఉంది.
విశాఖపట్నం నుంచి చింతపల్లి వెళ్లే ప్రతి బస్సు ఈ గ్రామంలో ఆగుతుంది.
గ్రామంలో ఫలహారశాలలున్నాయి. భోజన, బస వసతుల్లేవు. వేసవి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెం.
ఆ ప్రాంతంలో మంచు జల్లేనా? వణికించే చలేనా?
అంతకు మించి ఇంకేం లేవా? ఉన్నాయి... చాలా ఉన్నాయి... కరిగించే మంచు ఉంది... కదిలించే జీవితం ఉంది... మనసు పెట్టి చూస్తే మనోహరమైన అందా లున్నాయి. ఆసక్తి కలిగించే గిరిపుత్రుల జీవనం ఉంది...
ఇవన్నీ చూడాలంటే... లంబసింగి ఆత్మను దర్శించుకోవాలి... కొండకోనల్లోకి ప్రయాణించాలి... పుట్టల్నీ, పిట్టల్నీ పలకరించాలి... ప్రకృతి మౌనంగా వినిపించే రాగాలను మనసారా వినాలి... ‘ఆ నలుగురూ’ అదే చేశారు... అద్భుత అనుభవాలను మూటగట్టుకున్నారు... మంచు పల్లకీలో ఊరేగుతూ లంబ‘సింగారాన్ని’ చూసి, మైమరచారు.
‘చలికాలం కరిగిపోతున్న ఓ ఉషోదయాన... సెల్ మోగింది... గిరిపుత్రుడు గాసి నాయుడు కాలింగ్... ‘మంచు తగ్గిపోతోంది సార్! లంబసింగి ఎప్పుడొస్తారు?’ అని పిలుపు. వెళ్లాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం. ఈసారి లంబసింగి చూడాలి. మంచుపూల వానలో ముద్దయిపోవాలి. పొగ మంచు దుప్పట్లో దూరిపోవాలి... అనుకుని ‘వచ్చేస్తా’నన్నా. ఎలాగైతేనేం ముహూర్తం ఖరారైంది. విశాఖ నుంచి నేను, సీనియర్ ఫొటోగ్రాఫర్, నేషనల్ హిమాలయన్ ట్రెక్కర్ సత్యనారాయణ, సీనియర్ నేషనల్ హిమాలయన్ ట్రెక్కర్ కృష్ణవేణి ప్రయాణానికి సిద్ధమయ్యాం. ఒకరోజు ఉదయాన్నే బయల్దేరాం. నర్సీపట్నం చేరుకుని, అక్కడ చింతపల్లి వెళ్లే బస్సు ఎక్కాం.
ఘాట్ రోడ్డులో 29 కిలోమీటర్లు కొండలెక్కుతూ, భారంగా ప్రయాణం చేసి, మధ్యాహ్నం ఒంటిగంటకు లంబసింగి జంక్షన్ చేరాం. బస్సు చివరి మెట్టు దిగుతుండగానే జివ్వుమని కొండగాలి ముఖాన్ని ముద్దాడింది. ‘వెల్‌కమ్ సార్!’ అంటూ మా కోసం వచ్చిన గాసినాయుడు పలకరించి, ‘ముందు తాజంగి జలాశయం చూద్దాం సార్!’ అన్నాడు. ఆటోలో బయల్దేరాం. ఎండ కాస్తున్నా ‘పగలే వెన్నెల’ అన్నట్టుంది మాకు. సన్నని తారు రోడ్డుపై ఆటో దూసుకుపోతోంది. రోడ్డుకిరువైపులా విసిరేసినట్టున్న గిరిపుత్రుల ఇళ్లు, ఇళ్ల ముందు పందిళ్లు, విరగకాసిన గుమ్మడికాయలు, పొలాల్లో పసుపు దుంపల్ని పెకలిస్తున్న రైతులు... ఇవన్నీ చూస్తూ, రెండు కిలోమీటర్లు ప్రయాణించాక, కొండల మధ్య విశాలమైన తాజంగి జలాశయం కనిపించింది. సేదతీరి, మళ్లీ బయలుదేరి ఆరు కిలోమీటర్ల ప్రయాణించేసరికి, పడమటి సూరీడు కనుమరుగయ్యాడు.
అందమైన ఆశ్రమంలో అద్భుత రాత్రి
చీకటి పడుతుండగా ఎత్తయిన కొండలపై ఉన్న కిటుముల అనే ఓ గిరిజన కుగ్రామం చేరాం. గ్రామ శివార్లలో కుడి వైపున ఉన్న సిమెంటు రోడ్లోంచి ఒక ఆటో కొండపైకి వచ్చి ఆగింది. కళ్లెదురుగా శ్రీదామరాజు వేంకటరామ గురుదేవులు ఆశ్రమం. అప్పుడర్ధమైంది ఆ రాత్రి మా బస అక్కడేనని! ఆశ్రమ నిర్వాహకులు మమ్మల్ని సాదరంగా లోపలకు ఆహ్వానించారు. అది ఏడెకరాల సువిశాల స్థలం. ఆశ్రమానికి ఎడమ వైపు యాగశాల, ఆ వెనుక వంటశాల, ధ్యానమందిరం ఉన్నాయి. ఫొటోల కోసం మళ్లీ గ్రామంలోకి బయల్దేరాం. చీకటి ముసురుకుంటోంది. కొండలపై సన్నగా మంచు కురుస్తోంది. ఇళ్ల ముందు చలిమంట వెలుగుతోంది. సాయంత్రం ఆరు గంటలకు మళ్లీ ఆశ్రమం చేరాం. రాత్రి తొమ్మిదవుతుండగా, పొగలు కక్కుతున్న అన్నం, కూర, పప్పు, చారుతో భోజనం వచ్చేసింది. వంట మనిషి మత్స్యమ్మ అద్భుతంగా వండి, అమ్మలా ఆప్యాయంగా ఆకలి తీర్చింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాం. వేకువజామున నాలుగు గంటలకు లేచి చూస్తే దట్టమైన పొగమంచుతో కనుచూపు మేరలో పరిసరాలు కనిపించలేదు. కాలకృత్యాలు పూర్తి చేసుకుని, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపి బయట పడ్డాం. ఉదయం ఐదు గంటలకు మా నడక మొదలైంది.
జలపాతానికో పలకరింపు...
ఏడు కిలోమీటర్ల దూరం నడిచాక భీమనపల్లి గ్రామం చేరాం. అక్కడ ఏడుకొండలు అనే ఒక గిరిజన మెకానిక్ యువకుడు, ‘‘ఎక్కడినుంచి వస్తున్నార్ సార్?’’ అని ఆప్యాయంగా పలకరించాడు. జవాబు చెప్పేలోగా... ‘సార్... మా గ్రామానికి సమీపంలో అందమైన జలపాతం ఉంది. అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక ప్రాంతమవుతుంది. నాతో వస్తే తీసుకెళ్తాను...’ అంటూ మేం వింటున్నామో లేదో పట్టించుకోకుండా చెప్పుకుపోతున్నాడు. లంబసింగి సమీపంలో జలపాతం ఉన్నట్టు ఎప్పుడూ వినలేదు. ఏదైతేనేం గుట్టలు, కొండలెక్కి కిలోమీటర్ దూరం నడిచాం. కొంత దూరం వెళ్లాక చిన్న వాగు, పంట పొలాలు, విశాలమైన రాయి, దాని అంచుల వరకూ వెళ్లి చూస్తే ఒక లోయ కనిపించాయి.
కాలుజారితే కైలాసానికే. అక్కడ సన్నగా కిందకు దూకుతున్న జలపాతం కనిపించింది. ఎగువన ప్రవహిస్తున్న వాగును దారి మళ్లించారని... అందుకే జలపాతం చిక్కిపోయిందని ఏడుకొండలు ఆవేదనగా అన్నాడు. నిజమే ఆ ప్రాంతం అరకు దగ్గరి చాపరాయి జలపాతాన్ని తలపిస్తోంది. జలపాతాన్ని దారి మళ్లించడంతో చిక్కిపోయింది. కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని బయల్దేరాం.
ఉదయం తొమ్మిది గంటలైనా సందడి లేదు. తూర్పు తలుపు తోసుకుని సూరీడు... లంబసింగి పల్లెను నిద్ర లేపాడు. మేం లంబసింగి సెంటర్‌కు చేరుకున్నాం. నర్సీపట్నం వెళ్లాల్సిన బస్సొచ్చింది. అయిష్టంగానే బస్సెక్కాం. ఆనందానుభూతుల్ని వెంట మోసుకొచ్చాం.’
- ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు), సాక్షి ప్రతినిధి
ఫొటోలు: గాడు సత్యనారాయణ, విశాఖపట్నం