
చింతపల్లి: విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలో దారుణం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వస్తోన్న ఓ ఆటో చెరువూరు గ్రామంలో ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కనున్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రయాణికులు చింతపల్లి సంతకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
మృతులు గిన్నెల కోట, చెరువూరు గ్రామాలకు చెందిన చిట్టిబాబు, గంగరాజు, బొంజి బాబు, కృష్ణారావు, ప్రసాద్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో జానుబాబు, దావీదు, వివేక్ అనే చిన్నారులతో పాటు చిన్నబ్బాయి, రామ్మూర్తి, వరలక్ష్మీలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చింతపల్లి, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నానికి తరలించారు. విద్యుత్ వైర్లు తెగిపడి మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
చింతపల్లిలో రోడ్డు ప్రమాదం ఐదుగురు సజీవదహనం