ఎవరెస్ట్ అలాగే ఉంది.
ఏఎన్నార్ కూడా అంతేననుకున్నాం!
నయాగరా అలాగే ఉంది.
ఆ నటనాఝరీ అంతేననుకున్నాం!
చుక్కలన్నీ అలాగే ఉన్నాయి.
చక్కనయ్యా... అంతేననుకున్నాం!
వటవృక్షాలు అలాగే ఉన్నాయి.
నటసామ్రాట్ కూడా అంతేననుకున్నాం!
అనుకున్నాం.
ఇప్పటికీ అలాగే అనుకుంటున్నాం.
ఎప్పటికీ అనుకుంటూనే ఉంటాం!
తెలుగు తెరపై చెరగని సంతకం చేసి,‘ఇక లేరు’ అనే మాటను చెరిపేసినిశ్శబ్దంగా నిష్ర్కమించారు అక్కినేని.
ఆయనకిదే సాక్షి అక్షర నివాళి...
ప్రస్థానం 1924-2014
గంగోత్రి వద్ద ప్రారంభమైన ఆ చిన్న దార గంగా ప్రవాహమైనట్టు... కృష్ణా జిల్లా వెంకటరాఘవపురం బుల్లోడు స్త్రీ పాత్రలతో మొదలుపెట్టిన నట ప్రస్థానం ఎవరెస్ట్ శిఖరంగా ఎదిగింది.
నాటకాల్లో పాత్రలు వేయడానికి మహిళలు వెనుకాడే రోజుల్లో, నాగేశ్వరరావు ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. గుడివాడ నాటక రంగాన్ని గుడిగా చేసుకున్నారు. ఎక్సెల్షియర్ క్లబ్ డ్రమెటిక్ అసోసియేషన్ కార్యదర్శి దుక్కిపాటి మధుసూదనరావును గురువుగా చేసుకున్నారు. అక్కినేని నటించిన తొలి సాంఘిక నాటకం ‘ఆశాజ్యోతి’. అందులోని స్నేహలత పాత్రకు జీవం పోశారు. చాలామంది ఆయనను మహిళ అనే అనుకున్నారు. అందుకు చక్కటి ఉదాహరణ: పాలకొల్లులో ఆశాజ్యోతి ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆ టౌన్‌లో పేరున్న ముచ్చర్ల సుబ్బరాజు, యాభై ఏళ్ల ఆయన బంధువు చూస్తున్నారు. ఆ బంధువు భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాడు. అక్కినేనిని తదేకంగా చూస్తుండటంతో ‘ఏంటీ, కళ్లార్పకుండా చూస్తున్నావ్. ఆమెను పెళ్లి చేసుకుంటావా?’అని అడిగారు సుబ్బారావు వేళాకోళంగా. ‘ఆమె ఒప్పుకుంటే తప్పకుండా చేసుకుంటాను’ అన్నాడా బంధువు. మర్నాడు, ఆ అమ్మాయి అక్కినేనే అని తెలిసి, ఆయన బిక్కమొహం వేశాడు. హీరోయిన్ వేషాల్లో నాగేశ్వరరావు అంతగా మాయచేసేవారన్న మాట.
తెలుగుతల్లి, సత్యాన్వేషణ లాంటి నాటకాలు అక్కినేనికి ఎంతో పేరు తెచ్చాయి. ఒక్కో ప్రదర్శనకు ఎనిమిది రూపాయలు వచ్చేవి. నెలలో ఎనిమిది ప్రదర్శనలుండేవి. అంటే నెలకు అరవై నాలుగు రూపాయలు! అదేమీ తక్కువ మొత్తం కాదు. సబ్-రిజిస్ట్రార్ జీతం ముప్ఫై రూపాయలే!
అదృష్టం బెజవాడ స్టేషన్‌లో ఆగింది
అదృష్టం కొందరి తలుపు తడుతుంది. అక్కినేనికి మాత్రం అదృష్టం రైలు కూతగా పిలిచింది. నాగేశ్వరరావు బృందం గుడివాడ వెళ్తూ బెజవాడ స్టేషన్‌లో రైలుకోసం ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న దర్శకనిర్మాత ఘంటసాల బలరామయ్య అక్కినేనిని తదేకంగా చూసి, ‘నీదేవూరు’ అని అడిగి, ‘సినిమాల్లో నటిస్తావా’ అన్నారు. ‘అవకాశం వస్తే నటిస్తాను’ అన్నారు నాగేశ్వరరావు, ఆయనెవరో తెలియక.
1944 మే 8వ తేదీన ఘంటసాల బలరామయ్య పిలుపు మేరకు అక్కినేని ప్రతిభా స్టూడియోకు వెళ్లారు. నాగేశ్వరరావు 1923 సెప్టెంబర్ 20న పుట్టారు. అందరికీ ఆయన జన్మదినం అదే. అయితే, అక్కినేని మాత్రం మే 8వ తేదీయే తన జన్మదినం అనుకుంటారు. ‘సీతారామ జననం’లో నాగేశ్వరరావుకు రాముడి పాత్ర లభించింది ఆరోజే. నిజానికి ఆయన తొలిచిత్రం ధర్మపత్ని. అయితే, పాత్ర నిడివి, ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకుంటే ‘శ్రీ సీతారామ జననమే’ తన మొదటి సినిమాగా అక్కినేని భావిస్తారు. తన వూరు పేరులో ఉన్న రామనామం ఆయన పాత్ర కావడం విశేషం. దర్శకుడి పేరులోనూ రామయ్య ఉండటం మరో విశేషం.
‘శ్రీ సీతారామ జననం’ తర్వాత, ముగ్గురు మరాఠీలు, బాలరాజు, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్నసుందరి మొదలైన చిత్రాల్లో అక్కినేనికి వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి. ‘బాలరాజు’ సినిమా ఆయనకు స్టార్‌డమ్ తెచ్చింది.
ప్రతిపాత్ర ఒక ఛాలెంజ్
హీరోగా నిలదొక్కుకున్న కొత్తలోనే అక్కినేని ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి చొరవ చూపారు. ‘దేవదాసు’ పాత్రను పోషించడానికి వెనకడుగు వేయలేదు. తాగుడు సన్నివేశాలను న భూతో న భవిష్యతి అన్న రీతిలో పండించారు. తాగుడుకు బానిసైన భగ్నప్రేమికుడు ‘దేవదాసు’గా జీవించిన అక్కినేని వెర్రిబాగులోడుగా ‘అర్ధాంగి’ లో అద్భుతంగా నటించారు. ‘పునర్జన్మ’లో మతి చలించిన కళాకారుడిగా, అమాయకత్వం నిండిన పిచ్చివాడిగా నటించారు.
మంచి మనసులు, మూగమనసులు, వెలుగునీడలు వంటి సినిమాల హీరోగా సూపర్‌హిట్‌లు కొడుతూనే నవలా నాయకుడిగానూ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. కోడూరి (అరెకపూడి) కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి నవలలను సినిమాలుగా తీసినప్పుడు నాగేశ్వరరావే హీరో. తాము చదివిన నవలల్లో తాము ఊహించుకున్న హీరోలానే అక్కినేని ఉండటంతో పాఠక ప్రేక్షకులు నీరాజనం పలికారు.
నిర్మాతగా, స్టూడియో అధినేతగా!
నాగేశ్వరరావు హీరోగా నిలదొక్కుకున్నాక, కొన్ని చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా కొనసాగారు. దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ ప్రారంభించాలనుకున్నప్పుడు అక్కినేని ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. ఆ సంస్థకు ఆయనే చైర్మన్. మేనేజింగ్ డెరైక్టర్ మధుసూదనరావు. తన సంస్థ తీసే సినిమాల కథ గురించి మాత్రమే నాగేశ్వరరావు పట్టించుకునేవారు. ఫలానా హీరోయిన్ ఉండాలని కానీ, ఫలానా పాత్రకు ఫలానా నటుడిని తీసుకోండని కానీ అక్కినేని ఎప్పుడూ సిఫారసు చేయలేదు.
హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించాక, నాగేశ్వరరావు పూర్తి స్థాయి నిర్మాతగా వ్యవహరించారు. శ్రీరంగనీతులు, యువరాజు, ప్రేమ కానుక, ప్రేమాభిషేకం, పిల్ల జమిందార్, బుచ్చిబాబు మొదలైన సినిమాలను నటిస్తూ నిర్మించారు. ప్రేమాభిషేకం సూపర్ డూపర్ హిట్ అయి, చరిత్రనే సృష్టించింది.
ప్రయోగ శీలి
నిర్మాతగా ప్రయోగాలకు కూడా ముందడుగు వేశారు నాగేశ్వరరావు. తన అభిమాన, ఆస్థాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో కలిసి సుడిగుండాలు, మరో ప్రపంచం చిత్రాలను తీశారాయన. అశ్లీల సాహిత్యం పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతుందో సుడిగుండాలులో చెప్పారు. పిల్లలను ఎలా తీర్చిదిద్దాలో, ఎలాంటి విద్యను నేర్పించాలో మరో ప్రపంచం చిత్రంలో మరో కోణం చూపించారు.
చిరంజీవికి ఆదిగురువు!
తెలుగు చిత్రసీమలో హీరోలు నృత్యాలు చేయడం అక్కినేనితోనే మొదలయ్యింది. నాటకాల్లో ఆడపాత్రలు వేసిన అనుభవం కూడా ఆయనకు పనికొచ్చింది. నాగేశ్వరరావు డ్యాన్సుల్లో ఒక అందం ఉంటుంది. స్టెప్పుల్లో చక్కటి స్టైల్ కనిపిస్తుంది. ‘నిలువవే వాలు కనులదానా’ అంటూ ‘ఇల్లరికం’ చిత్రంలో అక్కినేని వేసిన స్టెప్పులు అందరినీ అలరించాయి. స్టెప్పుల్లో స్పీడు పెంచింది కూడా ఆయనే. ‘దసరా బుల్లోడు’లో నాగేశ్వరరావు స్టెప్పుల వేగం పండిత పామరులను మెప్పించింది. ‘అతి’ అనిపించకుండా డ్యాన్స్ చేయడం ఆయనకే చెల్లు. ‘నృత్యాల్లో అక్కినేనే నా ఆదిగురువు’ అని చిరంజీవి ఓ సందర్భంలో పేర్కొన్నారు.
అభిమానుల ‘అందాల రాముడు’!
తనకు సాయపడినవారి పట్ల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలుపుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. తను అభిమానించేవారిని ఆదరించే సంస్కారం ఆయనది. బాపు, రమణలు సినిమాల్లోకి రాకముందు నుంచీ వారన్నా, వారి ప్రతిభన్నా అక్కినేనికి అభిమానం. బాపు తొలిచిత్రం ‘సాక్షి’ చూసి, ‘నాతో తీసి ఉంటే, మొదటి వారంలోనే మీ పెట్టుబడి వచ్చేసే’దన్నారు. ‘మంచి కథ తయారుచేయండి, నా కాల్‌షీట్లు ఇస్తాను’ అన్నారు. ఎంతో డిమాండ్‌లో ఉండీ, కాల్‌షీట్లిస్తానంటూ తనే ముందుకొచ్చిన సహృదయుడు, ‘బుద్ధిమంతుడు’, ‘అందాల రాముడు’ అక్కినేని!
సినిమా నటులకు పిల్లల్ని ఇవ్వడానికి వెనుకాడే తల్లిదండ్రులున్న రోజుల్లో... తనను వివాహమాడటానికి ముందుకొచ్చిన అన్నపూర్ణను పువ్వుల్లో పెట్టుకుని చూసిన మంచి భర్త నాగేశ్వరరావు. ఆమె పేరుమీదే స్టూడియోను నిర్మించి, చిరస్మరణీయురాలిని చేసిన సంస్కారవంతుడు. పెద్ద హీరో అయ్యాక కూడా తల్లి కాళ్లు పడుతున్న నాగార్జునను చూసి ఆనందభాష్పాలు రాల్చిన మంచి నాన్న. కోట్లు సంపాదించి, ఇంట్లో ఎన్నో కార్లు ఉన్నా కష్టనష్టాలు తెలియాలనే ఉద్దేశంతో పిల్లల్ని స్కూలుకు బస్సుల్లో పంపిన ముందుచూపున్న చక్కని క్రమశిక్షణ గల తండ్రి. అయిదారేళ్ల మనవడు, నేటి హీరో సుమంత్... ఇంట్లో కరెంటు పోయి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, తన ఏసీ కారులో పక్కన కూర్చోబెట్టుకుని, గంటల తరబడి, హైదరాబాద్ రోడ్లపై తిప్పిన మా మంచి తాతయ్య.
సినిమా పిలుపు వచ్చినప్పుడు తమ నాటక సమాజంలోని మేకప్‌మ్యాన్ మంగయ్యను ‘వెళ్లమంటారా’ అని అక్కినేని అడిగారు. ‘వాళ్లుగా పిలిచినప్పుడు వెళ్లడమే మంచిది. రాణించకపోతే నాటకాలు ఎలానూ ఉంటాయి’ అని పెద్దాయన సలహా ఇచ్చారు. ఆ అభిమానంతో ఆయన కుమారుడిని అక్కినేని తమ అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ చీఫ్‌గా తీసుకుని తన కృతజ్ఞతను తెలుపుకున్నారు.
అవార్డులు, రివార్డులు!
సాంఘిక చిత్రాల స్టయిలిష్ హీరోగా మాస్‌తో పాటు మహిళల ఆరాధననూ అందుకున్నారు. సినిమాల్లో సిగరెట్ కాల్చేటప్పుడు కూడా అక్కినేనిలో ఓ స్టైల్ కనిపిస్తుందని సహజ నటి జయసుధ ఓ సందర్భంలో ప్రశంసించారు. నటసమ్రాట్ నాగేశ్వరరావుకు ప్రేక్షకులిచ్చిన బిరుదు. కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలతో సత్కరించింది. తెలుగు సినిమాలు ఉన్నంతవరకూ అక్కినేని పంచిన నటనా వెలుగులు ప్రకాశవంతంగా ఉంటాయి. డెబ్భై అయిదేళ్ల ఆయన నట జీవితం అజరామరం.
- కె.వి.ఎస్.వర్మ