
వెటరన్ వేల్
సామువేల్ వయసు 56. ఆయన సాధించిన పతకాలు 439. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ కైవండూరు గ్రామానికి చెందిన ఈ క్రీడాకారుని గొప్పతనానికి నిదర్శనంగా ఇది మనం చెప్పుకుంటున్న సంఖ్య కాదు. ఆ మాట కొస్తే సామువేల్ ఒక్క పతకం సాధించడం కూడా విశేషమే. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ నాటికీ ఆయన క్రీడల్లో రాణిస్తున్నారు.
ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు కోయంబత్తూరులో రాష్ట్రస్థాయి పరుగు పందెంలో పాల్గొనే అవకాశం వచ్చింది సామువేల్‌కు. పరుగున వెళ్లి తల్లికి చెప్పాడు. ‘‘బుద్ధిగా చదువుకో. లేదంటే పశువులు తోలుకో. ఎందుకూ పనికి రాని ఆ ఆటల వెంట పరుగెత్తి జీవితాన్ని పాడు చేసుకోకు’’ అని గట్టిగా చెప్పింది ఆమె. బిడ్డ చదువు విషయంలో తల్లి ఎంత స్థిరంగా ఉందంటే, 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించుకు వచ్చినా కూడా ఆమె సంతోషించలేదు.
‘‘ఈ తెలివితేటలు చదువులో చూపించు’’ అంది. సామువేల్ కంటతడి పెట్టుకున్నాడు. ఆటలంటే బిడ్డకు ఎంత ఇష్టమో తల్లిదండ్రులకు తెలుసు. కానీ ఏం చేయగలరు. ఆ కుటుంబానికి కావలసింది పతకాలు కాదు. తినడానికిన్ని మెతుకులు. తల్లిదండ్రుల మాటలు తనను నిరాశపరచలేదు. రకరకాల పరుగు పందేలలో ఎన్నో పతకాలు సాధించాడు సామువేల్.
అర్ధాంగి అండగా నిలిచింది
తల్లిదండ్రులు చనిపోయాక సామువేల్‌కి లలితతో వివాహం అయింది. ఆ వెంటనే.. కుటుంబ పోషణ కోసం ఆటలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన మెడల్స్ చూసుకుని బోరున ఏడ్చేవాడు. ఓ రోజు అలా ఏడుస్తుండగా భార్య అతడిని చూసింది. ‘‘ప్రతిభ ఉండి నువ్వెందుకు ఆటలు మానేయాలి?’’ అని అడిగింది. నీ వెనుక నేనున్నానంది. ఇక సామువేల్ ఆగలేదు. తనకు ప్రాణపదమైన ఆటల్లోకి మళ్లీ అడుగుపెట్టాడు. ఒక వైపు కూలి పనులు, గోడ ల మీద రాత పనులు చేసుకుంటూనే ప్రాక్టీస్ మొదలు పెట్టి ఎన్నో పతకాలు సాధించాడు. తన సుదీర్ఘ క్రీడా ప్రస్థానంలో ఇంతవరకు సింగపూర్, మలేషియా, టాంజానియా, లండన్ కూడా వెళ్లి రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్‌లలో పాల్గొనివచ్చాడు! చాంపియన్‌గా, వెటరన్ క్రీడాకారునిగా సామువేల్ ఇప్పటి వరకు సాధించిన నాలుగు వందలకు పైగా పతకాలలో 18 అంతర్జాతీయ మెడల్స్ కూడా ఉన్నాయి. తను క్రీడాకారునిగా ఎదిగే క్రమంలో గ్రామస్థుల ప్రశంసలు ఎంతో మనోబలాన్నిచ్చాయని సామువేల్ అంటారు.
ఎప్పటికీ మరచిపోలేను
మావారికి 1989లో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పటికి నేను ఎనిమిది నెలల గర్భిణిని. నా మెడికల్ చెకప్ కోసం దాచిన 80 రూపాయలను ఆయన చేతికిచ్చి తూత్తుకుడి పంపా. విషయం తెలిసి బంధువులు తిట్టారు. నేను పట్టించుకోలేదు. ఆయన పోటీలకు వెళ్లారు. బంగారు పతకంతో తిరిగివచ్చి ‘‘లలిత లేకుంటే నాకు ఈ పతకం వచ్చేదే కాదు’’ అంటూ గ్రామంలో జరిగిన సన్మాన సభలో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను.
- లలిత, సామువేల్ భార్య