ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, కొలిచిన భక్తుల కొంగు బంగారమై విజయనగర వాసులను చల్లగా కాపాడుతోంది శ్రీ పైడితల్లి అమ్మవారు. విజయనగరంలో వెలిసిన ఆ తల్లి ఖ్యాతి రాష్ట్రాలు ఎప్పుడో దాటేసింది. ఏటా నెలరోజుల పాటు నిర్వహించే ఈ పండుగ రాష్ట్రంలో ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ పండుగలో సిరిమానోత్సవం నభూతో నభవిష్యత్ అనిపించేలా జరుగుతుంది.
ఈ ఏడాది అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 8 నుంచి మొదలయ్యాయి. ఈ నెల 23న (మంగళవారం) సిరిమానోత్సవం జరుగుతుంది. నవంబరు 7తో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెలరోజులూ వివిధ రకాలుగా అమ్మవారికి నిత్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏ ఊరిని తుపాను ముంచెత్తినా, ఏ ఊళ్లో కల్లోలాలు చెలరేగినా విజయనగరం పట్టణం మాత్రం ప్రశాంతంగా ఉండటాన్ని అమ్మవారి మహిమకు నిదర్శనంగా ఇక్కడిప్రజలు నమ్ముతుంటారు.
అన్నను వారించి..ఆత్మార్పణ
సుమారు 260 ఏళ్ల క్రితం విజయనగరం సంస్థానం ఆడపడుచుగా జన్మించింది పైడిమాంబ. ఆమెకు తన సోదరుడు పెద విజయరామరాజు అంటే ఎనలేని అభిమానం. రాజ్యపోరులో భాగంగా బొబ్బిలి యుద్ధం వచ్చింది. విజయరామరాజు యుద్ధా్దనికి సన్నద్ధమయ్యాడు.
కానీ యుద్ధం ఇష్టంలేని పైడిమాంబ ‘అన్నా ఈ యుద్ధం మన ప్రజలకు క్షేమం కాదు. నువ్వు ఎంత మాత్రం యుద్ధం చేయకు.’ అని అన్నను బతిమలాడింది. విజయరామరాజు ఆమె మాటలను వినకుండా వెళ్లి యుద్ధంలో వీరమరణం పొందాడు. అన్న క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి బయలుదేరిన పైడిమాంబ అన్న మృతి చెందాడన్న వార్త విని సొమ్మసిల్లిపోయింది. కాసేపటికి తేరుకుని సమీపంలో ఉన్న పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకుని తాను నిత్యం కొలిచే కనకదుర్గమ్మలో ఐక్యమైంది.
పతివాడ కలలో అమ్మ సాక్షాత్కారం
పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకున్న పైడిమాంబ చిన్నప్పటి నుంచి దుర్గాదేవి భక్తురాలు. ఆత్మార్పణ తర్వాత తన అన్న విజయరామరాజుకు అత్యంత సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడు కలలో సాక్షాత్కరించి, పెద్దచెరువులో పశ్చిమ దిక్కున నా విగ్రహం ఉంది. దాన్ని బయటకు తీసి, ప్రతిష్ఠించి పూజలు చేయాలని చెప్పి అదృశ్యమైంది.
వెంటనే పతివాడ అప్పలనాయుడు ఊరి ప్రజలకు ఈ విషయాన్ని వివరించి పెద్దచెరువులో వెతకగా జాలరి వలలో విగ్రహం పడింది. దానిని బయటకు తీసి ఆ పెద్దచెరువు వద్దనే (ప్రస్తుతం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి)లో ప్రతిష్టించారు. తర్వాతకాలంలో భక్తుల సౌకర్యార్ధం మూడులాంతర్లు వద్ద చదురుగుడిని నిర్మించి పైడిమాంబను ప్రతిష్ట చేశారు. అప్పటినుంచి అప్పలనాయుడు వంశీకులే ఏటా సిరిమానును అధిష్టించి అమ్మవారి అంశంగా భక్తుల పూజలందుకుంటున్నారు.
పుట్టినిల్లు..మెట్టినిల్లు
స్థానిక రైల్వేస్టేషన్‌కి సమీపంలో వనంగుడిగా పిలుచుకుంటున్న పైడిమాంబ అమ్మవారి ఆలయం ఉంది. వనం అంటే అడవి కనుక దీన్ని వనంగుడి అన్నారు. దీన్ని అమ్మపుట్టినిల్లుగా భావిస్తారు. ఊరిమధ్యలో చదురుగుడి ఉంది. దీన్ని మెట్టినిల్లుగా పిలిస్తున్నారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలు (బిందెలు, కుండలు) ఉంటాయి. ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దాని కిందనే అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు పూజలందుకుంటున్నాడు.
అమ్మే సిరిమానుకు దారి చూపిస్తుంది
సిరిమానుకు కావాల్సిన చెట్టును పూజారికి పైడిమాంబ కలలో కనిపించి చూపిస్తుందని, అది తప్పనిసరిగా చింతచెట్టు అయి ఉంటుందనీ నమ్మకం. అమ్మ చూపిన దిక్కుగా వెతుక్కుంటూ వెళ్లిన పూజారి చెట్టును గుర్తించి భక్తులు, అధికారుల సమక్షంలో సేకరిస్తారు. ఈ ఏడాది సిరిమాను బొండపల్లి మండలం కనిమెరక గ్రామంలో సిరిమాను, ఇరుసుమాను ఒకేచోట కనిపించాయి. సిరిమానుకు ఆనవాయితీ ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం పట్టణంలోని హుకుంపేటకు తరలించి, అక్కడచెక్కి, నునుపైన మానుగా తీర్చిదిద్ది ఉత్సవానికి సిద్ధం చేస్తారు. ఆలయం నుంచి కోటవరకూ సిరిమాను మూడుసార్లు తిరుగుతుంది. అనేక జానపద వేషధారణలు ముందు నడువగా, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటాయి.
తొలేళ్ల సంబరాలు
సిరిమానోత్సవం ముందురోజు రాత్రి చదురుగుడి వద్ద నుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాలతో కోటలోనికి తీసుకువెళతారు. కోటలో ఉన్న రౌండ్‌మహల్ వద్దకు వెళ్లిన తర్వాత అమ్మవారి చరిత్రను స్తుతిస్తూ రాగయుక్తంగా గానం చేస్తారు. అక్కడ పూజల అనంతరం ఘటాలు చదురుగుడి వద్దకు తరలిస్తారు. ఆ గుడి ఎదురుగా ఒక బడ్డీని ఏర్పాటుచేసి అక్కడ ఘటాలను ఉంచుతారు. తెలంగాణా ప్రాంతంలో జరిగే బోనాల ఉత్సవంలో వినిపించే భవిష్యవాణì మాదిరిగానే ఇక్కడ కూడా పైడిమాంబ మాటగా పూజారి భవిష్యవాణిని వినిపిస్తారు. అప్పటికే పూజారిపై ఆవహించిన పైడిమాంబ తన మాటగా భక్తులకు భవిష్యవాణి వివరిస్తుంది.
రాబోయే ఏడాదికాలంలో జరిగే మంచిచెడులతోపాటు పాడిపంటల విషయంలోనూ, ఈ ప్రాంతం అభివృద్ధి ఎలా ఉంటుందనేది అమ్మ పలికిస్తుంది. ఉపద్రవాలు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచిస్తుంది. ఆ భవిష్యవాణిని వినేందుకు రైతులు అక్కడకు చేరుకుంటారు. ఆ తర్వాత పూజారి ధాన్యపు గింజలను రైతులకు అందజేస్తారు. వాటిని తమ పొలాల్లో తొలివేరుగా విత్తుకుంటే ఆ ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల నమ్మకం. తొలేళ్ల ఉత్సవం సందర్భంగా వివిధ వేషధారణలతో పట్టణం కళకళలాడుతుంది. ఈ రాత్రంతా భక్తులు జాగారం మాదిరిగా పట్టణంలో కలియదిరుగుతారు. ఈ నెల 22న అంటే నేడు తొలేళ్ల ఉత్సవం నిర్వహిస్తున్నారు.
విజయదశమి తర్వాత మంగళవారమే సిరిమానోత్సవం
పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకున్న పైడిమాంబను విగ్రహరూపంలో చెరువు నుంచి బయటకు తీసి గుడిలో ప్రతిష్టించినది విజయదశమి తర్వాత వచ్చిన మంగళవారం రోజున అని ప్రతీతి. అందుకని ప్రతీ ఏటా విజయదశమి వెళ్లిన తర్వాత వచ్చే తొలి మంగళవారం (ఈనెల 23న) రోజున అమ్మవారికి సిరిమానోత్సవం నిర్వహిస్తారు. ఇలాంటి ఉత్సవం దేశంలో మరెక్కడా ఉండదు. దాదాపు 50 నుంచి 60 అడుగుల పొడవుండే సిరిమాను (చింతమాను)కు ఆసనం అమర్చి ఆ ఆసనంలో పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా కూర్చోబెట్టి చదురుగుడి వద్ద ఉన్న ఆలయం నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు.
సిరిమాను ఊరేగింపు సాగినంత మేర భక్తులు పారవశ్యంతో అరటిపండ్లు, పూలు, ఇతర ప్రసాదాలను సిరిమాను మీదకు విసురుతూ అమ్మ దీవెనలు అందుకుంటారు. పూసపాటి వంశస్తులు తరలివచ్చి తమ ఇంటి ఆడపడుచుకు లాంఛనాలు సమర్పించుకుంటారు. సిరిమాను బయలుదేరుతుందనగా ముందు అమ్మ విగ్రహాన్ని వెలికి తీసిన వలకు గుర్తుగా బెస్తవారి వలను నడిపిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు పలువురు ఈటెలను ధరించి పాలధారగా అమ్మ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి డప్పు వాయిద్యాలతో మహారాజ కోట పశ్చిమభాగంవైపు వెళ్లి, కోటశక్తికి నమస్కరిస్తారు. వీరంతా సైనికులుగా ఆ సమయంలో పనిచేస్తారు.
సిరిమాను జాతరలో అంజలి రథానిది ఓ విలక్షణమైన స్థానం. సిరిమానుకు అంజలి ఘటిస్తూ ముందుకు సాగే రథంపై ఐదుగురు పురుషులు స్త్రీల వేషాలను వేసుకుని కూర్చుంటారు. వీరంతా ఆరుమూరెల నారచీరను, చేతికి వెండి ఆభరణాలను ధరించి సంబరంలో పాల్గొంటారు. స్త్రీ వేషధారణలో ఉన్న వీరంతా అమ్మవారి పరిచారకులకు ప్రతీకలుగా వ్యవహరిస్తారు. వీరంతా అక్షింతలు పట్టుకుని సంబరం జరుగుతున్నంత సేపూ భక్తులపై విసురుతూ ఉంటారు. దానికి ప్రతిగా భక్తులు భక్తిభావంతో అరటిపళ్లను వారిపై విసురుతూ ఉంటారు.
– బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం.
Comments
Please login to add a commentAdd a comment