వనంలో వెలిసిన దేవత.. ప్రకృతి స్వరూపిణి.. పైడితల్లి | Vizianagaram Pydithalli Ammavaru Story, History, Vanam Gudi, Addala Mandapam | Sakshi
Sakshi News home page

వనంలో వెలిసిన దేవత.. ప్రకృతి స్వరూపిణి.. పైడితల్లి

Published Sat, Oct 8 2022 8:03 PM | Last Updated on Sat, Oct 8 2022 8:10 PM

Vizianagaram Pydithalli Ammavaru Story, History, Vanam Gudi, Addala Mandapam - Sakshi

వనంగుడిలో అద్దాల మంటపం

విజయనగరం టౌన్‌: పైడితల్లమ్మ చరిత విన్నా.. తెలుసుకున్నా.. ఎంతో పుణ్యఫలం. ఆ తల్లిని మదిలో స్మరిస్తూ కోర్కెలు కోరితే.. అవి తీరిన కొద్దిరోజుల్లోనే ప్రపంచంలో ఎక్కడున్నా పైడితల్లిని దర్శించుకునేందుకు తరలివస్తారు. అక్కడితో ఆగకుండా ఏటా అమ్మను దర్శించుకోవడానికి తొలేళ్ల నుంచి సిరిమానోత్సవం వరకూ ఇక్కడే ఉండి పసుపు, కుంకుమలతో మొక్కుబడులు చెల్లిస్తారు. చల్లంగా చూడుతల్లీ.. మళ్లీ వచ్చి దర్శించుకుంటామంటూ ప్రకృతి స్వరూపిణిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు. అంతటి మహిమాన్వితమైన పైడితల్లమ్మ వెలిసింది విజయనగరంలోని రైల్వేస్టేషన్‌ వద్దనున్న వనంగుడిలోనే.. 
 

వనంలోనే సాక్షాత్కారం

పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడికి వెళ్లడం ఆనవాయితీ. సిరిమానోత్సవం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కోటశక్తికి విశేష పూజలు నిర్వహిస్తారు. అయితే అమ్మ సాక్షాత్కరించింది మాత్రం వనంలోనే. అప్పట్లో స్థానిక రైల్వేస్టేషన్‌ ప్రదేశం పూర్తి అటవీ ప్రాంతం. పెద్దచెరువు దాటిన తర్వాత  అంతా దట్టమైన అరణ్యప్రాంతం. పెద్దచెరువు పశ్చిమభాగాన వనంతో కలిసి ఉన్న చెరువులో వెలిసిన చిన్నారి పెడితల్లి ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. 

అన్నను వారించినా..  
బొబ్బిలి యుద్ధం సమయంలో రాబోయే ఉపద్రవాన్ని గుర్తించి తన అన్న విజయరామరాజును పైడితల్లమ్మ ముందే హెచ్చరించింది. యుద్ధం వద్దని చెప్పి వారించినా ఆమె మాటను సోదరుడు పెడచెవిన పెట్టాడు. యుద్ధంలో  విజయరామరాజును తాండ్రపాపారాయుడు హతమార్చాడు. పెద్దవిజయరామరాజును రక్షించుకోవాలని చిన్నారి పైడితల్లి.. పతివాడ అప్పలనాయుడు సహాయంతో యుద్ధం జరిగిన స్థలానికి బయలుదేరింది.  వారిద్దరూ  కోట దగ్గర నుంచి బయల్దేరి పెద్దచెరువు వద్దకు వచ్చేసరికి అన్న మరణవార్త చెవిన పడడంతో తట్టుకోలేక పోయిన ఆమె అన్నంటే ఎంతో అభిమానం, వాత్సల్యం ఉండడంతో.. తాను నిత్యం పూజించే మహాశక్తిని ప్రార్ధిస్తూ పెద్దచెరువులో దూకి దుర్గాదేవిలో లీనమైపోయింది.    
 

పెద్దచెరువులో ప్రతిరూపాలు 

అదేరోజు రాత్రి  పతివాడ అప్పలనాయుడు కలలో కనిపించి .. తన ప్రతిరూపాలు పెద్దచెరువు పశ్చిమభాగంలో లభ్యమవుతాయని, వాటిని తీసి ప్రతిష్టించి పూజలు చేయాలని కోరింది. ఆ ప్రకారంగానే రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న పెద్దచెరువులో బెస్తవారి సహాయంతో వెతగ్గా ఆ నీటిలో ఓ మెరుపులా సాక్షాత్కరించి తానిక్కడ ఉన్నాననే సంకేతాన్నిచ్చింది. వెంటనే వారు ఆ ప్రదేశంలో వెతకగా విగ్రహాలు లభ్యమయ్యాయి. అనంతరం అమ్మవారిని  ప్రతిష్టించి గుడి నిర్మించారు. అప్పట్లో ఆ ప్రాంతమంతా దట్టమైన అరణ్యం కావడంతో వనంగుడి అని పేరువచ్చింది. సిరిమానోత్సవాన్ని చదురు కట్టి నిర్వహించడం, కోటశక్తికి పూజలు చేయడం మూలంగా చదురుగుడి వద్ద సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా మారింది.  
 
వనంగుడిలో దుర్గమ్మ, ముత్యాలమ్మ 
వనంగుడిలో అమ్మవారికి ఇష్టమైన  దుర్గాదేవి, ముత్యాలమ్మ అమ్మవార్లు కొలువై పూజలందుకుంటున్నారు. ప్రతి నెలా మూలా నక్షత్రం రోజున దుర్గమ్మకు, అమ్మవారికి చండీహోమం శరన్నవరాత్రుల రోజుల్లో దుర్గాదేవికి అలంకరణలు, లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. అమ్మవారి పాత విగ్రహానికి ఆలయం వెనుక ఉన్న ప్రత్యేక గది కట్టి నిత్యపూజలందిస్తున్నారు. రైల్వేస్టేషన్‌ ప్రాంతం కావడంతో నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి తరిస్తారు.  
 
అమ్మవారికి అద్దాల మంటపం 
2008లో వనంగుడిలోనే  అమ్మవారికి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాదేవికి ఉన్న విధంగానే అద్దాల మంటపం ఏర్పాటుచేశారు. ఈ మంటపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఊయలలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఊంజల్‌ సేవలు నిర్వహిస్తారు. రోజూ పంచహారతుల అనంతరం సేవ నిర్వహిస్తారు. భక్తులు అద్దాల మంటపంలోని ఉయ్యాలలో అమ్మవారి చిత్రపటానికి మొక్కి ప్రదక్షిణలు చేస్తారు. 


అమ్మవెలిసింది ఇక్కడే

ఉత్తరాంధ్రుల కొంగుబంగారం పైడితల్లి ఆలయం విశిష్ట చరిత్రకు మారుపేరు. ఇక్కడ బలిహరణ ప్రాంతం వెనుక కూడా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పైడితల్లి అమ్మవారి ఆలయంతో పాటు ఈ ప్రదేశాన్ని కూడా భక్తులు  కొలుస్తారు. దీన్ని భక్తిపూర్వకంగా తాకుతూ అమ్మను ప్రార్థిస్తారు. గుడిలో బలిహరణ ప్రదేశం వద్ద భోగం పెట్టడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. నాడు పైడితల్లి అమ్మవారిని ప్రతిష్టించిన ప్రదేశం కావడమే దీనికి కారణం. అమ్మవారికి మొక్కులు చెల్లించే భక్తులు ఇక్కడే ముందుగా పసుపు, కుంకుమలు సమర్పిస్తారు.

ముందుగా  బలిహరణం చేతులతో స్పర్శించి, కళ్లకద్దుకుంటూ అమ్మను చూసేందుకు ముందుకు వెళతారు. అప్పట్లో ఆలయం పెద్ద చెరువుకు ఎదురుగా ఉండేది. కానీ జనసంచారం దృష్ట్యా ఆలయాన్ని దాదాపు 15ఏళ్ల కిందట రైల్వేస్టేషన్‌ వైపు ముఖ ద్వారం ఉంచి అభివృద్ధి చేశారు. అయితే తొలుత పూజలందుకున్న విగ్రహాలు అవసాన దశకు చేరుకోవడంతో చిన్న తల్లి విగ్రహాలను భీమునిపట్నం సముద్రంలో వేదమంత్రోచ్చారణలతో కలిపేశారని పెద్దలు చెబుతుంటారు. అందులో ఒక విగ్రహం తిరిగి ఒడ్డుకు వచ్చిందని, అదే విగ్రహాన్ని వనంగుడి బాలాలయంలో ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.  


ఆలయాన్ని దర్శిస్తే ఈడేరనున్న కోరికలు  
 
పైడితల్లి అమ్మవారు వెలిసిన వనంగుడి విశాలమైన ప్రాంతంలో నిర్మించారు. అమ్మవారు ఎక్కడైతే పెద్దచెరువులో పతివాడ అప్పలనాయుడుకు సాక్షాత్కరించారో అదేస్థలంలో వనంగుడి నిర్మించడం, అమ్మవారు లభ్యమైనచోటే విగ్రహ ప్రతిష్టాపన చేయడం వల్ల మనస్ఫూర్తిగా మొక్కిన మొక్కులు వెంటనే నెరవేరుతాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. దాదాపు రెండు శతాబ్దాల చరిత్రలో అమ్మవారు భక్తులను పండగరోజు చిన్నపాటి చినుకులతో ఆశీర్వదిస్తూ ఉంటారు. తల్లిని దర్శించి మొక్కులు మొక్కిన వారందరూ కేవలం నెలల వ్యవధిలోనే తిరిగి తమ కోర్కెలు నెరవేరాయని, సత్యమైన తల్లి అంటూ అంగరంగ వైభవంగా ఆనందోత్సవాలతో మొక్కుబడులు చెల్లిస్తుంటారు. సిరిమానోత్సావానికి ఉత్తరాంధ్రా నుంచే కాకుండా ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి, ఎన్‌ఆర్‌ఐలు, విదేశీయులు వచ్చి ఉత్సవాన్ని తిలకిస్తారు. (క్లిక్ చేయండి: సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు)


తల్లిసేవలో తరిస్తున్నా.. 

మా నాన్నగారు నేతేటి శ్రీనివాస్‌  సిరిమాను అధిరోహించారు. పైడితల్లికి సేవ చేసే భాగ్యం నాకు దక్కింది. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మసేవలో తరిస్తున్నాను. ఎందరో భక్తులు అమ్మ మహిమలతో పాటు వారికి కలిగిన మంచి పనుల గురించి నాతో వారి అనుభవాన్ని పంచుకుంటారు.            
– నేతేటి ప్రశాంత్, వనంగుడి అర్చకుడు, విజయనగరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement