సాక్షి, విజయనగరం: శ్రీపైడితల్లమ్మ సిరిమానోత్సవం కన్నుల పండువగా జరిగింది. పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. సిరిమానోత్సవాన్ని తలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు విశేషంగా ఆకట్టుకునే సిరిమానోత్సవంలో సుమారు 55 అడుగులు నుంచి 60 అడుగుల వరకూ పొడవున్న సిరిమాను ఉపరితలంలో బిగించే ఇరుసుపై ఏర్పాటుచేసిన పీటపై ప్రధాన పూజారి విసనకర్ర చేతబట్టి ఆశీనులయ్యారు. (చదవండి: అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రార్థించాను: బొత్స)
రెండో చివరన రథంపై అమర్చిన ఇరుసును మానుకు అమరుస్తారు.దాని ఆధారంగానే మాను పైకిలేస్తుంది. గజపతిరాజు వంశీయులు తరఫున ఒకరు తాడు లాగడంతో ప్రారంభమయ్యే సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజా బజారు మీదుగా కోట వరకూ మూడుసార్లు తిరిగింది. ఊరేగింపు అద్యంతం విసనకర్ర విసురుతూ కనిపించే సిరిమాను పూజారిని భక్తులు అరటిపండ్లతో కొలిచారు. సిరిమానోత్సవం.. ఈ పేరు వింటే భక్తకోటి పరవశించిపోతుంది. ఆ అద్భుత ఘడియలను కనులారా వీక్షించేందుకు పరితపిస్తుంది. ఆద్యంతం ఆసక్తి గొలిపే సిరిమానోత్సవానికి ఏటేటా ఆదరణ పెరిగిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment