Sirimanotsavam 2024: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి సిరిమాను సంబరానికి విజయనగరం సిద్ధమవుతోంది. ఊర్లకు ఊర్లే కదిలి వచ్చే ఈ జనజాతరతో విజయనగరం వీధులు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతాయి. దారులన్నీ జన సెలయేరులై విద్యలనగరివైపు సాగిపోతుంటాయి. కొలిచినవారికి కొంగు బంగారమై.. కోరిన కోర్కెలెల్లా నెరవేర్చే పైడిమాంబ అంటే ఉత్తరాంధ్రులకు అంత నమ్మకం మరి.. 260 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా రాష్ట్ర పండుగగా వాసికెక్కింది. ఏటా విజయనగరం వీధుల్లో కనులపండువగా జరిగే ఈ జనజాతరకు లక్షలాది మంది తరలివస్తారు. 260 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం నెల రోజుల పాటు జరుగుతుంది. మహిళలు ప్రతి రోజూ ఘటాలు నెత్తిన పెట్టుకుని అమ్మకు నివేదన చేస్తారు. ఆశ్వయుజ మాసంలో విజయదశమి మరుసటి సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రకారం ఈనెల 14వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 15వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
బొబ్బిలి యుద్ధం నేపథ్యంలో...
విజయనగరం రాజు పూసపాటి విజయరామగజపతిరాజు సోదరే పైడితల్లి. బొబ్బిలి సంస్థానంతో యుద్ధానికి వెళ్లవద్దని, తన మనసు కీడు శంకిస్తోందని సోదరుడిని వారించిందట. అయినా యుద్ధం ఆగలేదు. 1757 జనవరి 23న జరిగిన బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు చేతిలో తన అన్న వీరమరణం పొందాడని తెలుసుకున్న పైడితల్లి విజయనగరం పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకుంది. సేవకుడైన పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి ఆమె చెప్పిన ప్రకారం ఆ చెరువులో జాలర్లతో వెతికిస్తే విగ్రహం దొరికింది. అక్కడే గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విజయనగరం రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న వనంగుడి అదే.
రసవత్తరంగా సిరిమానోత్సవం...
సిరిమానోత్సవం తిలకించడానికి ఈసారి ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సిరిమాను 55 నుంచి 60 అడుగుల పొడవుంటుంది. దాని చివరిభాగంలో ఇరుసు బిగించి పీట ఏర్పాటు చేస్తారు. ఆ పీటపై ఆలయ ప్రధాన పూజారి కూర్చుంటారు. సిరిమాను వేరొక చివర రథంపై అమర్చుతారు. సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజాబజారు మీదుగా కోట వరకూ మూడుసార్లు సాగుతుంది. ఈ సిరిమాను ముందుండే బెస్తవారివల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఉత్సవానికి భక్తుల రద్దీ దృష్ట్యా 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
చదవండి: బాబు గారి ‘కొవ్వు’ బాగోతం బట్టబయలు
నెల రోజుల పండగ
సెపె్టంబర్ 20వ తేదీన పందిరి రాటతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్యంత అట్టహాసంగా జరిగే తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం ఇందులో భాగమే. అలాగే ఈ నెల 22వ తేదీన తెప్పోత్సవం, 27న కలశ జ్యోతుల ఊరేగింపు, 29న ఉయ్యాలకంబాల ఉత్సవం, 30న చండీయాగం, పూర్ణాహుతితో పైడితల్లి అమ్మవారి జాతర ముగుస్తుంది. విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి వనంగుడి, మూడులాంతర్లు జంక్షన్ వద్ద ఉన్న చదురుగుడిలో విశిష్ట కుంకుమార్చనలు, అభిషేకాలు నెల రోజులు కొనసాగుతాయి. నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డుల్లోని మహిళలు రోజుకొక వార్డు చొప్పున ఘటాలను సమర్పిస్తుంటారు. అమ్మవారికి చీర, రవికె, సారె ఇచ్చి చల్లదనం చేస్తారు. పప్పు బియ్యం, చలివిడి నైవేద్యంగా సమర్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment