కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, కొలిచిన భక్తుల కొంగు బంగారమై విజయనగర వాసులను చల్లగా కాపాడుతోంది పైడితల్లి అమ్మవారు. విజయనగరంలో వెలిసిన ఆ తల్లి ఖ్యాతి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. ఏటా నెలరోజుల పాటు నిర్వహించే పండగే ఓ ప్రత్యేకతైతే ఆ పండుగలో సిరిమానోత్సవం నభూతో నభవిష్యత్ అనిపించేలా జరుగుతుంది. ఈ ఏడాది అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 19 నుంచి మొదలయ్యాయి. వచ్చే నెల 3వ తేదీన సిరిమానోత్సవం జరుగుతుంది. 18వ తేదీతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల రోజులూ అమ్మవారికి నిత్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయనగరంలో అమ్మవారు వెలిసిన నాటి నుంచి ఏ ఊరిని తుఫాను ముంచెత్తినా, ఏ ఊళ్లో కల్లోలాలు జరిగినా విజయనగరం మాత్రం ప్రశాంతంగా ఉండటాన్ని అమ్మవారి అనుగ్రహానికి నిదర్శనంగా నమ్ముతుంటారు.
విజయనగర సంస్థానాధీశుల ఆడపడచు పైడిమాంబ బాల్యం నుంచి దుర్గాదేవి భక్తురాలు. కొన్ని కారణాంతరాల వల్ల ఆత్మార్పణ చేసుకుంది. ఆ తర్వాత తన అన్న విజయరామరాజుకు అత్యంత సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడు కలలో సాక్షాత్కరించి, పెద్దచెరువులో పశ్చిమదిక్కున నా విగ్రహం ఉంది. దాన్ని బయటకు తీసి, ప్రతిష్ఠించి పూజలు చేయాలని చెప్పి అదృశ్యమైంది. వెంటనే పతివాడ అప్పలనాయుడు ఊరి ప్రజలకు ఈ విషయాన్ని వివరించి పెద్దచెరువులో వెతకగా జాలరి వలలో విగ్రహం బయటపడింది. దానిని బయటకు తీసి ఆ పెద్దచెరువు వద్దనే (ప్రస్తుతం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి)లో ప్రతిష్టించారు. తర్వాతకాలంలో భక్తుల సౌకర్యార్ధం మూడులాంతర్లు వద్ద చదురుగుడిని నిర్మించి పైడిమాంబను ప్రతిష్ట చేశారు. అప్పటినుంచి అప్పలనాయుడు వంశీకులే ఏటా సిరిమానును అధిష్టించి అమ్మ అంశగా పూజలందుకుంటున్నారు. స్థ్ధానిక రైల్వేస్టేషన్‌కి సమీపంలో పైడిమాంబ అమ్మవారి ఆలయం వనంగుడి ఉంది. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలుంటాయి. వీటిలో నీటిని అమ్మవారి తీర్థంగా భక్తులు పుచ్చుకుంటారు. ఈ గుడిలోనే రావి, వేపల సంగమ వృక్షం ఉంది. దానికిందనే అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు పూజలందుకుంటున్నాడు.
దారి చూపించే దేవత
సిరిమానుకు కావాల్సిన చెట్టును పూజారికి పైడిమాంబ కలలో కనిపించి చూపిస్తుందని నమ్మకం. అమ్మ చూపిన దిక్కుగా వెతుక్కుంటూ వెళ్లిన పూజారి చెట్టును గుర్తించి భక్తులు, అధికారుల సమక్షంలో సేకరిస్తారు. ఈ ఏడాది సిరిమాను డెంకాడ మండలం ముంగినాపల్లి రోడ్డులో ఉన్న రెడ్డికవాని పేట గ్రామంలో వెలిసింది. సిరిమాను, ఇరుసుమాను ఒకేచోట కనిపించాయి. ఇలా జరగడం ఇదే ప్రథమం. సిరిమానుకు పూజలు నిర్వహించిన అనంతరం పట్టణంలోని హుకుంపేటకు తరలించి, అక్కడ చెక్కి, నునుపైన మానుగా తీర్చిదిద్ది ఉత్సవానికి సిద్ధం చేస్తారు. ఆలయం నుంచి కోట వరకూ సిరిమాను మూడుసార్లు తిరుగుతుంది.
తొలేళ్ల సంబరాలు
సిరిమానోత్సవం ముందురోజు రాత్రి చదురుగుడి వద్ద నుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాలతో కోటలోనికి తీసుకువెళతారు. కోటలో ఉన్న రౌండ్ మహల్ వద్దకు వెళ్లిన తర్వాత అమ్మవారి చరిత్రను స్తుతిస్తూ రాగయుక్తంగా గానం చేస్తారు. అక్కడ పూజల అనంతరం ఘటాలను చదురుగుడి వద్దకు తరలిస్తారు. ఆ గుడి ఎదురుగా ఒక బడ్డీని ఏర్పాటుచేసి అక్కడ ఘటాలను ఉంచుతారు. అప్పటికే పూజారిపై ఆవహించిన పైడిమాంబ తన మాటగా భక్తులకు భవిష్యవాణి వివరిస్తుంది. రాబోయే ఏడాది కాలంలో జరిగే మంచి, చెడులను పలుకుతుంది. ఉపద్రవాలు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తుంది. అమ్మవాణిని వినేందుకు రైతులు అక్కడకుచేరుకుంటారు. ఆ తర్వాత పూజారి ధాన్యపు గింజలను రైతులకు అందజేస్తారు. వాటిని తమ పొలాల్లో తొలివేరుగా విత్తుకుంటే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం.
విజయదశమి తర్వాతనే ఉత్సవం
ఏటా విజయదశమి వెళ్లిన తర్వాత వచ్చే తొలి మంగళవారం అమ్మవారికి సిరిమానోత్సవం నిర్వహిస్తారు. దాదాపు 50 నుంచి 60 అడుగుల పొడవుండే సిరిమాను (చింతమాను)కు ఆసనం అమర్చి ఆ ఆసనంలో పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా కూర్చోబెట్టి చదురుగుడి వద్ద ఉన్న ఆలయం నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు. సిరిమాను ఊరేగింపు సాగినంత మేర భక్తులు పారవశ్యంతో అరటిపండ్లు, పూలు, ఇతర ప్రసాదాలను సిరిమాను మీదకు విసురుతూ అమ్మ దీవెనలు అందుకుంటారు. ఈ ఉత్సవానికి పూసపాటి వంశస్తులు తరలివచ్చి తమ ఇంటి ఆడపడుచుకు లాంఛనాలు సమర్పించుకుంటారు. సిరిమాను బయలుదేరుతుందనగా సిరిమానుకు ముందు అమ్మ విగ్రహాన్ని వెలికి తీసినందుకు గుర్తుగా బెస్తవారి వలను నడిపిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు పలువురు ఈటెలను ధరించి పాలధారగా ఆలయానికి చేరుకుంటారు. అక్కడనుంచి డప్పు వాయిద్యాలతో మహారాజకోట పశ్చిమభాగంవైపు వెళ్లి, కోటశక్తికి నమస్కరిస్తారు.
విలక్షణమైన రథోత్సవం
సిరిమాను జాతరలో అంజలి రథానిది ఓ విలక్షణమైన స్ధానం. సిరిమానుకు అంజలి ఘటిస్తూ ముందుకు సాగే రథంపై ఐదుగురు పురుషులు స్త్రీల వేషాలను వేసుకుని కూర్చొంటారు. వీరంతా ఆరుమూరల నారచీరను, చేతికి వెండి ఆభరణాలను ధరించి సంబరంలో పాల్గొంటారు. స్త్రీ వేషధారణలో ఉన్న వీరంతా అమ్మవారి పరిచారకులుగా వ్యవహరిస్తూ, అక్షింతలు పట్టుకుని సంబరం జరుగుతున్నంతసేపూ భక్తులపై చల్లుతూ ఉంటారు. భక్తులు వారిపై పళ్లూ పూలూ విసురుతారు.
ఇలా చేరుకోవాలి...
హైదరాబాద్ నుంచి విజయనగరానికి నేరుగా రైలు ద్వారా చేరుకోవచ్చు. విమానంలో రావాలనుకున్న వారు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి గంటన్నర వ్యవధిలోనే విజయనగరం చేరుకోవచ్చు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులున్నాయి. ప్రైవేటు ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. విజయనగరం రైల్వేస్టేషన్‌లో అడుగు పెట్టగానే ఎదురుగా పైడితల్లి అమ్మవారు వెలిసిన వనంగుడి భక్తులకు కనబడుతుంది. అమ్మవారిని దర్శించిన భక్తులు అక్కడ నుంచి ఇతర వాహనాల ద్వారా కేవలం 10 నిమషాల వ్యవధిలోనే కిలోమీటరున్నర దూరంలో ఉన్న కోట ప్రాంతానికి చేరుకోవచ్చు. కోట సమీపంలోని మూడు లాంతర్లు వద్ద చదురుగుడిలో అమ్మవారిని సందర్శించవచ్చు.
– బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం