ఎవరో వచ్చి కాపాడే వరకు ఎదురు చూసేలా అమ్మాయిల్ని పెంచకూడదు. తమను తాము కాపాడుకోగలిగేలా ధైర్యాన్ని ముద్దముద్దకూ కలిపి తినిపించాలి.
ఏప్రిల్ 18. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ఏరియా. ఓ టీనేజ్ అమ్మాయి ఒంటరిగా ఇంటికి నడిచి వెళ్తోంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంగణం నుంచి జూడో ప్రాక్టీస్ చేసి వస్తోందామె.రోజూ రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తుంది. బ్లూ బెల్ట్ కూడా ఉందామెకి. ఆ రోజు ప్రాక్టీస్ పూర్తయ్యే సరికి బాగా ఆలస్యమైంది. తన కాలనీలోకి వచ్చేటప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. త్వరగా ఇంటికి వెళ్లితే తప్ప హోమ్‌వర్క్ పూర్తికాదు. వేగంగా నడుస్తోంది. అకస్మాత్తుగా.. వెనుక నుంచి అబ్బాయిల కామెంట్స్ వినిపించాయి!
ఘటన.. ప్రతిఘటన
మొదట ఆమె పట్టించుకోలేదు. వాళ్లు అగలేదు! ఒకరి తర్వాత ఒకరుగా కామెంట్ చేస్తున్నారు. కామెంట్ల జోరు పెరిగింది. గేలి నవ్వులు కూడా. ఆ కామెంట్‌లు తనను ఉద్దేశించేనని తెలిసి చుట్టూ చూసింది. ఒక్కొక్కరుగా ఆమె ముందుకొచ్చారు. మొత్తం ఐదుగురున్నారు. ఒకడు ఒంటి మీద చేయి వేశాడు. వీధి దీపాలు అక్కడొకటి అక్కడొకటి వెలుగుతున్నాయి. రెండో వాడు, మూడో వాడు కూడా చేతులేశాడు. చీకటిలో తనను నిర్మానుష్యమైన ప్రదేశానికి మళ్లించాలని వారు ప్రయత్నిస్తున్నట్లు క్షణాల్లోనే అర్థమైందామెకి. ఒక్కసారిగా బాడీని పొజిషన్‌లోకి తెచ్చుకుని ఆకతాయిల్ని తోసేసింది. జూడో పంచ్‌లతో ఒక్కొక్కరినీ దూరంగా ఉంచగలిగింది. వాళ్లేమీ పారిపోలేదు. వాళ్ల బారి నుంచి తప్పించుకుని తనే ఇంటికి పరుగు తీసింది.
ఇలా రోజూ వేధిస్తే..?!
ఆ అమ్మాయి తండ్రి దేవాలయంలో పూజారి. కూతురిని ఏడిపించిన వాళ్లెవరో తెలుసుకుందామని వెళ్లాడు. ‘నాన్న వచ్చాడ్రోయ్’ అంటూ చెప్పలేని మాటలతో ఆయన్ని అవమానించారు. సహనం నశించి ఆయన ఆగ్రహించడంతో ఆకతాయిలు మరీ రెచ్చి పోయి ఆయన్ను కొట్టి పారిపోయారు. ఇప్పుడు ఆ తండ్రి ముందు రెండే రెండు మార్గాలున్నాయి. జరిగిన అవమానాన్ని దిగమింగుకుని మరిచిపోవడమా? పోలీస్ కంప్లయింట్ ఇచ్చి రౌడీ మూక ఆట కట్టించడమా? బాధను గుండెల్లో దాచుకుందామంటే ఒకరోజు సరే, రోజూ వాళ్ల బెడద ఉంటుంది. అదే దారిలో కూతురు రోజూ ప్రయాణించాలి. తన మౌనంతో ఆ అసాంఘిక శక్తుల్ని పెరగనిస్తే... అవి సమాజంలో వేళ్లూనుకుంటాయి. ఈ సమయంలోనే వాటిని కూకటి వేళ్లతో తీసి పారేయాలి! రెండో దారినే ఎంచుకున్నాడాయన.
పోకిరీలపై తొలి కంప్లైంట్
తండ్రీకూతుళ్లు పోలీస్ స్టేషన్‌కెళ్లి కేసు పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి గంటల్లో ఆ వీధిరౌడీలను అరెస్ట్ చేశారు. వాళ్లు ఎవరో ఎక్కడ ఉంటారో తెలుసని, వాళ్ల మీద కంప్లయింట్ ఇచ్చే వాళ్లు లేక ఇంతకాలం ఉపేక్షించాల్సి వచ్చిందని బిదాన్ నగర్ డిప్యూటీ కమిషనర్ అమిత్ జల్వాగి.. ఆ తండ్రీకూతుళ్లతో చెప్పారు. పూజారి ఇంటి ఇరుగుపొరుగు మహిళలు కూడా బయటికొచ్చారు. ధైర్యంగా ముందుకు రాలేక అన్నాళ్లూ ఆ రౌడీమూక చేష్టల్ని భరించేవాళ్లమని, సాయంత్రం దాటి చీకట్లు ముసిరితే ఆ దారి వెంట నడిచే పరిస్థితి ఉండదని వాపోయారు. జూడో నేర్చుకున్న ఆ అమ్మాయిని కాలనీ అంతా మెచ్చుకుంటోందిప్పుడు. టీనేజ్‌లో ఉన్న అమ్మాయి కావడంతో ఆమె పేరును మీడియాకు అధికారికంగా వెల్లడించడం లేదు పోలీసులు.
ఆగడం లేదని సాగనిస్తామా?
అల్లరి మూకను పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెండర్స్ యాక్ట్) చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆ బ్యాచ్‌లో బిజోయ్ దాస్ ఒక్కడే పెద్దవాడు. మిగిలిన నలుగురూ మైనర్లే. బిజోయ్‌కి ఈ నెల 30 వరకు కస్టడీ విధించింది కోర్టు. మైనర్లను మంగళవారం నాడు జువైనల్ బోర్డు ముందు హాజరు పరిచి ఆ తర్వాత అబ్జర్వేషన్ హోమ్‌కి తరలించారు.
ఆడపిల్లలను భద్రంగా కాపాడుకోవడానికి జాతియావత్తూ బేటీ బచావో, బేటీ పఢావో... నినాదంతో పనిచేస్తోంది. అయినా నిర్భయ ఘటనలు తప్పడం లేదు. అలాగని వాటిని సాగనివ్వకూడదు.
ధైర్యాన్ని కలిపి తినిపించాలి
అమ్మాయిల్ని ఎవరో వచ్చి కాపాడే వరకు ఎదురు చూసేటట్లు పెంచకూడదు. తమను తాము కాపాడుకోగలిగేటట్లు పెంచాలి. ఒంటి మీద చేయి వేసిన వాడి ముఖం మీద ఒక్క పంచ్ ఇవ్వగలిగేటట్లు.. మన అమ్మాయిలకు ధైర్యాన్ని ముద్దముద్దకూ కలిపి తినిపించాలి. అప్పుడు మనం.. వార్తల్లో అఘాయిత్యాల బారిన పడిన అమ్మాయిల కథనాలకు బదులు... అరాచకాన్ని ఎదిరించి బయటపడిన అమ్మాయిల కథనాలను చదవగలుగుతాం. ఉదయాన్నే సంతోషంగా, ధీమాగా ఒక అందమైన ప్రపంచం గురించి తెలుసుకోడానికి పేపర్‌ను తెరవగలుగుతాం.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment