శిరీష కుటుంబం
సాక్షి, కాళోజీ సెంటర్(వరంగల్) : పట్టుదలకు శ్రమ తోడైతే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదని మరోసారి రుజువైంది. సామాన్య కుటుంబంలో జన్మించి సాధారణ విద్యార్థిగా కొనసాగిన ఆమె ఉన్నత లక్ష్యాన్ని చేరుకొని అందరి చేత శభాస్ అనిపించుకుంటోంది. ఇటీవల వెల్లడైన సివిల్ జడ్జి ఫలితాల్లో గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామం కీర్తినగర్‌కు చెందిన శిరీష పేరు ఉండడంతో ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
న్యాయానికి రక్షణగా ..
సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, రోజురోజు మహిళలపై జరుగుతున్న ఘోరాలకు చలించిపోయిన శిరీష ఏనాటికైనా న్యాయశాస్త్రంలో ప్రతిభ చాటాలని నిర్ణయించుకుంది. సైన్స్ కోర్సులో భవిష్యత్ ఉందని తెలిసినా పేదలు, మహిళలకు న్యాయం చేయాలంటే న్యాయ శాస్త్రమే సరైన వేదికగా భావించి ఆ రంగం వైపే అడుగులు వేసింది.
ముగ్గురు సంతానంలో ఒకరు..
వరంగల్ పాపయ్యపేట చమన్‌కు చెందిన కటుకోజ్వల సర్వమంగళచారి – రమాదేవి దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో శిరీష 10వ తరగతి వరకు ఆంధ్రా బాలిక హైస్కూల్‌లో చదివి ఇంటర్, బీఫార్మసీ వరకు హన్మకొండలోనే చదివారు. మూడేళ్ల క్రితం గీసుగొండ మండలం గొర్రెకుంట కీర్తినగర్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది పూసల శ్రీకాంత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే శిరీషకు కుడా న్యాయశాస్త్రం వైపే వెళ్లాలనే ఆలోచన ఉండండంతో భర్త ప్రోత్సహించారు. దీంతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ, హైదరాబాద్ బషీర్‌బాగ్ పీజీ కాలేజీలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. ఆ తర్వాత 2014 నుంచి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే తన లక్ష్యసాధనకు శ్రద్ధగా కృషి చేశారు. 2019 మే లో జరిగిన ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులై ఆగష్టులో జరిగిన మెయిన్స్‌కు హాజరయ్యారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన ఇంటర్వూలో పాల్గొన్నారు. దీంతో 18న ప్రకటించిన సివిల్ జడ్జి ఫలితాలోల్ల శిరీష ఎంపికయ్యారు.
ఆనందంగా ఉంది..
నా శ్రమ ఫలించడంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు కష్టపడి డిగ్రీ వరకు చదివిస్తే పీజీ చేసేలా నా భర్త శ్రీకాంత్ ప్రోత్సహించారు. నిజంగా పట్టుదల ఉంటే ఏది సాధ్యం కాదనిపిస్తోంది. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ పేదలు, మహిళలకు మెరుగైన న్యాయసాయం అందేలా కృషి చేస్తా.
–కటుకోజ్వల శిరీష
Comments
Please login to add a commentAdd a comment