ఒక ఊళ్లో ఒక ‘కాలజ్ఞాని’ ఉండేవాడు. పగలంతా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. రాత్రంతా ఆకాశంలో చుక్కల్ని చూస్తూ ఉండేవాడు. ఏవో లెక్కల్ని వేస్తూ ఉండేవాడు. ఎప్పుడూ విచారంగా ఉండేవాడు. ఈ లోకానికి ఏదో జరగబోతోందని నిరంతరం ఆందోళన చెందుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఊళ్లోని వాళ్లు వచ్చి, భవిష్యత్తులో తమకేం జరగబోతోందో చెప్పమని ఆయనను అడిగేవారు. చెప్పేవాడు! ఆయన చెప్పిన విషయాన్ని బట్టి ఆ వచ్చినవాళ్లు సంతోషంతోనో, విచారంతోనో వెళ్లిపోయేవారు. ఆ కాలజ్ఞాని నిజంగా కాలజ్ఞానో కాదో ఎవ్వరికీ తెలియదు. ఆయన మాత్రం తనని తాను కాలజ్ఞానిని అనుకునేవాడు.
ఎప్పటిలాగే ఓ రోజు రాత్రి మసక చీకట్లో ఆ కాలజ్ఞాని ఆకాశంలో చుక్కల్ని చూస్తూ, లెక్కల్ని వేసుకుంటూ ఊరి శివార్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. పైన చూస్తూ, కింద చూసుకోకపోవడంతో ఒక గొయ్యిలో పడిపోయాడు. పైకి వచ్చేందుకు ప్రయత్నించాడు కానీ పట్టు దొరకలేదు. ‘ఎవరైనా ఉన్నారా? నన్ను పైకి లాగండి’ అని కేకలు వేస్తూ గొయ్యిలోనే ఉండిపోయాడు. కొంతసేపటి తర్వాత, అటుగా వస్తున్న గ్రామస్థులు కేకలు విని, కాలజ్ఞానిని బయటికి లాగి, తమ దారిన తాము వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ అనుకున్నారు.. ‘చుక్కల్లో భవిష్యత్తుని చూడగలిగాడు కానీ, కాళ్ల కింద ఉన్న వర్తమానాన్ని కనుక్కోలేకపోయాడు’.. అని!
రేపటి గురించిన ఆలోచన, రేపేం జరగబోతోందీ అన్న ఆలోచన రెండూ ఒకటి కాదు. రేపటి గురించిన ఆలోచనలో ‘ముందు జాగ్రత్త’ ఉంటుంది. రేపేం జరగబోతోంది అన్న ఆలోచనలో కేవలం ‘ఊహ’ మాత్రమే ఉంటుంది. అది మంచిది కాదు. రేపటిని ఊహిస్తూ, నేడు చేయవలసిన పనుల్ని అలక్ష్యం చేస్తాం మనం. ఈలోపు ఆ రేపు.. నేడై వచ్చేస్తోంది.. తెల్లారే వాకిట్లోకి! అప్పుడు మళ్లీ నేటి గురించి పట్టించుకోకుండా రేపటిలోకి వెళ్లిపోతాం. అంటే ఎప్పుడూ మనం రేపటిలోనే ఉండిపోతున్నాం. నేటిని చేజార్చుకుంటున్నాం. ‘రేపు’ ఎలాగూ వస్తుంది. ‘నేడు’ చేజారి ‘నిన్న’ అయిపోయాక మళ్లీ వస్తుందా?! నిన్న అయినా, నేడు అయినా, రేపు అయినా ఎప్పటికప్పుడు జీవితం మెరుగవుతూ ఉండాలి. అంతవరకే ఆలోచన చెయ్యాలి. నిన్నటిని ఒక అనుభవంగా తీసుకుని, ఆ అనుభవంతో రేపటిని మరింత మెరుగ్గా మలుచుకోడానికి ఇవాళ మనం మన పనిలో శ్రద్ధపెట్టాలి. సవ్యంగా పూర్తి చెయ్యాలి. అప్పుడు చుక్కలే కిందికి చెయ్యి చాపుతాయేమో.. ‘గురూ.. కొంచెం మా ఫ్యూచర్ చూసి చెప్పు. ఎలా ఉండబోతోందో?’ అని! మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతుంటే ‘రేపు’ అనే గొయ్యిలో పడే ప్రమాదం ఉండదు.
చుక్కలకు చెయ్యి చూద్దాం
Published Mon, Jan 8 2018 11:56 PM | Last Updated on Mon, Jan 8 2018 11:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment