నీరు.. ఆహారమే జగతిలో ప్రతి జీవి మనుగడకూ ఆధారం... మనం తినే ఆహారం ఏదైనా..ఆ మాటకొస్తే వేసుకునే వస్త్రమైనా... అంతా నీటి మయమే! ఏ ఆహార పదార్థం తయారు కావాలన్నా నీరు చాలానే ఖర్చవుతుంది. ఏయే ఆహార పదార్థాలకు ఎంతెంత నీరు ఖర్చవుతుందన్నది ప్రశ్న! దీని గురించి శాస్త్రీయంగా తెలియజెప్పేదే ‘వాటర్ ఫుట్‌ప్రింట్’! ఇదంతా ఎందుకూ అంటే..? భూతాపం పెరిగి వాతావరణం అనూహ్యంగా మారిపోతూ ఉంది.. ప్రకృతిలో మమేకమై ఉండే అన్నదాతలకు కూడా పంటల సాగు కత్తి మీద సాములాగా మారిపోతూ ఉంది.. భూతలమ్మీద నీటి లభ్యత నానాటికీ తగ్గుతుంటే, జనాభా మటుకు పెరుగుతూ ఉంది.. మనందరమూ ‘ఆహార నీటి’ చైతన్యం పొందాల్సిన అవసరం ఉంది. అంటే.. ఎక్కువ నీటితో పండే ఆహారంపై నుంచి మనసు మళ్లించి... ఆహార వృథాను అరికట్టాలి. తక్కువ నీటితో పండే సమతుల్య ఆహారం వైపు దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితులు వస్తున్నాయి.. 5,000–7,000 వేల లీటర్ల సాగు నీటితో పండే కిలో వరి బియ్యం కన్నా.. ఇందులో సగం నీటితోనే.. అది కూడా కేవలం వాన నీటితోనే పండే చిరుధాన్యాలు నిజంగా సిరిధాన్యాలే కదా.. తినే వారిలో ‘ఆహార నీటి’ చైతన్యం వస్తే... పండించే వారిలోనూ వస్తుంది! అప్పుడిక ఆహార, పౌష్టికాహార భద్రతకు ఢోకా ఉండదు!!
ఏ పంటకైనా లేదా ఏ ఆహార పదార్థానికైనా ఎంత నీరు ఖర్చవుతుందంటే ఠక్కున సమాధానం చెప్పడం అంత సులువేమీ కాదు. ఏయే పంటకు ఎంతెంత నీరు ఖర్చు అవుతుందనే విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆయా దేశ, కాల, వాతావరణ, భూమి స్థితిగతులను బట్టి.. ఇంకా చెప్పాలంటే, సాగు పద్ధతిని బట్టి.. ఉత్పాదకతను బట్టి కూడా నీటి ఖర్చు మారిపోతూ ఉంటుంది. కాబట్టి, కిలో వరి బియ్యం పండించడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఖర్చయ్యే నీటికీ, అమెరికాలో ఖర్చయ్యేనీటికీ, చైనాలో ఖర్చయ్యే నీటికీ మధ్య చాలా వ్యత్యాసమే ఉంటుంది. ఏటేటా భూతాపం, ఉష్ణోగ్రత, వాతావరణ ఉపద్రవాలు పెరిగిపోతున్న గడ్డు పరిస్థితుల్లో పౌరులందరూ ఆహారాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు, వినియోగించేటప్పుడు ‘ఆహార నీటి’ చైతన్యంతో వ్యవహరించగలగాలి.
మారుతున్న వాతావరణ పరిస్థితుల్లోనూ ఆహార భద్రత, పౌష్టికాహార భద్రత సాధించడానికి పాలకులు, ప్రజలు అందరూ ‘ఆహార నీటి’ చైతన్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం తరుముకొస్తోంది. ప్రజల్లో, విధాన నిర్ణేతల్లో ఈ చైతన్యాన్ని పెంపొందించడానికి నెదర్లాండ్స్‌కు చెందిన ‘వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్’ అనే సంస్థ ప్రపంచ దేశాల్లో వ్యవసాయ, ఆహార గణాంకాలను సేకరించి, క్రోడీకరించి ‘నీటి వినియోగ ముద్ర’(వాటర్
ఫుట్‌ప్రింట్)లను తయారు చేశారు. వర్షపాతం, కాలువ/చెరువుల ద్వారా పెట్టిన సాగు నీరు, బోరు/బావి ద్వారా తోడిన నీరు మొత్తాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అయ్యే నీటి ఖర్చును 2011 నాటి గణాంకాల ఆధారంగా లెక్కగట్టారు.
ప్రతి ఒక్కరి ఆహారానికి 3,496 లీటర్ల నీటి ఖర్చు!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషీ తింటున్న ఆహారోత్పత్తికి రోజుకు సగటున 3,496 లీటర్ల నీరు ఖర్చవుతున్నదని వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్ తేల్చింది. అయితే, ప్రతి పూటా మాంసం తినే పాశ్చాత్య దేశాలతో పోల్చితే అప్పుడప్పుడూ మాంసం తినే అలవాటున్న భారతీయ పౌరుడు తినే ఆహారానికి ఇంతకన్నా తక్కువే ఖర్చవుతుందని చెప్పొచ్చు. ఇది కాకుండా.. తాగునీరు, ఇంటి అవసరాలకు తలసరి నీటి ఖర్చు రోజుకు 137 లీటర్లు కాగా, అనుదినం వాడే పారిశ్రామిక వస్తువుల నీటి ఖర్చు 167 లీటర్లు.ఆహార నీటి ఖర్చు ప్రపంచ సగటు కన్నా మన దేశంలో తక్కువగానే ఉంది. మొత్తం తలసరి నీటి వినియోగంలో 92% ఆహారోత్పత్తికే ఖర్చవుతున్నదని అంచనా.
మన దేశంలో ప్రతి ఒక్కరూ తమ ఆహార అవసరాల నిమిత్తం రోజుకు 3 వేల లీటర్ల నీటిని వాడుతున్నారు. చైనా పౌరులు సగటున రోజుకు 2,900 లీటర్ల నీటిని వాడుతున్నారు. అమెరికా పౌరులు సగటున రోజుకు 7,800 లీటర్ల నీటిని వాడుతున్నారు.ఒక దేశంలో పండించిన పంట లేదా శుద్ధిచేసి ప్యాక్ చేసిన ఆహారోత్పత్తిని మరో దేశంలో ప్రజలు దిగుమతి చేసుకొని తింటూ ఉంటారు. అంటే.. ఒక దేశం నుంచి మరో దేశానికి ఆహార పదార్థం/ వస్తువు ఎగుమతి అయ్యిందీ అంటే.. నీరే మరో రూపంలో ఎగుమతి అవుతున్నదన్న మాట. ఈ ప్రకారం చూస్తే.. అమెరికన్లు 20% విదేశాల్లో నీటితో తయారైన వస్తువులు, ఆహారాన్ని దిగుమతి చేసుకొని వాడుతుంటే.. చైనీయులు 10%, భారతీయులు 3% వాడుతున్నారు.
కిలో వరి బియ్యం ఉత్పత్తికి 5,331 లీటర్లు!
ఆహార ధాన్యాల్లో వరి సాగుకు అత్యధికంగా నీరు ఖర్చవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సగటున కిలో వరి ధాన్యం పండించడానికి 1,670 లీటర్లు, కిలో బియ్యం పండించడానికి 2,497 లీటర్ల నీరు ఖర్చవుతున్నదని (2011 నాటి గణాంకాల ప్రకారం) వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్ చెబుతోంది. అయితే, మన దేశంలో రెట్టింపు నీరు ఖర్చవుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐ.ఎ.ఆర్.ఐ.–న్యూఢిల్లీ)లోని వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ కోకిల జయరామ్ 2007–08లో మన దేశంలో పంటలకు వాడిన నీటిపై అధ్యయనం చేసి.. 2016లో నివేదిక వెలువరించారు. ఆ ప్రకారం.. వరి సాగుకు 1250 ఎం.ఎం. నీరు అవసరమవుతుంది. మన దేశంలో సగటున టన్ను వరి ధాన్యం ఉత్పత్తికి 35,71,900 లీటర్ల నీరు ఖర్చవుతోంది. టన్ను వరి ధాన్యాన్ని మిల్లు ఆడిస్తే 670 కిలోల బియ్యం వస్తాయనుకుంటే.. కిలో వరి బియ్యానికి 5,331 లీటర్ల నీరు ఖర్చవుతోంది.
చిరుధాన్యాల దిశగా..
భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో వరి సాగవుతున్న ఉభయ గోదావరి డెల్టా ప్రాంతాల్లో సైతం రానున్న రోజుల్లో పెరిగే 2 డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల వరి దిగుబడులు భారీగా తగ్గే పరిస్థితి వస్తుందని ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ) అధ్యయనంలో తేలింది. అనివార్యంగా చిరుధాన్యాల సాగు వైపు దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఏయూ హెచ్చరించడం గమనించ వలసిన సంగతి. చిరుధాన్యాల సాగుకు 400 ఎం.ఎం. నీరు సరిపోతుంది. అది కూడా వర్షాధారంగానే సాగవుతుంది.
సగటున ఎకరానికి 5–10 క్వింటాళ్ల చిరుధాన్యాల బియ్యం దిగుబడి వస్తుంది. శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి వచ్చిన ఉదంతాలున్నాయి. వరితో పోలిస్తే ‘నీటి వినియోగ ముద్ర’ మూడింట రెండొంతులకు తగ్గిపోతుంది. సిరిధాన్యాలను నగర, పట్టణ ప్రాంతవాసులు దైనందిన ప్రధానాహారంగా తీసుకోవడం ప్రారంభిస్తే.. అందరికీ సంతులిత ఆహారం అందుతుంది. ఆధునిక జీవనశైలి జబ్బులను పారదోలడంతోపాటు మెట్ట రైతుల ఆదాయాలూ అనేక రెట్లు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
15,400 లీటర్ల నీరు = కిలో మాంసం!
మాంసం ఉత్పత్తి కన్నా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తికి చాలా తక్కువ నీరు ఖర్చవుతున్నదన్నది నిజం. కిలో పశు మాంసం ఉత్పత్తికి 15,400 లీటర్ల నీరు ఖర్చవుతున్నది. పాశ్చాత్య దేశాల్లో ఆవులను, ఎద్దులను పారిశ్రామిక పద్ధతుల్లో పెంచి మూడేళ్ల వయసులో పశువును వధిస్తే.. ఎముకలు తీసేయగా 200 కిలోల మాంసం వస్తుంది. ఒక్కో పశువు సగటున మూడేళ్లలో 1,300 కిలోల ధాన్యాలతో తయారైన దాణా, 7,200 కిలోల గడ్డి తింటుంది. ఈ ధాన్యాలను పండించడానికి 30 లక్షల 60 వేల లీటర్ల నీరు ఖర్చవుతోంది. పశువు మూడేళ్లలో 24,000 లీటర్ల నీరు తాగుతుంది. దీని మాంసాన్ని శుద్ధి చేయడానికి 7 వేల లీటర్ల నీరు ఖర్చవుతుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పశుమాంసం ఉత్పత్తికన్నా చిన్న జీవాల మాంసం ఉత్పత్తికి తక్కువ నీరు ఖర్చవుతున్నది.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment