మహిళల కోసం ఓ మారణాయుధం
ఆయుధం
హ్యాండ్‌బ్యాగ్‌లో పడుతుంది, కానీ బ్యాగ్ పట్టనంత డబ్బు కావాలి!
‘నిర్భీక్’ అనే కొత్త .32 కాలిబర్ రివాల్వర్ ఈ నెలాఖరుకు మార్కెట్‌లోకి వస్తోంది. లేదా ముందే వచ్చినా రావచ్చు. రావడం మాత్రం ఖాయం. వచ్చాక దీనివల్ల మహిళలకు ఏమైనా మేలు జరుగుతుందా అనే విషయం మాత్రం ఖాయంగా చెప్పలేం. మహిళలకే ఎందుకంటే... భారతదేశంలో తొలిసారిగా మహిళల కోసమే తయారవుతున్న రివాల్వర్ ఇది. ఇందులో ఆరు బులెట్‌లు ఉంటాయి. యాభై మీటర్ల దూరం వరకు దిగబడతాయి. ఒక్క బులెట్ తగిలినా చాలు, మీదకు రాబోతున్నవాడు కుప్పకూలిపోతాడు. కాన్పూర్‌లోని దేశరక్షణ ఆయుధాల కర్మాగారంలో నాణ్యమైన విడి భాగాలతో నిర్భీక్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే 20 వరకు ఆర్డర్లు వచ్చాయని ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అబ్దుల్ హమీద్ చెబుతున్నారు. ఇంకా ఏం చెబుతున్నారంటే... ఈ రివాల్వర్‌ని దగ్గర ఉంచుకుంటే ఆడవాళ్లకు ధైర్యంగా ఉంటుందట. హ్యాండ్ బ్యాగ్‌లో చక్కగా ఇమిడిపోతుందట. పైన అందమైన డిజైనింగ్‌తో నిర్భీక్ అనే ఇంగ్లిషు అక్షరాలు తళతళ లాడుతూ ఉంటాయట.
అన్నీ బాగున్నాయి కానీ, ఈ రివాల్వర్ ఎలుకల మందులా వీధి చివర కిరాణా షాపులలో దొరకదు. బస్టాపు పక్కన బడ్డీ కొట్లలో దొరకదు. వందకో రెండొందలకో దొరకదు. ఇవన్నీ అటుంచితే, దీన్ని మగవాళ్లకు అమ్మకుండా ఉంటారా అనే ప్రశ్నకు అస్సలు సమాధానం దొరకదు. పైగా రివాల్వర్ కొనుగోలుకు, ముందుగా అప్లికేషన్ పెట్టుకోవాలి. రివాల్వర్ ఎందుకు అవసరమో వివరణ ఇవ్వాలి. అడ్వాన్స్ చెల్లించాలి. ఆ తర్వాత వచ్చి తీసుకెళ్లమన్నప్పుడు బయల్దేరి వెళ్లాలి. ఇప్పుడు చెప్పండి, సాధారణ మహిళలకు ఈ ఆయుధం ఎలా పనికొస్తుందో? మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చాలా చేస్తుంటాయి. వాటన్నిటినీ మనం సమర్థించనవసరం లేదు. ముఖ్యంగా ఇలాంటి ఆలోచనలను! అన్నట్టు రివాల్వర్ ధర లక్షా 23 వేల రూపాయలు. ఇంత ధర పెట్టి కొనడం కన్నా ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకోవడం తేలిక కదా. ఎలా మలచుకోవడం? ఈ మధ్య వచ్చిన ‘ది డే ఆఫ్టర్ ఎవ్రీడే’ అనే లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో చూడండి. ఖాళీ చేతులను మారణాయుధాలుగా ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది.