
ప్రతిదానికీ సారీ, సారీ, సారీ... అనకండి !
‘వ్యక్తిత్వ వికసనం’ అన్న అంశంలోని రెండవదైన మెంటల్లీ అలర్ట్‌ను గురించి .. అంటే స్పష్టత లేదా అప్రమత్తత గురించి ప్రస్తావించుకుంటున్నాం.
విద్య - విలువలు
‘వ్యక్తిత్వ వికసనం’ అన్న అంశంలోని రెండవదైన మెంటల్లీ అలర్ట్‌ను గురించి .. అంటే స్పష్టత లేదా అప్రమత్తత గురించి ప్రస్తావించుకుంటున్నాం. పుస్తకం చదువుతుంటారు. అది ఎదురుగుండా పెట్టుకుంటారు. గంట గడుస్తుంది. కన్ను పుస్తకానికేసి చూస్తూనే ఉంటుంది. కానీ ఆలోచన మాత్రం దేనిమీదో ఉంటుంది. లెక్కకు మాత్రం గంటసేపు చదివినట్లు, కానీ లోపలికి వెళ్ళింది మాత్రం ఏమీ లేదు. ఇదీ స్పష్టత లేకపోవడం అంటే. చిన్నప్పటినుంచీ ఏ పనిచేసినా దానిమీదే దృష్టి కేంద్రీకరించి ఒక తపస్సుగా చేయడం అలవాటు చేసుకుంటే , మీకు జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా స్పష్టమైన ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు.
ఈ స్పష్టత ఎక్కడిదాకా వెళ్ళాలంటే - నేనొక తప్పు చేశాననుకోండి, నిర్భయంగా ‘‘అయ్యా! ఈవేళ ఈ తప్పు చేశాను. నన్ను క్షమించండి’’ అని నేను చెప్పగలగాలి. అదీ వ్యక్తిత్వమంటే. అంతేగానీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. అయితే పొద్దస్తమానం క్షమాపణ చెప్పకూడదు. ప్రతిదానికీ సారీ, సారీ, సారీ... అని అనకండి. ఎన్నిసార్లు జీవితంలో సారీ చెబితే, మీరు అన్నిసార్లు చేయకూడని పని చేస్తున్నారని గుర్తు.. జీవితంలో ‘నన్ను క్షమించండి’ అన్నమాట వాడవలసిన అవసరం ఎన్ని తక్కువసార్లు వస్తుందో అన్నిసార్లు మీరు పొందికగా, స్పష్టంగా బతికారని గుర్తుంచుకోవాలి. ఎన్ని ఎక్కువసార్లు క్షమాపణ చెప్పారో అన్నిసార్లు మీకు స్పష్టత లోపించిందని అనుకోవాలి. ధైర్యంగా పదిమందిలో నిలబడగలిగిన స్థితి పొందండి. ఆ స్థితిని పొందితే మీ వ్యక్తిత్వం వికసనం పొందినట్లు. అలా పొందిన వ్యక్తి అందరికీ ఆదర్శప్రాయుడౌతాడు. ఒక గుడిలోకి వెళ్ళితే ఆయనలా వెళ్ళాలి... ఒక పాఠం చెబితే ఆయనలా చెప్పాలి... ఒక విషయం వింటే ఆయనలా వినాలి... కుటుంబంతో గడపడమంటే ఆయనలా గడపాలి.. పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడమంటే ఆయనలా తీసుకురావాలి. ఒక్కొక్కచోట తలవంచడం అంటే ఆయనలా వంచాలి... జీవితంలో ఈ స్పష్టత లేదనుకోండి ప్రతి విషయం అయోమయమౌతుంది. అటువంటి వ్యక్తి చేస్తున్నదానితో పాటూ చెయ్యకూడనిపని ఒకటి చేస్తాడు. దానితో చెయ్యవలసిన పనిని ఇక చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. డ్రైవ్‌చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఒక్క యాక్సిడెంట్ చేశాడనుకోండి. ఇక మళ్ళీ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే చాలా అవసరమయినవి- ఈైట ఈైూఖీట (డూస్ డోన్ట్స్) అంటే చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకుని, ఆచరిస్తూండడం ద్వారా మనసుకు బాగా తర్ఫీదివ్వండి. ఏదయినా మాట్లాడవలసివస్తే పది మాటలు అటేసి ఇటేసి, నానుస్తూ, వెనకవి ముందుకు, ముందువి వెనకకు కాకుండా స్పష్టంగా చెప్పడాన్ని అలవాటు చేసుకోండి.
ఇక మూడవది - ఇంటల్లెక్చువల్లీ షార్ప్ - అంటే తెలివిలో, అవగాహనలో సునిశిత ప్రజ్ఞ అని! ఒకపని చేస్తున్నాడనుకోండి. ఆ పని అలాగే ఎందుకు చేయాలి ? అని అడిగితే... ‘నాకలా అనిపించింది, కాబట్టి చేస్తున్నాను’ అన్నట్లుగా కాకుండా, అలా చేస్తే బాగుంటుంది - అనడానికి ఆయన దానిని గురించి కొంత ఆలోచన చేస్తాడు. అలాగే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా విషయం చెప్పడానికి వచ్చినప్పుడు మీరు సావధానంగా వినాలి. అతనికి చెప్పే అవకాశం ఇవ్వకుండా మీరే మాట్లాడుకుంటూ పోతే అవతలివాడు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పకుండానే వెళ్ళిపోతాడు. ఇది ముఖ్యంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఇంటి పెద్దగా ఉన్నప్పుడు ఇటువంటి వైఖరి మీకు శోభనివ్వకపోగా మీకు నష్టం కలుగచేసే ప్రమాదముంది.
అలాగే మీరు ఏదయినా చేస్తున్నప్పుడు, చెబుతున్నప్పుడు దానికి ఒక ప్రమాణం ఉండాలి. ఒక ఆధారం ఉండాలి. కకొంతమంది పెద్దలు మాట్లాడుతుంటే - మాట్లాడేది 5 నిమిషాలే అయినా అది జీవితాన్ని దిద్దేస్తుంది. ఒక ఉన్నతమైన బాటవైపు నడిపిస్తుంది. కలాంగారి జీవితం ఇలాగే ఒక మాట చేత తీర్చిదిద్దబడింది. ఒకప్పుడు ఆయన ఒక ఉద్యోగంకోసం ప్రయత్నిస్తే, వేరొక ఉద్యోగం వచ్చింది. నిరాశా నిస్పృహలతో ఆయన ఋషీకేశ్ వెళ్ళారు. అక్కడ ఒక స్వామీజీ ఆయన వంకచూసి ‘‘ఎందుకలా దిగాలుగా ఉన్నావు, ఇంతకీ ఎవరు నువ్వు ?’’ అని అడిగారు. కలాంగారు ఆయనకు జవాబుగా ‘‘నా పేరు అబ్దుల్ కలాం. ఫలానా ఫలానా చదువుకున్నా. ఫలానా ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. కానీ మరో ఉద్యోగం వచ్చింది’’ అని వివరంగా చెప్పారు. ఆ స్వామీజీ చిర్నవ్వు నవ్వి ‘‘భవిష్యత్‌లో నువ్వేం చేయాలో దేముడు ముందే నిర్ణయించేసేశాడు. దేవుని ఆదేశాన్ని పాటించకుండా దేనికోసమో ఎందుకు వెంపర్లాడడం?’’ అన్నారు. అంతే. ‘ఆయన నాకేది ఇచ్చారో దానిలోనే మనసును లగ్నం చేస్తాను’’ అని స్పష్టత తెచ్చుకుని దానిమీదే నిలబడ్డారు. తరువాత భారత రాష్ర్టపతి పదవినలంకరించి భరతమాత ముద్దుబిడ్డయ్యారు. అంతటిస్థాయికి ఆయనెలా ఎదిగారు... మనసులో, చేసే పనిలో సునిశిత ప్రజ్ఞతో!
మీరు ఒక సమస్యలో ఉన్నప్పుడు లేదా మీ మనసు చిక్కు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మీరేం చేయాలన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈ ప్రజ్ఞ మిమ్మల్ని రక్షిస్తుంది. అలా ఈ ప్రజ్ఞ మీకు అక్కరకు రావాలంటే మీకు దానికి సంబంధించి తగిన పరిజ్ఞానం మీ వద్ద ఉండాలి. అది మీకు సమయానికి జ్ఞాపకం రావాలంటే మీ జ్ఞాపకశక్తి చురుగ్గా ఉండాలి. మెదడుకు ఒక లక్షణం ఉంటుంది. కొత్త సమాచారం అందగానే పాతదాన్ని మరుగున పడేస్తుంటుంది. మీరు చేయవలసిందల్లా - మీకు పనికివస్తుందనుకున్న సమాచారం మరుగున పడకుండా ఉండాలంటే వాటిని నిత్యం మననం చేసుకుంటూ పోతే అవి మెదడులో శాశ్వతంగా ఉండిపోతాయి. రోజుకు ఓ పావుగంట, అరగంట మీరు అలా మననం చేస్తూ మీ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి, పదిలపరుచుకోవాలి.
మీరొక విషయం మీద మాట్లాడేముందు ఓ 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించాలి. నేనిలా మాట్లాడితే అవతలివారికి అది ఉపయోగపడుతుందా లేదా... అలా! అంతేకానీ ఆలోచన లేని మాటలు మాట్లాడకూడదు.