ఫంగల్ బాల్ అంటే ఏమిటి? | What is a fungal ball? | Sakshi
Sakshi News home page

ఫంగల్ బాల్ అంటే ఏమిటి?

Published Thu, May 26 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

ఫంగల్ బాల్ అనే సమస్య ఊపిరితిత్తులోనే గాక మెదడు, కిడ్నీ, ఇంకా ఇతర ఏదైనా అవయవంలో ఏర్పడవచ్చు.

పల్మునాలజీ కౌన్సెలింగ్

 

కొన్నేళ్ల క్రితం నాకు టీబీ వచ్చింది. అయితే కొద్దిరోజులుగా నేను తీవ్రంగా దగ్గుతున్నాను. దగ్గుతో పాటు రక్తం పడుతోంది. డాక్టర్‌కు చూపించుకుంటే కొన్ని పరీక్షలు చేసి నా ఊపిరితిత్తుల్లో ‘ఫంగల్ బాల్’ ఉందని చెప్పారు. ఆందోళనగా ఉంది. అంటే ఏమిటి? - సురేశ్, కాకినాడ
ఫంగల్ బాల్ అనే సమస్య ఊపిరితిత్తులోనే గాక మెదడు, కిడ్నీ, ఇంకా ఇతర ఏదైనా అవయవంలో ఏర్పడవచ్చు. మీ విషయంలో ఊపిరితిత్తులలోని ఖాళీ ప్రదేశంలో (లంగ్ క్యావిటీలో) యాస్పర్జిల్లస్ అనే ఫంగస్ ఒక ఉండలా ఏర్పడటం వల్ల ఈ సమస్య వచ్చింది. సాధారణంగా యాస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్ అనే రకానికి చెందిన ఫంగస్ మానవుల్లో పెరుగుతుంది. మానవుల్లోని వ్యాధి నిరోధకత కేవలం కణజాలానికే పరిమితం. లంగ్‌లో ఉండే ఖాళీ ప్రదేశాలలోకి (క్యావిటీస్‌లోకి)  చొచ్చుకుపోలేకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో పెరిగే ఫంగస్‌ను మన ఇమ్యూనిటీ నిరోధించలేదు. దాంతో అక్కడ ఆ ఫంగస్ ప్రత్యుత్పత్తి జరుపుతూ, విపరీతంగా పెరుగుతూ ఒక ఉండలాగా ఏర్పడుతుంది. ఫలితంగా అక్కడి పరిసరాల్లోని కణజాలం మృతిచెందుతుండటం, మ్యూకస్ విపరీతంగా స్రవిస్తూ ఉండటం, ఇతరత్రా అంశాలు కూడా తోడవడంతో ఈ ఉండ మరింతగా పెరుగుతుంటుంది. సాధారణంగా యాస్పర్జిల్లస్ అనే ఈ ఫంగస్ మొదట్లో ఆకులు, నిల్వ ఉంచిన ధాన్యం, పక్షి రెట్టలు, కుళ్లుతున్న చెట్ల భాగాలలో పెరుగుతుంటుంది. మనం పీల్చినప్పుడు శ్వాస ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటుంది. మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే టీబీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఊపిరితిత్తుల్లో యాబ్సెస్, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారిలో ఈ ఫంగల్ బాల్ మరింత తేలిగ్గా పెరుగుతుంది.

 
లక్షణాలు: కొంతమంది రోగుల్లో ఈ ఫంగల్‌బాల్ ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు బయటకు కనాపించకపోవచ్చు. మరికొందరిలో మాత్రం ఛాతీనొప్పి, దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడటం జరుగుతుంది. ఈ ఫంగస్ ఉండ రక్తనాళాలపై దాడి చేసినప్పుడు ఇలా రక్తం పడవచ్చు. కొందరిలో తీవ్రమైన నిస్సత్తువ, జ్వరం, బరువు తగ్గడం కనిపించవచ్చు.

 

నిర్ధారణ పరీక్షలు: ఊపిరితిత్తుల నుంచి చిన్న ముక్క తీసి బయాప్సీ పరీక్షకు పంపడం, యాస్పిర్జిల్లస్ నిర్ధారణకు చేసే రక్తపరీక్ష, బ్రాంకోస్కోపీ, ఛాతీ ఎక్స్-రే, సీటీ స్కాన్, కళ్లె పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.

 
చికిత్స
: ఎలాంటి లక్షణాలు లేకపోతే చికిత్స అవసరం లేదు. కానీ దగ్గు, రక్తం పడటం జరిగినప్పుడు రక్తస్రావం జరుగుతున్న ప్రదేశాన్ని గుర్తించడానికి అవసరమైన యాంజియోగ్రఫీ పరీక్ష చేసి, ఎంబోలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా అక్కడ రక్తస్రావాన్ని నివారిస్తారు. రోగికి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటే మాత్రం ఇక శస్త్రచికిత్స జరిపి, రక్తస్రావాన్ని ఆపాల్సి ఉంటుంది.

 

డా. రమణ ప్రసాద్  కన్సల్టెంట్  పల్మునాలజిస్ట్
అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్

 

ఆయుర్వేద కౌన్సెలింగ్

 

గుండెకు సంబంధించిన సమస్యలకు స్టెంట్స్ వేయడం, గుండె రక్తనాళాలకు సంబంధించిన పెద్దాపరేషన్లు చేస్తుంటారు కదా. మరి ఆయుర్వేదంలో ఆ సమస్యలకు నివారణ మార్గాలు, చికిత్స, ఔషధాలు ఉన్నాయా? దయచేసి తెలియజేయండి.  - వి. పట్టాభిరామ్, విజయనగరం
గుండె ఒక రకమైన ప్రత్యేక కండరం. జీవితాంతం లయబద్ధంగా స్పందించే ప్రకృతి నిర్మిత యంత్రం. దీని సామర్థ్యం జీవితాంతం సాగిపోవాలంటే ఐదు అంశాలు అత్యంత ప్రధానమైనవి. 1. దీని నిర్మాణంలో పుట్టుకతో వచ్చే లోపాలు ఉండకూడదు. 2. దీనికి లభించే ప్రత్యేకమైన విద్యుత్ సరఫరాలో తేడాలు రాకూడదు. 3. ఈ కండరానికి ‘కొరనరీ ధమనుల’ ద్వారా రక్తప్రసరణ జరుగుతుంది. ఈ రక్తప్రసరణలో అవరోధాలు ఏర్పడకూడదు. 4. కొన్ని సూక్ష్మక్రిములు గుండె పొరలను, కవాటాలను పాడు చేస్తాయి. సాధారణ వైద్య పరిభాషలో వాటిని ఇన్ఫెక్షన్లు అంటారు. అవి సంభవించకుండా జాగ్రత్త తీసుకోవాలి. 5. మానసిక ఒత్తిడి లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి.

 
హార్ట్ ఎటాక్‌లో గుండెకు జరిగే రక్తప్రసరణలో అంతరాయం కలుగుతుంది. క్రమబద్ధంగా గుండె స్పందనలు ప్రకృతిపరంగా నిరంతరం సాగే నిరంతర ప్రక్రియ. గుండె సంకోచించినప్పుడు ఆయా ధమనుల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ  రక్తం సరఫరా అవుతుంది. అలాగే గుండెకు కూడా కొరనరీ ధమనుల ద్వారా రక్తం అందుతుంది. తనలోనే ఉన్న రక్తాన్ని శోషణక్రియ ద్వారా గుండె పీల్చుకోలేదు. గుండెలాంటి క్రమశిక్షణే మనిషి కూడా పాటిస్తూ, తన ఆహార విహారాల మీద నియంత్రణ కొనసాగిస్తే హార్ట్ ఎటాక్‌లు నివారితమవుతాయి.

 
నివారణ: ఇది చిన్న వయసునుంచీ సాధన చేయాల్సిన అంశం. అలా కాకపోయినా ఏ వయసునుంచి అయినా ప్రారంభించవచ్చు.

 
ఆహారం
: తాజా పండ్లు, శాకాహారం, అవసరమైన ప్రమాణంలోనే పాలు, పెరుగు, నెయ్యి, నూనెలు తీసుకోవడం, పీచుపదార్థాలు తీసుకోడానికి, తగినంత నీరు తాగడానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త తీసుకోవడం, చక్కెరపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, జంక్‌ఫుడ్స్‌ను, శీతలపానీయాలను తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.

 
విహారం
: వయసును, వృత్తిని బట్టి ప్రతిరోజూ వ్యాయామం చేసి తీరాలి. (ఉదాహరణకు నడక, ఆటలు, యోగాసనాలు, ఇంట్లోనే అన్ని కీళ్లకూ కదలికలు కల్పించడం మొదలైనవి). ఖాళీ కడుపుతో రోజుకు రెండుపూటలా ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. పొగతాగడం, మద్యం, గుట్కా వంటి వ్యసనాల జోలికిపోకూడదు.

 
ఔషధాలు
: అల్లం 5 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 5, పసుపు ఐదు చిటికెలు, దాల్చిన చెక్క చూర్ణం 5 గ్రాములు కలిపి కషాయం కాచుకుని రోజూ 30 మి.గ్రా (ఆరు చెంచాలు) తాగాలి. పరగడుపున గానీ లేదా ఎప్పుడు తాగినా మంచిదే. ఎంతకాలం తాగినా పర్వాలేదు. దీనివల్ల అన్ని అవయవాలకూ రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రక్తంలో కొవ్వులు ఎక్కువ కావు. మధుమేహానికీ, హైబీపీకి కూడా ఇది నివారణగా పనిచేస్తుంది. ఆహారం జీర్ణం కావడం కూడా బాగా జరుగుతుంది.

 
మద్ది (అర్జున) చెట్టు ‘తెలుపు, నలుపు’ అని రెండు రకాలు. తెల్లమద్ది చెక్క చూర్ణం, గోధుమల చూర్ణం రెండేసి గ్రాములు కలిపి ఆవు నెయ్యి, బెల్లం కలిపి రెండుపూటలా సేవిస్తే గుండెకు మంచిది. ఆవు నెయ్యికి బదులు మేకపాలు కూడా వాడుకోవచ్చు  నల్లమద్ది చెక్క కషాయాన్ని 5 చెంచాలు రోజుకొకసారి మూడు రోజులు తాగితే గుండెనొప్పి తగ్గుతుంది.

 
బజారులో లభించే మందులు:  ప్రభాకరవటి లేదా నాగార్జునాభ్రరస మాత్రలు ఉదయం 1, రాత్రి 1 వాడాలి  త్రిఫలాచూర్ణం 5 గ్రాములు రోజూ రాత్రి పడుకోబోయేప్పుడు నీళ్లతో సేవించాలి.

 

డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్

 

ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్

 

నా వయసు 18 ఏళ్లు. నాకు తొమ్మిదేళ్ల వయసులో ముఖం కాలింది. అప్పట్లో మంచి చికిత్సతో గాయం మానిపోయినప్పటికీ దాని తాలూకు మచ్చ మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ముఖంపై కాలిన గాయం మచ్చ వల్ల నేను మానసికంగా ఆవేదనకు గురవుతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.  - నవీన, వరంగల్
స్కిన్ డ్రాఫ్ట్ సర్జరీ ద్వారా మీ ముఖంపై ఏర్పడిన కాలిన గాయం మచ్చను సమూలంగా రూపుమాపవచ్చు. ఈ సర్జరీకి రెండు విధాల చికిత్సను అనుసరిస్తారు. ఒకటి - స్ల్పిట్ థిక్‌నెస్, రెండోది - ఫుల్ థిక్‌నెస్. మొదటి దానిలో మీ శరీరంలోని ఏదైనా భాగం నుంచి (ఎక్కువగా తొడ భాగాన్నే ఎంచుకుంటుంటారు) చర్మాన్ని తీసి, అవసరమైన చోట సర్జరీ ద్వారా అమర్చుతారు. దీనికి మూడు వారాల సమయం వరకు పడుతుంది. అలాగే చిన్నపాటి కుట్లు (స్టిచెస్) కూడా వేయాల్సి ఉంటుంది. ఇక రెండో విధానానికి వస్తే... ఈ ప్రక్రియలో కూడా మొదటి విధానాన్నే అనుసరిస్తారు. అయితే చర్మాన్ని రెండు విడతలుగా మచ్చపై అమర్చి కుట్లు (స్టిచెస్) లేకుండా సర్జరీ ముగిస్తారు. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా సర్జరీ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మచ్చను పూర్తిగా కనబడకుండా చేయడానికి ఈ విధానంలో ఆరు వారాలకు పైగా పడుతుంది. సాధారణంగా ఈ విధానాన్ని బ్రెస్ట్, ముక్కు సర్జరీలకు వాడుతుంటారు. కాలిన గాయాలతో ఏర్పడిన మచ్చ తీవ్రతను బట్టి కూడా ఈ ప్రక్రియను వాడే అవకాశం ఉంది. మీ ముఖంపై ఉన్న మచ్చను బట్టి సర్జరీకి ఏ విధానం అవలంబిస్తారనేది సర్జన్ నిర్ణయిస్తారు. మీరు వెంటనే మంచి నిపుణులైన ప్లాస్టిక్ సర్జన్‌ను కలిసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందవచ్చు.

 

డా.శశికాంత్ మద్దు సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ  హైదరాబాద్

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement