గుండెపోటు అని తెలియగానే ఏం చేయాలి? | What is found out to be a heart attack? | Sakshi
Sakshi News home page

గుండెపోటు అని తెలియగానే ఏం చేయాలి?

Published Mon, Nov 7 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

గుండెపోటు అని తెలియగానే ఏం చేయాలి?

గుండెపోటు అని తెలియగానే ఏం చేయాలి?

కార్డియాలజీ కౌన్సెలింగ్

గుండెపోటు వచ్చినప్పుడు పెద్దాసుపత్రులకు వెళ్లే లోపు రోగికి ఎలాంటి ప్రథమ చికిత్స ఇవ్వాలో తెలియజేయండి.  - ఎన్. నాగార్జున, సదాశివపేట
రోగికి గుండెనొప్పిగా అనిపిస్తోందని తెలిసిన వెంటనే అతడిచేత ఒక గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఈసీజీ తీసే సమయం కూడా ఉండకపోవచ్చు. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే డిస్ప్రిన్-300 మి.గ్రా. మాత్రను నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టిగానీ, పడుకోబెట్టి కూడా తల కాస్తంత పైకి లేపిగానీ డిస్ప్రిన్-300 మి.గ్రా. కలిపిన ద్రావణాన్ని తాగించవచ్చు. ఆ తర్వాత సార్బిట్రేట్ మాత్ర కూడా వేయవచ్చు. దీంతో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా (శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించకుండా) ఏదో ఒక వాహనం మీద రోగిని ఆసుపత్రికి తరలించాలి. డిస్ప్రిన్ మాత్ర డాక్టర్లు ఇచ్చే స్ట్రెప్టోకైనేజ్ ఇంజెక్షన్‌కు సమానంగా పనిచేస్తుంది. అందుకే గుండెనొప్పి వచ్చినవారికి సార్బిట్రేట్ కన్నా డిస్ప్రిన్ చాలా ముఖ్యం. ఆ మాత్రను నీళ్లలో కలిపి  తాగించడం వల్ల... వెంటనే ఒంటిలో అది కలిసిపోతుంది. ఇక డిస్ప్రిన్, సార్బిట్రేట్... ఈ రెండూ ఇవ్వడం వల్ల రోగికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.

గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా అమూల్యమైనది. కాబట్టి గుండెనొప్పి వచ్చిన రోగిని, నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్‌కు చేర్చడం చాలా ముఖ్యం. కొందరు దడ వచ్చిన వెంటనే కళ్లు తిరిగి పడిపోతారు. గుండెవేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోతారు. దీన్ని ‘సింకోప్ అటాక్’ అంటారు. ఇది గుండెజబ్బుకు సూచన. గుండె దడతో పడిపోయిన వారు మాత్రం రెండు నిమిషాల్లోనే మళ్లీ తేరుకుని, లేచి నడవగలరు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీసి, అవసరమైన చికిత్స అందించడం మేలు.

నా వయసు 28 ఏళ్లు. నేను ఇటీవలే రొటీన్ చెకప్ చేయించగా... నా రక్తంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ పాళ్లు చాలా అధికంగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు. నేను పూర్తిగా శాకాహారిని. వేరే ఏ విధమైన దురలవాట్లూ లేవు. పైగా ఇంత చిన్న వయసులోనే కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయంటే నమ్మకం కుదరడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - విశ్వేశ్వర రావు, చిత్తూరు
మీరు తినే ఆహారం వల్లగాక... వంశపారంపర్యంగానే మీలో కొలెస్ట్రాల్ పాళ్లూ, ట్రైగ్లిజరైడ్ పాళ్లు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏ వ్యక్తి అయినా ఎలాంటి కొవ్వు పదార్థాలు తీసుకోనప్పటికీ, శరీరానికి సంక్రమించిన జన్యువులను బట్టి కొవ్వుపదార్థాల తయారీ, అవి పెరగడం వంటివి సంభవిస్తాయి. దాంతో రక్తంలో కొవ్వు పాళ్లు ఎక్కువ మోతాదులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ‘లిపిడ్ ప్రొఫైల్’ పరీక్ష చేయించుకోండి. కొవ్వులను అదుపులో పెట్టేందుకు వాటిని సమర్థంగా తగ్గించే మందులు మనకు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మీరు డాక్టర్ల సలహా తీసుకొని, ఆ మందులను మీకు తగిన మోతాదులో వాడుకుంటూ, గుండె సంబంధమైన వ్యాధులను నివారించుకొని హాయిగా జీవితం గడపవచ్చు.

డాక్టర్ అనుజ్ కపాడియా
సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్

ఆస్టియో పోరోసిస్‌కు పరిష్కారం ఉందా?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. రుతుస్రావం ఆగిపోయింది. కండరాలు, ఎముకల నొప్పులు వస్తే డాక్టర్‌ను సంప్రదించాను. ఆస్టియో పోరోసిస్ ఉందని అన్నారు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? - సునీతా దేవి, విజయనగరం
ఆస్టియో పోరోసిస్ అనేది ఎముకల సాంద్రత తగ్గించి, పగుళ్లు లేదా విరిగే అవకాశాలను పెంచే వ్యాధి. పాత కణాలు అంతరించి కొత్త కణాలు అంకురించే ప్రక్రియ ఎముకల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఏ కారణంగానైనా తరిగిపోతున్న పాత ఎముకకు సరిసమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఎముకలు పెళుసు బారిపోయే ఆస్టియో పోరోసిస్ వ్యాధి మొదలువుతుంది. వీరిలో అతి చిన్న దెబ్బకు లేదా చిన్న బెణుకుకే ఎముకలు విరిగిపోవచ్చు లేదా పగుళ్లు బారవచ్చు.  ఈ పెళుసుదనం, పగుళ్లు సాధారణంగా వెన్నెముక, పక్కటెముక, తుంటి ఎముక, మణికట్ల వంటి స్థానాల్లో ఏర్పడతాయి.

ఎముకల నిర్మాణంలో క్యాల్షియమ్ గురించిన ప్రస్తావనే ఎక్కువగా ఉంటుంది. ఆస్టియో పోరోసిస్ సమస్యను నివారించడంలో డి-విటమిన్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఆస్టియో పోరోసిస్ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో ఏమీ కనిపించవు. కానీ ఎముకలు లోలోపల క్షీణిస్తూనే ఉంటాయి.

కారణాలు:   దీర్ఘకాలికంగా మందులు వాడటం  నూనె, మసాలా పదార్థాలు వాడటం  శారీరక శ్రమ లేకపోవడం  వయసు పైబడిన కారణంగా సన్నబడిపోవడం  సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకపోవడం వల్ల

లక్షణాలు:  ఎత్తు తగ్గి నడుము, ఇతర అవయవాలు ఒంగిపోతాయి  నడుమునొప్పి  అలసట  ఎముకల్లో నొప్పి, ఎముకలు త్వరగా విరిగిపోవడం  ఎముకల సాంద్రత తగ్గిపోవడం

వ్యాధి నిర్ధారణ
రక్తపరీక్షలు  ఎక్స్-రే  డీఎక్స్ (డ్యూయల్ ఎనర్జీ ఎక్స్-రే అబ్జార్‌ష్షియోమెట్రీ

చికిత్స
ఆస్టియో పోరోసిస్‌కి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి తగిన మందులను వైద్యులు సూచిస్తారు. ఆస్టియో పోరోసిస్‌కి హోమియోలో కాల్కేరియా ఫాస్‌ఫారికా, ఫాస్ఫరస్, సల్ఫర్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.

డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement