సంసార రహస్యం.... ఇదిగో!
ఫన్
లండన్‌లో ‘పెళ్లి, దాని ప్రాముఖ్యత’ ‘సంసారం సజావుగా సాగాలంటే...’ అనే విషయాలపై ప్రతి వారం సెమినార్లు జరుగుతుంటాయి. ఓ రోజు ముఖ్య అతిథిగా గుర్నాథంగారు వచ్చారు. ఇంకో వారం రోజుల్లో ఆయన 50 వ వివాహ వార్షికోత్సం జరగనుంది. ‘‘అయిదారు సంవత్సరాలకే తలప్రాణం తోకకు వస్తుంది. యాభై సంవత్సరాలంటే మాటలా?’’ అని జూనియర్, సీనియర్ భర్తలందరూ గుర్నాథం చుట్టు చేరి పొగడడం ప్రారంభించారు.
‘‘విజయ రహస్యం మీలోనే దాచి పెట్టుకుంటే ఎలా? మా బోటి వాళ్లకు చెబితే మేలు చేసినవారవుతారు’’ అన్నాడు ఒక ఔత్సాహిక భర్త.
‘‘దానిదేముంది గురూ! తప్పకుండా చెబుతాను’’ అని వేదిక ఎక్కి మైక్ అందుకొని చెప్పడం ప్రారంభించాడు గుర్నాథం.‘‘నా భార్యను ఒక దేవతలా చూసుకున్నాను. ఆమె ఎంత డబ్బు అడిగినా... కాదనకుండా లేదనకుండా ఇచ్చాను. అడిగినా అడగకపోయినా విలువైన నగలు తెచ్చాను. అందమైన చీరలెన్నో కొనిచ్చాను. వీటన్నిటికన్నా నేను చేసిన గొప్ప పని...మా 25 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లడం’’ అన్నాడు. గుర్నాథం ప్రసంగానికి భర్తలందరూ చప్పట్లు కొట్టారు.
‘‘మీ 50వ వివాహవార్షికోత్సవం సందర్భంగా ఈసారి ఏం చేయాలనుకుంటున్నారు?’’ అని అడిగారు ప్రేక్షక భర్తలు. గుర్నాథం చిన్నగా నవ్వి ఒక్క క్షణం ఆగి ఇలా అన్నాడు: ‘‘ఏమీ లేదు. హైదరాబాద్‌కు వెళ్లి పాతికేళ్ల క్రితం వదిలిన ఆమెను వెనక్కి తీసుకురావాలనుకుంటున్నాను.’’