పండుగ... పబ్బం
30 (ఆదివారం)- దీపావళి అమావాస్య: వేకువజామునే లేచి, తలంటు స్నానం చేయాలి. ఉదయం పూజాదికాలతోపాటు సాయంత్రం లక్ష్మీపూజ చేసి, వీధి గుమ్మం దగ్గర, తులసి కోట దగ్గర దీపాలు వరుసగా వెలిగించి, ఉంచాలి. వ్యాపారస్థులు జమాఖర్చులకు కొత్త ఖాతా పుస్తకాలు తెరవాలి. ఇక, దీపావళి నాటి రాత్రి జపం చేస్తే, లెక్కలేనంత ఫలితం వస్తుందంటారు.
31 (సోమవారం)- కార్తిక మాస ఆరంభం, బలి పాడ్యమి: గుజరాతీయులకు ఈ రోజు నుంచి నూతన సంవత్సర ఆరంభం. మొత్తం ఈ రోజంతా శుభముహూర్తమనీ, సర్వకార్యాలనూ సిద్ధింపజేసే తిథి అనీ పెద్దల మాట.
నవంబర్ 1 (మంగళవారం) - యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం: ఈ రోజున అన్నదమ్ముల్ని పిలిచి, సోదరి వారికి స్వయంగా వండి, వడ్డించడం (భగినీ అంటే సోదరి) ఆచారం. అన్నదమ్ములు ఆయుష్మంతులు కావాలని యముణ్ణి ప్రార్థిస్తారు. అక్కచెల్లెళ్ళు క్షేమంగా, సుఖంగా ఉండాలని సోదరులు ఆశించి, వాళ్ళకు కానుకలిస్తారు. ఆ రోజు సోదరి చేతి వంట తిన్నవాడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యు భయం ఉండదు. సోదరుడిని ఇంటికి పిలిచి, అలా గౌరవించిన సోదరి సుమంగళిగా వెలుగుతుంది.
నవంబర్ 3 (గురువారం) - నాగుల చవితి: పుట్టలో పాలు పోసి, చిమ్మిరి, చలిమిడి నైవేద్యంగా పెట్టాలి. పుట్టమట్టిని కొంచెం తీసుకొని, చెవులకు పెట్టుకుంటారు. చెవి బాధలు, కంటి బాధలు ఉన్నవాళ్ళు ఆ రోజు ఉపవాసం ఉంటే మంచి జరుగుతుంది.