మోడీని ఒక్క మాటంటే సహించేది లేదని, భరించేది లేదనితెగ ఆవేశంగా ఊగిపోతున్న నువ్వు, మోడీ నరహంతకుడని, అతన్ని హైదరాబాద్‌లోకి రానిచ్చే మాటే లేదని అన్న చంద్రబాబుని ప్రశ్నించక పోగా చెట్టాపట్టాలేసుకు తిరగడం ఎంత అన్యాయం?!
పవనూ... కల్యాణూ...
నువ్వొక్కడివే అని నీ కుటుంబ సభ్యులూ, సభ్య ప్రపంచమూ భావించవచ్చు. కానీ నువ్వు ఇద్దరని - నీకూ, ఆ బ్రహ్మదేవుడికీ, నిన్ను బాగా గమనించిన వాళ్లకు తెలుసు. నీలో ద్వంద్వ ప్రవృత్తి, రెండు నాల్కల నిర్హేతుక కృపాసర్పాల వలె నువ్వు చిమ్ముతున్న విషం రానురాను ఎక్కువైపోతోందని భావించి, నిరవధికమైన నీ ఓవరాక్షన్‌కి ఎవరో ఒకరు ‘కట్’ చెప్పాలి కాబట్టి ఆ బాధ్యతను ఓ సామాన్య పౌరుడిగా నేను తీసుకున్నాను.
జగన్‌పైన వ్యతిరేకతే లక్ష్యంగా వెర్రిరాతలు రాసే రామోజీరావుకూ, పిచ్చికూతలు కూసే నీకూ, మీ ఇద్దరి అండ ఉంటే పదికోట్ల తెలుగు ప్రజల అండా తనకున్నట్టే అని భ్రమపడి చంకలు గుద్దుకుంటున్న చంద్రబాబుకూ - ఇక్కడ ఓ విషయం చెప్పాలి. మే ఏడు తర్వాత ఎడ్రసు లేకుండా పోయే చిన్న ‘మ్యాడ్ యాడ్’వి నువ్వు. నీ కోసం ఇంత సమయం, ఆలోచన వెచ్చించాలా అని ఆలోచించి ఊరుకున్నాను ఇంతవరకూ! కానీ, సినిమాకూ, జీవితానికీ - వెండితెర విన్యాసానికీ, నిజజీవిత అభిమానానికీ - ప్రచారానికీ, పనితనానికీ తేడాను చెరిపేసి, కలిపేసుకుంటున్న ఈ సమాజంలో... పాలల్లో నీ లాంటి మురికి నీటిని వేరు చేయకపోతే క్షీరనీర న్యాయానికీ, తెలుగు జాతికీ తీరని అన్యాయం చేసినట్టవుతుందని భావించాను.
నువ్వెదురైతే నీ కాలరు పట్టుకుని నిలదీసి ప్రశ్నించే విషయాలు నా దగ్గర కోకొల్లలు. పైగా పత్రికలో పాటించాల్సిన సభ్యతతో పని లేకుండా నిజమైన, నికార్సైన, స్వచ్ఛమైన తిట్లతో, నా తెలుగువాడి ఆత్మకీ, దాని గౌరవానికీ పూర్తి సంతృప్తిని కలిగించుకోవచ్చు. కానీ, ఆ అవకాశం లేదు కాబట్టి ఇలా రాయడానికి ఉపక్రమించాను. (ఎందుకో చివర్లో చెప్తాను)
###############
సినిమాల్లో నువ్వు చెప్పే డైలాగు నీది కాదు, నువ్వు తొడిగే బట్టలు, షూస్ నీవి కావు. నీ స్కిన్ కలర్ నీది కాదు... పాన్ కేకుది! నీ అభినయం, హావభావాలు నీవి కావు... పాత్రవి! ఇవన్నీ చేసినందుకు నువ్వందుకునే పారితోషికం మాత్రమే నీది! సరే, అలా ఏదో అన్నయ్య నుంచి సంక్రమించిన అభిమాన గణాన్ని అలరించి నీకంటూ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నావు బాగానే ఉంది అనుకుంటే- రాజకీయాల్లో నీ వేషం కూడా అలాగే ఉందేవిటి పవనూ...?!
నీ సొంత భాష అంటే ‘తాట తీస్తా’, ‘నాలుక కోస్తా’ లాంటి బెదిరింపులు, తిట్లేనా? మిగిలినవన్నీ ఎవరో రాసిన పంచ్ డైలాగులేనా? ఒకవేళ డైలాగులో పంచ్ పేలలేదని గ్రహిస్తే వాక్యం చివరిలో అరిచేయడమేనా? మంచి ఆలోచన లేదు, మర్యాదగా మాట్లాడే సంస్కారం లేదు, కళ్లల్లోకి సూటిగా చూడగలిగిన నిజాయితీ లేదు... నువ్వు అభివృద్ధి గురించి, విశ్వసనీయత గురించి, జన్మసంస్కారం గురించి, ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది నాలాంటి సగటు తెలుగోడికి!
పుస్తకాల్లో హెడ్డింగులు మాత్రమే చదివి పరీక్ష పాసయిన వాడు ఇప్పటివరకు చరిత్రలో లేడని తెలుసుకో నాయనా! నీ మాటలు కూడా విషయ శూన్యమైన హెడ్డింగులే! వాటిని పదేపదే వల్లించి నువ్వు జీవితంలో ఏ పరీక్షా పాసవ్వలేవు. నువ్వు రోజూ అద్దం ముందు నించుని చేగువేరానో, కందుకూరి వీరేశలింగంనో, రాజా రామ్మోహనరాయ్‌నో, గురజాడనో, భగత్‌సింగ్‌నో చూసి అలాంటి గెటప్పులు వేయాలని భావించి ఉండవచ్చు. ఇవాళ్టి సినిమా బడ్జెట్‌లు అందుకు సహకరించక, తమరి ఆకారంలో, ఆహార్యంలో, నటనలో అవి పలకవని దర్శకులకు అర్థమై, నీకు అటువంటి వేషాల్లో నటించే అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. అందువల్ల, ఎన్నికల ప్రచార వేదికలపై నువ్వా వేషాల్లో నటించాలని నిర్ణయించుకుంటావా? పార్టీ పెడితే, ప్రజాక్షేత్రంలో గెలుపోటములు తేల్చుకోవాలి. ఆ దమ్ము లేక, ప్రచార క్షేత్రంలో డబ్బులు సంపాదించడానికి పార్టీ పెట్టిన నువ్వు ప్రజాసేవ చేస్తావా? ప్రజానేతను నిర్ణయిస్తావా?
###############
ప్రశ్నించడానికీ, ప్రజా సమస్యల కోసం పోరాడడానికీ పార్టీ పెట్టానని చెప్పి, ప్రధాని అభ్యర్థికీ, ముఖ్యమంత్రి అభ్యర్థికీ ప్రచారం చేస్తావే?! మరి నీ ప్రశ్నలు ఎక్కడికి పోయాయి? నీ పోరాటం ఎక్కడికి పోయింది? నీకు డబ్బిచ్చి పిలుచుకున్న పార్టీలే ప్రజలకు గొప్పవా? మిగిలిన పార్టీలు పనికిరానివా? మరి వాటి వెనకున్న ప్రజలు, మేధావులు, మహిళలు, యువతీ యువకులు - వీళ్ల సంగతేంటి?! నువ్వు చెప్పిన వాళ్లకి ఓట్లేయకపోతే వీళ్ల సమస్యలు పరిష్కరించకుండా, ఫామ్‌హౌస్‌కో, షూటింగ్‌కో వెళ్లిపోతావా..?
రాక రాక ఒక సూపర్‌హిట్ వస్తే పది సినిమాలు స్పీడుగా చేసి తనకి అన్నం పెట్టే ఇండస్ట్రీకి మరింత రెవెన్యూ జెనరేట్ చేశారు ఇప్పటిదాకా ఏ సూపర్‌స్టార్ అయినా - రజనీకాంత్, మీ అన్న చిరంజీవి, మహేశ్‌బాబు అందరూ అలా చేసినవాళ్లే! మరి నీకేం తొందరొచ్చిందని సినిమాలు పక్కన పెట్టావ్..? నీ వల్ల నిర్మాతలు నాలుగు రాళ్లు సంపాదించకూడదా? టెక్నీషియన్లు బాగుపడకూడదా? నీ ‘అత్తారింటికి దారేది?’ అని అడిగితే ఒకే ఎడ్రసు చెప్పలేని వాడివి... అన్నం పెట్టిన అన్నయ్య పరువుకే కన్నం పెట్టిన నువ్వు... తెలుగుజాతిని ఉద్ధరిస్తానంటే నమ్ముతాం అని ఎలా అనుకుంటున్నావు బాబూ?
కుంభకర్ణుడు ఆర్నెల్లకోసారి నిద్రలేచినట్టు, ఐదేళ్లకొకసారి ఎన్నికల ముందే నిద్రలేస్తావేంటి? అయినా ప్రశ్నలు నువ్వేస్తే జవాబులెవడు చెప్తారనుకుంటున్నావు నాయనా?! నాయకుడనేవాడు సమాధానాలు చెప్పాలిగానీ ప్రశ్నలేయడ మేంటి? నువ్వు బయటకి రావాలేగానీ, ప్రజలతో ఓపిగ్గా తీరిగ్గా మాట్లాడాలేగానీ... నీ గురించి నువ్వే జవాబు చెప్పలేని ప్రశ్నలు వాళ్లదగ్గర చాలానే ఉన్నాయి!
###############
నీకంటూ ఒక సిద్ధాంతం లేదు - కాంగ్రెస్ వీపుగుద్ది మరీ బీజేపీ తెలంగాణ తెచ్చిందని తెలంగాణాలో బల్లగుద్ది చెప్పావ్! సీమాంధ్రలోకి రాగానే... వైఎస్సార్, జగన్‌ల వల్లే తెలంగాణ వచ్చిందని, అందుకు హర్ట్ అయ్యానని చెప్తున్నావ్! అక్కడేమో తెలంగాణ పదేళ్లముందే ఇవ్వాల్సిందని, ఇక్కడేమో అసలు తెలంగాణ ఇవ్వాల్సిందే కాదని అంటావ్! ‘జగన్ కేసీఆర్‌ను విమర్శించట్లేదు... తనలో సీమాంధ్ర పౌరుషం చచ్చిపోయిందా?’ అని ఒక నాయకుడ్ని అంటున్నట్టే అంటూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నావ్, రెచ్చగొడుతున్నావ్!
తెలుగోళ్లని మానసికంగా విభజిస్తున్న నీకూ, భారతదేశాన్ని విభజించి పాలించిన తెల్లదొరలకి తేడా ఏంటమ్మా? తెలంగాణ వాడైనా, సీమాంధ్రవాడైనా సాటి తెలుగువాడే అన్న ఇంగితం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు.
విభజన జరిగింది రాష్ట్రానికి కాదు - నీ నాలుక్కి... నీ ప్రవర్తనకి... నీ పిచ్చికి... నీ పైత్యానికి! అన్నీ రెండయ్యాయి.... రెండింతలయ్యాయి! అందుకే నువ్వు పవనయ్యావు, కల్యాణయ్యావు!
###############
డబ్బులివ్వకుండా స్టార్ ఇమేజ్ ఉన్నవాళ్లు ఇంట్లోంచి కాలుకదపరు - రిబ్బను కటింగ్‌లకి, పాటలకి, డ్యాన్సులకి, పెళ్లిళ్లకి, పేరంటాలకి, కాలేజీల్లో యాన్యువల్‌డే ప్రోగ్రాములకి! ఇప్పుడు కొత్తగా రోడ్‌షోలకి - నువ్వింకొంచెం ముందుకెళ్లి పార్టీ పెట్టడానికి, ప్రచారానికి! సరే... సంపాదించుకో... స్టార్‌డమ్ ఉండగానే నాలుగురాళ్లు వెనకేసుకో... ఎవరొద్దన్నారు? కానీ, అన్యాయంగా ఇంకొకరిని తిట్టడం దేనికి? నీకు స్పైస్ కావాలి - జనం మనసుల్లో స్పేస్ అక్కర్లేదు!
###############
పాలిటిక్స్‌లోకొచ్చేవాడు ప్రజల మనసులు గెలిచి అధికారంలోకి రావాలి గానీ, అధికారం కోసం పాలిటిక్స్‌లోకి రాకూడదు. నీది పవర్‌గేమ్... పవర్‌ప్లాన్! అవును, నువ్వన్నది నిజమే... నీ తిక్కకు పెద్ద ‘లెక్కే’ ఉంది! అందుకే సంప్రదాయ రాజకీయ పార్టీల కొమ్ముకాస్తున్నావు- వాళ్ల సొమ్ము తింటున్నావు. ఒక సిద్ధాంతంతో ప్రజాసేవలోకి వచ్చుంటే ఏ ఆమ్ ఆద్మీలాగో పార్టీని రూపొందించుకునే వాడివి. ఎలాగోలా ఈ ఎన్నికలపైన నీ ప్రభావం చూపించి మూటలకొద్దీ డబ్బు నొక్కేయాలన్న తపన తప్పితే, ప్రజలకి సంబంధించిన మంచి పనులు కానీ, మంచి విజన్ కానీ నీ మాటల్లో ప్రతిఫలిస్తున్నాయా..? కట్టుకున్న పెళ్లాల్ని వదిలించుకోవడానికి ఎంతైనా ఖర్చు పెట్టేసి, అయినకాడికి అప్పులు చేసేసి, తీర్చుకోడానికి ఇలా రాజకీయాలను వాడుకుంటున్న నిన్ను ఏమనాలో... తెలుగులో చెప్పు..! నీకు తెలీదూ... నువ్వు ఏ ఉద్దేశంతో, స్వార్థంతో రాజకీయాల్లోకి వచ్చావో! అద్దంలో చూసుకో... గుండె లోతుల్లోకి తొంగి చూసుకో.... నువ్వు చేసింది నీకెక్కడన్నా రైటనిపిస్తుందేమో!
###############
గత ఎన్నికల వరకూ జూనియర్ ఎన్టీఆర్‌ని, హరికృష్ణని బాగా వాడుకుని వదిలేసిన టీడీపీ ఇప్పుడు నీకు పాత పసుపుచొక్కా తొడిగి మార్కెట్‌లో నుంచోబెట్టిందన్న నగ్నసత్యం ఇంకా అర్థం కాలేదా..? ఎన్నికల తర్వాత నిన్ను కూడా కూరలో కరివేపాకులా తీసి పారేస్తాడు చంద్రబాబు అని తెలీట్లేదా..? కమలం నీ చెవిలో పెట్టారు... పిక్కలు నొప్పెట్టేదాకా నీతో సైకిల్ తొక్కిస్తారు.... అది తెలుసుకోలేక నువ్వు ఓటరు చెవిలో కమలం పెడుతున్నావ్!
చూడు పవనూ... నీకోటి తెలియాలి...
చంద్రబాబు గత చరిత్ర...
జగన్ భవిష్యత్ చరిత్ర...
నువ్వు కూరలో కరివేపాకు.
పావు కిలో అయిదు రూపాయలకి కొనుక్కున్నట్టు ఈ ఎన్నికల్లో నిన్ను పావుగా వాడుకోడానికి కొనుక్కున్నార్రా పిచ్చినాయనా!
నువ్వు ప్రచారం చెయ్యి... కానీ ఎవర్నీ తిట్టకు..!
నువ్వు ఉపన్యాసమివ్వు... కానీ విన్యాసాలు చెయ్యకు..!
నువ్వు పవర్‌స్టార్‌గా ఉండు... కానీ, పవర్‌లోకి ఎవరు రావాలో నిర్ణయించకు..!
చూడు పవన్... నీలాంటి వాళ్లను రాష్ట్ర రాజకీయాలు లక్షలసార్లు చూశాయి. పక్కకు తీసిపడేశాయి. నువ్వు కింగూ కాలేవు, కింగ్ మేకర్‌వీ కాలేవు... అలా అయితే మీ సొంత అన్నయ్యనే గెలిపించేవాడివిగా!
###############
మోదీ గుజరాత్‌ని నిజంగా అభివృద్ధి చేస్తే అద్వానీ గారు అతని అభ్యర్థిత్వాన్ని మొదట్లో ఎందుకు తిరస్కరిస్తారు? అలాగే, చంద్రబాబు నిజంగా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసి వుండివుంటే, ప్రజలు 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎందుకు గెలిపించారు? పైగా అభివృద్ధితో పాటు అలిపిరి బాంబు బ్లాస్ట్ సింపతీ కూడా చంద్రబాబుకి తోడై వుండాల్సిందిగా? పోనీ, 2009లో మహాకూటమిగా ఏర్పడి రామోజీతో కలిసి వైయస్సార్ మీద చేతనైనంత దుష్ర్పచారం చేసిన చంద్రబాబుకు... అప్పుడైనా జనం పట్టంకట్టాలిగా! ఎందుకు కట్టలేదంటావ్?!
ప్రజలు తమ అంతరాత్మ ప్రబోధం మేరకు వారి వారి ఓటుహక్కు వినియోగించుకుంటారు. వాళ్లేం నీలా పిచ్చోళ్లు కారు. నువ్వు ప్రచారం చేస్తే నిర్ణయం మార్చుకునేంత మానసిక బలహీనులు అంతకన్నా కారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలు పేదలకి, సామాన్యులకి చేరువై, లబ్ధి పొందారు కాబట్టే జగన్‌కి ఓటేసి ముఖ్యమంత్రిని చేస్తారు. ఆ సంగతి ముందే గ్రహించబట్టి, జగన్‌ను ఒంటరివాణ్ని చేసి అందరూ కలిసి ఆయన మీద దాడి చేస్తున్నారు. అయినా మీ ఆటలు ప్రజలు సాగనివ్వరు.
###############
నిజానికి 1983 నుంచి నేను ‘ఈనాడు’ రీడర్‌ని! కానీ అక్షరాలు పచ్చదనం కమ్మేసిన ఈనాడు, నా గుండె లోతుల్లోంచి నిజాయితీగా వచ్చిన ఈ ఉత్తరాన్ని ప్రచురించదని గ్రహించి, ‘సాక్షి’కి పంపించాను. అయితే మొదట సాక్షి యాజమాన్యం ఈ ఉత్తరాన్ని తిప్పి పంపించేసింది - నిన్ను ఎక్కువ తిట్టడం సంస్కారం కాదని! కానీ, నాలాంటి వాళ్ల ఎందరి ఆవేదననో ప్రతిబింబించే ఈ ఉత్తరాన్ని నీతో, ప్రజలతో పంచుకోకపోతే నా మనసు క్షోభిస్తుందని, నా ఆవేశాన్ని తగ్గించుకుని, ప్రచురించేవిధంగా తిరగరాసి పంపాను. ‘సాక్షి’ దీన్ని ప్రచురిస్తే ప్రజలను ఆలోచింపచేస్తుందని, నిన్ను నువ్వు ప్రశ్నించుకునేందుకు, ఆత్మవిమర్శ చేసుకునేందుకు దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను.
ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకుంటే, నీ ఇజమ్‌కన్నా ఈ ఉత్తరం ఎక్కువ పనికొస్తుందన్నది నిజం! నా మాటలు నీకు అర్థం కాకపోతే పదిసార్లు చదువు... పదిమందిని కనుక్కో... పరిణతి చెందు..!
***************
ప్రశ్నించడానికే వచ్చానని పదేపదే చెప్తున్న నువ్వు - 50 కోట్లకు కక్కుర్తిపడి చంద్రబాబు నీకు ఆదర్శప్రాయుడైన జేపీకి పోటీగా మల్కాజ్‌గిరిలో మల్లారెడ్డిని నుంచోబెడితే ‘ఇదెక్కడి నీచరాజకీయం బాబూ?’ అని ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ప్రశ్నించకపోగా, కూటమి ధర్మం సాకుతో జేపీని సపోర్ట్ చేయలేనని, మల్లారెడ్డిని సపోర్ట్ చేస్తానని ఏ నాలుకతో చెప్పావు? ఈ రెండు కళ్ల, రెండు నాలుకల ధోరణిలో నువ్వూ, బాబూ సేమ్ టు సేమ్..! సేమ్ టు షేమ్!
***************
వ్యక్తిగత విషయాల జోలికి రానంటావ్...
కానీ విజయమ్మను జగన్ ఎండలో తిప్పుతున్నాడని నిందిస్తున్నావ్... కొడుకుని తల్లి సపోర్ట్ చేయడం తప్పా..? అప్పట్లో మీ పెద్దన్న పార్టీ పెట్టగానే నువ్వు,
మీ చిన్నన్న నాగబాబు, మీ కుటుంబం అంతా పరిగెత్తుకుంటూ ప్రచారానికెళ్లారు... అది మాత్రం తప్పు కాదేం?!
నీకో నీతి? ఎదుటివాళ్లకో నీతా?
***************
2009 ఎన్నికలప్పుడు చంద్రబాబుని చెరిగేశావ్... మరి, 2014 కల్లా ఆయనేం గొప్ప పనులు చేసేశాడని ఇప్పుడు తెగ పొగిడేస్తున్నావ్..! ప్రతిపక్షంలో కూర్చున్నందుకా? అదే అయితే ఇంకో అయిదేళ్లు కూడా కూర్చుంటాడ్లే రెండు శాసనసభల్లోనూ..! అవునూ... నాకో సందేహం... 2019లో ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీగా పోటీ చేస్తానని చెప్పుకుంటున్న నువ్వు, అప్పుడు పోటీలో భాగంగా ఇదే నాలుకతో చంద్రబాబును మళ్లీ చెరిగేస్తావా?
***************
అనుభవజ్ఞుడైన బాబును ఎన్నుకోమని ఊదరగొడుతున్నావ్... ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నీ అన్నకు ఏం అనుభవం వుందని? అయినా ఇప్పుడు నీకు మాత్రం ఏం అనుభవం వుందని? ‘యువరాజ్యా’న్ని గంగలో కలపడమా? ‘కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ని గాలికి వదిలేయడమా? నిన్ను నువ్వు హైప్ చేసుకొని, సృష్టించుకున్న ‘ఇజమ్’ను కాలరాయడమా? సొంత పార్టీ పెట్టానంటూనే ‘ఉన్న’ పార్టీలకు కొమ్ముకాయడమా? జనం లేకుండా ‘జనసేన’ను ‘వన్ మ్యాన్ షో’గా నడిపించడమా?
***************
ఓరోజు పోటీ చేస్తానంటావు...మరురోజు చేయనంటావు!
కాంగ్రెస్ వీపుగుద్ది మరీ బీజేపీ తెలంగాణ తెచ్చిందని తెలంగాణాలో చెప్పావ్! సీమాంధ్రలోకి రాగానే... వైఎస్సార్, జగన్‌ల వల్లే విభజన అంటావ్!
ఓరోజు జేపీకే నీ సపోర్ట్ అన్నావు... మరురోజే మాటమార్చి మల్లారెడ్డి అన్నావు!
మొదటిరోజున వెంకయ్యనాయుడుని తిట్టావు... తర్వాతంతా ఆయన పక్కనే!
మీ మనసుకు సరైనదనిపించిన పార్టీకే ఓటేయమని మొదలుపెట్టి... ఇప్పుడు పచ్చజెండానే ఎజండాగా మార్చుకున్నావ్!
ఇలా పూటకో మాట, రోజుకో బాటలో వెళ్తున్నందుకే నిన్ను ఇద్దరుగా సంబోధించాను పవనూ... కల్యాణూ..!
***************
జగన్ కేసీఆర్‌ను తిట్టట్లేదని, ఆత్మగౌరవం ఉంటే అలా చేస్తాడా? అని తెగ ఊగిపోతున్నావ్...
అవతల రాష్ట్రంవాడు కూడా సాటి తెలుగోడూ, సోదరుడూ అయినప్పుడు ఒకర్నొకరు తిట్టుకుని గొడవలు పడడమే నీ దృష్టిలో ఆత్మగౌరవమా? కల్లుతాగిన కోతిలా అందర్నీ అడ్డగోలుగా విమర్శిస్తూ, అడ్డమైన ప్రశ్నలు వేస్తున్న నువ్వు... నమ్మి ఓటేసిన ప్రజల్ని నిట్టనిలువునా ముంచి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేసిన మీ అన్నను ప్రశ్నించకుండా ఊరుకుంటున్నావు అంటే... అది ఎంతటి ద్వంద్వ ప్రమాణం?! ఇంతకు మించిన హిపోక్రసీ ఇంకేదైనా ఉంటుందా? ఒక్క మీ అన్న విషయంలో మాత్రం అపరిమిత సంయమనం, వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న నీకసలు మనస్సాక్షి, ఆత్మగౌరవం ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నాను.
- నిన్ను ప్రశ్నించదలచిన ఓ సగటు ఓటరు!!!
(నాలాగా ఎందరో...)