బక్క పోశాలు.. మళ్లీ బతికిండు!
రోజూ కనబడే కథలు
ఎండ ఇరగదీసే సమయం. కానీ ఈపూట ఎందుకో కాస్త దాని మనసు మారినట్లుంది. వాతావరణం కాస్త చల్లగా ఉంది. కాలానికి తనను తాను మార్చుకునే వెసులుబాటు ఉన్నట్లే, ప్రకృతికి తనను తాను మార్చుకునే పరిస్థితి ఉన్నట్లే... వ్యక్తులకు కూడా ఉంటుందా? అందులోనూ సామాన్యులకు కూడా ఉంటుందా?! ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవడానికి ఈ ‘పోశాలు’ ఉదాహరణ. అతను మనసు మార్చుకున్నాడు కాబట్టే, ఈరోజు ఇఎస్‌ఐ(హైదరాబాద్) హాస్పిటల్ దగ్గర చెత్త ఏరుతూ, ఆ చెత్తను తన చేతిలో ఉన్న పెద్ద సంచిలో నింపుకుంటున్నాడు. మనకది ‘చెత్త పని’ కావచ్చు. అతనికది బంగారంలాంటి పని. విసిరేయబడ్డ ఖాళీ బాటిల్, తెగి చెప్పు... కాదేదీ అతనికి అనర్హం.
అవునవును ‘లాభం’ ఆమోఘం. లాభం అంటే వేలు కాకపోవచ్చు. లక్షలు కాకపోవచ్చు. తనకు ఆ పూట తృప్తిగా తినడానికి అవసరమైన ఆదాయం మాత్రమే. అదే తన ఆదాయం. జీవితానందం. నలభై ఏళ్లు కూడా నిండని పోశాలును పలకరిస్తే, ఆ బక్కపలచటి వ్యక్తి మాటల్లో ఎన్నో ‘యుద్ధాలు’ కనిపిస్తాయి. అవి తనతో తాను చేసుకున్న యుద్ధాలు. పరిస్థితులతో చేసిన యుద్ధాలు. అక్కడెక్కడో కరీంనగర్ దగ్గర వీణవంక నుంచి ఈ మహానగరానికి ఎందుకొచ్చాడు? చెత్త ఏరే పనిని ఎందుకు ఎంచుకున్నాడు? అతని మాటల్లోనే విందాం...
‘‘మేము పురాగ ఉన్నోళ్లం కాదు. లేనోళ్లం కాదు. ఎంతో కొంత ఎవుసాయం ఉండే. దీంతోని పాటు ఆ పని ఈ పని చేసి నాయిన కుటుంబాన్ని ఎళ్లదీసేటోడు. నాకు ఇద్దరు అక్కలు. నేనే చిన్నోడిని. నన్ను బాగా గావురం చేసేటోళ్లు. నాయిన అప్పుసప్పు జేసి పెద్ద అక్క పెళ్లి చేసిండు. పెళ్లి జరిగి సంవత్సరం గూడ కాలేదు...నాయిన గుండెపోటుతో చనిపోయిండు. అటు చూస్తేనేమో...పెద్దక్క పెళ్లికి చేసిన అప్పు. ఉన్న పొలం అప్పులల్ల పోయింది.
రోడ్డు మీద పడ్డం. నేను చదువు బందు జేసి కూలినాలి పనులు చేసేది. అమ్మ కూడా కూలి పనులు చేసేది.చెడు సావాసాల వల్ల... నాకు తాగుడు అలవాటైంది. బువ్వ లేకుండనైన ఉండెటోన్నిగని... తాగుడు లేకుండా ఉండేటోన్ని కాదు. దీంతో అమ్మ చిన్నక్కను దీసుకొని పెద్దక్క దగ్గరకు పోయింది. కొన్ని రోజుల తరువాత నాకు ఊళ్ల ఉండబుద్ది గాలే. హైద్రబాద్‌కు వచ్చిన. ఒకటే ఆకలి! చేతిలనేమో ఒక్క పైస లేదు. ఒకరోజు తిక్కలేసి బండి(రైలుబండి) కింద తలకాయబెట్టి సచ్చిపోదామనుకున్న.
ధైర్యం చాల్లే. తాగితే ధైర్యం వస్తది. కాని డబ్బులెక్కడియి?
ఆరోజు పొద్దున్నే ఒకటి చూసిన. ఒకాయన మూడు గిర్రల సైకిల్ బండి మీద పోతున్నడు. రెండు కాళ్లు చచ్చుబడ్డయి. చేత్తొని సైకిల్ నడుపుకుంట పోతున్నడు. ఎనక కూరగాయల గంప ఉన్నది. ఆయినను చూసినంక నా మనసు మారింది. రెండు కాళ్లు లేనోడు బతుకుతున్నడు. కుటుంబాన్ని కూరగాయలమ్మి సాదుతున్నడు. మరి నేనెందుకు ఇట్ల ఆలోచిస్తున్న? సచ్చి సాదించేదేమున్నది? చిన్న పనో పెద్ద పనో చేసి బతకాలనుకున్న. నా ముందు చెత్త కుప్ప కనిపించింది. ఒక సంచి చూసుకొని అందులో పనికొచ్చేవాటిని ఏసుకున్న. సంచి భుజాన ఏసుకొని ఎక్కడెక్కడ్నో తిరిగిన. జమ చేసిన చెత్తను అమ్మితే వంద రూపాయల దాక వచ్చింది. ఆరోజు కడుపునిండ తిన్న. తాగుడు బందు జేసిన. కష్టపడి సంపాదించి కొత్తగా బదుకుదామనుకుంటాన.