సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత? | Why monday is important? | Sakshi
Sakshi News home page

సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత?

Published Sun, Nov 18 2018 1:16 AM | Last Updated on Sun, Nov 18 2018 1:16 AM

Why monday is important? - Sakshi

కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యత ఎందుకంటే, సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది.

సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం.

వనసమారాధన కార్తీకమాసంలోనే ఎందుకు?
గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో పాల్గొంటారు. తక్కిన ఏ మాసమూ కూడా వనభోజనాలకు అనుకూలం కాదు. వసంత రుతువు కొంత అనుకూలమే అయినా, వడగాలులు, ఉక్కపోతా ఉంటాయి కాబట్టి అంత బాగుండదు. ఇక గ్రీష్మరుతువులో ఎండలు మెండు. ఆ తర్వాత వర్ష రుతువులో ఎప్పుడు వాన వస్తుందో తెలియని ఇబ్బంది...తర్వాత వచ్చే శరదృతువులో అందులోనూ కార్తీక మాసంలో చలి మెల మెల్లగా పాకుతూ నెల చివరికి బాగా చలిగా ఉండేలా మారుతుంది కాబట్టీ, సాయంత్రం అయ్యేసరికి చిరుచలిగాలులు వీచి ఈ రోజుకి వనభోజనాలు ముగిసాయని ఆ నాటికి కాలమే హెచ్చరిక చేస్తూంటుంది కాబట్టీ, చిరుచలీ దానితోపాటు వేడిమీ పగలంతా ఉపవాసం కాబట్టీ ఈ చలి వేడిముల వాతావరణంలో భోజనాలు – అదీ సామూహికంగా – ఎంత బాగుంటాయి.

తలచుకున్నప్పుడల్లా సంతోష పరిమళాలని వెదజల్లుతూ ఉంటాయి. ఇక తర్వాత వచ్చే హేమంత రుతువులో మంచు ఎక్కువగా కురుస్తుంది. ఆ తర్వాత శిశిర రుతువులో చెట్లన్నీ బోడిగా ఉంటాయి. నీడ అనేది దొరకని కాలం కాబట్టి అనేక అనుకూలతలు ఉన్న కార్తీకమాసంలోనే  వన భోజనాలు జరుగుతాయి. ఒట్టిగా తిని పోవడానికి మాత్రమే కాకుండా, భగవంతుని పేరిట అభిషేకాన్ని చేసుకుని – లేదా – ఓ వ్రతాన్ని చేసుకుని, అన్నాన్ని భగవత్ప్రసాదంలా స్వీకరించగలిగే అవకాశముండేది ఈ మాసంలో మాత్రమే.వనసమారాధనలో ఉసిరి చెట్టునీడన సాలగ్రామరూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది అన్నసమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని, సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారనీ కార్తీక పురాణం బోధిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement