నాగుల చవిత విశిష్టత..! ఈ ఆచారం ఎలా వచ్చిందంటే.. | Nagula Chavithi 2024: This Festival Dedicated To Worship Snake Gods | Sakshi
Sakshi News home page

నాగుల చవిత విశిష్టత..! ఈ ఆచారం ఎలా వచ్చిందంటే..

Published Tue, Nov 5 2024 10:16 AM | Last Updated on Tue, Nov 5 2024 10:45 AM

Nagula Chavithi 2024: This Festival Dedicated To Worship Snake Gods

ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. 

మనం కూడా పాములమే..
హిందువులు పాములను దేవతలుగా భావించి పుజిస్తారు. శివుడి మెడలో కంఠాభరణం గా, శ్రీ మహా విష్ణువు శయనించే శేష తల్పం నాగులుగా మన పురాణాలు పేర్కొన్నాయి. సనాతన ధర్మంలో ప్రతి జీవిలో దైవం చూడమని పేర్కొంది. అలా ప్రకృతిలో భాగమైన చెట్లు, పక్షులను మాత్రమే కాదు ఆవు నుంచి నాగ పాము వరకూ అనేక రకాల జంతుజాలాలను పుజిస్తారు. అలాంటి పండగలలో ఒకటి నాగుల చవితి.  

జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు.. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంత ప్రజలు ఈ నాగుల చవితి పండగను ఘనంగా జరుపుకుంటారు. నాగుల చవితిని శాస్త్రం ప్రకారం చవితి రోజునే జరుపుకోవాలని. ఈ రోజు(నవండర్‌ 5 ) చవితి తిధి సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమ సమయం వరకూ ఉంటుంది కనుక.. ఈ రోజున నాగుల చవితి వేడుక జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.

నాగుల విశిష్టత..
కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. 

నాగుల ప్రాణాలను రక్షించిన ఆస్తికుడు
పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు! పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. 

రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుడుని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు. యుగాలనాటిది. 

(చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?)
 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement