
కారులో నాలుగు సీట్లుంటాయి.అమ్మా నాన్న ఇద్దరు పిల్లలకు సరిపోయేలా. సంసారం కారు కూడా అలాగే తయారైంది. ప్రయాణంలో పెద్దలు అడ్డమవుతున్నారు.బంధుత్వాలకి స్పీడ్‌బ్రేకర్లు పడుతున్నాయి.కలిసి చేసే ప్రయాణంలో ఇన్ని కుదుపులున్నప్పుడువిడి ప్రయాణం చేసి కలిసుండమంటున్నారు సైకియాట్రిస్టులు.
కార్లను బేన్ చేయాలి అని ఒక నిమిషం అనిపించింది విశ్వానికి.ఆ గేటెడ్ కమ్యూనిటీలో తమ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న తన కారును చూస్తే కోపం కూడా వచ్చింది అతనికి.గొడవ కారు వల్లనా? లేక నాలుగు సీట్లకు మించి ఎదగని మనుషుల వల్లనా?ఎం.టెక్ చేశాక పెళ్లి చేసుకున్నాడు విశ్వం. జంషెడ్‌పూర్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. భార్యను తీసుకుని అక్కడికి వెళ్లిపోయాడు. వెళ్లాక కారు కొన్నాడు. కారు నడపడం అతడికి సరదాగా ఉండేది. కొత్త భార్య పక్కన కూచుని ఉంటే నడపడం ఇంకా బాగుండేది.సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చే సమయానికి భార్య రెడీగా ఉండేది. కారు తీసుకొని షికారుకు వెళ్లేవారు. సడన్‌గా ఆమె సినిమా ప్రోగ్రామ్ అంటే కారులోనే రయ్యిమని వెళ్లిపోయేవారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వారి కోసం వెనుక రెండు సీట్లు సిద్ధంగా ఉన్నాయి. పిల్లలు వెనుక తల్లిదండ్రులు ముందు కూచుని డిక్కీలో రెండు మూడు రోజులకు సరిపడా బట్టలు పడేసుకొని ఒక్కోసారి హాలిడీ ట్రిప్‌కు వెళ్లిపోయేవారు.
ఊరుగాని ఊరు... భాషకాని భాష.పెద్దగా ఫ్రెండ్స్ లేరు. కనుక బర్త్‌డే పార్టీ అయినా పండుగ వచ్చినా సెలవుదినమైనా నలుగురూ ఎంజాయ్ చేయడమే వారికి అలవాటైపోయింది.పదహారేళ్లు గడిచిపోయాయి.ఎంతకాలం ఇలా పరాయి ప్రాంతంలో? హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉందాం అనుకున్నాడు విశ్వం. భార్య రాధ కూడా సరేనంది. పిల్లలిద్దరు ఒకరు ఎనిమిదిలోకి మరొకరు ఇంటర్‌లోకి వచ్చే సమయం కావడంతో ఇదే అదను అని కూడా అనుకున్నారు.‘విడిగా ఉండటం ఎందుకు? మా అమ్మా నాన్నతో ఉందాం. పెద్ద ఇల్లు కదా. ఏం ఇబ్బంది?’ అన్నాడు విశ్వం.‘అదే బెటర్. పెద్దవాళ్ల తోడు కూడా ఉన్నట్టుంటుంది’ అని రాధ.వాళ్లు హైదరాబాద్ వచ్చేశారు.మరో సంవత్సరానికి రాధ, విశ్వం మానసిక ప్రశాంతత కోల్పోయి, ఒకరిమీద ఒకరికి ప్రేమ చచ్చిపోయి, తీవ్ర అశాంతిలో ఉండగా సైకియాట్రిస్ట్ దగ్గరకు కౌన్సెలింగ్‌కు వచ్చారు.
‘ఏమిటి సమస్య?’ అని అడిగింది లేడీ సైకియాట్రిస్ట్.‘ఇద్దరం చాలా తగువులాడుకుంటున్నాం. జీవితం నరకంగా ఉంది’ అన్నాడు విశ్వం.‘ఆయన ముఖం చూస్తేనే కోపం వస్తోంది’ అంది రాధ.అన్నివిధాలా పరిణితి ఉన్న ఈ జంటకు ఏం సమస్య వచ్చిందా అని సైకియాట్రిస్ట్ ఆలోచించింది.అత్తామామలతో కలిసి ఉండటం మొదలెట్టాక రాధకు అనిపించిన మొదటి విషయం ఇకమీదట పిల్లల్ని ఇంట్లో వదిలి భర్తతో షికారుకు వెళ్లొచ్చు. డిన్నర్‌కు వెళ్లొచ్చు. సినిమాకు వెళ్లొచ్చు అని. పెళ్లయిన వెంటనే కాన్పు జరగడం పరాయి ప్రాంతంలో ఉండటం వల్ల మరోమనిషి తోడు లేకపోవడం వల్ల పిల్లల అన్నిపనులూ తనే చేయాల్సి రావడం ఎప్పుడూ పిల్లలు తోడుగా ఉండటం... వీటన్నింటి వల్ల భర్తతో గడిపే సమయం వచ్చింది అని రాధ అనుకుంది.రాధ అత్తమామలు ఏమో కొడుకు కోడలు రావడంతోనే అమ్మయ్యా ఇక అందరం కలిసి ఉండొచ్చు, కలిసి తిరగొచ్చు... ఇన్నాళ్లు కొడుకు కోడలు మనమలతో జీవితం చూడలేదు.
ఇక ఒక్క క్షణం కూడా వీళ్లను వదిలేది లేదు అనుకున్నారు.రాధ, విశ్వంలు హైదరాబాద్ వచ్చినా వారి ధోరణి జంషడ్‌పూర్ ధోరణిగానే ఉంది. తమ పాటికి తాము ఫోన్ మాట్లాడుకుని, సడన్‌గా ఈవెనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం, ఒక్కోసారి ఇద్దరే వెళ్లడం, ఒక్కోసారి నలుగురే వెళ్లడం కొనసాగించారు. నిజానికి ఉన్న కారులో నలుగురే వెళ్లగలరు. నాలుగు సీట్లే ఉంటాయి. తమ సంగతి ఏమిటి అని అత్తామామలకు రంధి మొదలయ్యింది.‘వాళ్లు అక్కడున్నా అంతే. ఇక్కడున్నా అంతేనా?’ అని అత్తగారు మామగారి దగ్గర బాధ పడింది.‘ఇంట్లో పెద్దవాళ్లకు ఒక మాటచెప్తే ఏం పోతుంది?’ అని మామగారు మనసులో అనుకున్నారు.కాని మనసులో ఉన్నవి మనసులోనే ఉండవు. చేష్టలలో బయటపడతాయి. అత్తామామల నిరసన మెల్లగా రాధను తాకడం మొదలైంది.‘ఇదేమిటండీ... మీ అమ్మానాన్నలు మనల్ని చూసి ఏడుస్తున్నారు.
కాళ్లు చేతులు గట్టిగా ఉన్నవాళ్లేగా. తిరగాలంటే వాళ్లూ తిరగొచ్చు. ఒక్క కారులో అందరం ఎలా తిరుగుతాం. వాళ్లకూ ఒక కారు ఉందిగా. డ్రైవర్‌ను పెట్టుకొని తిరగమనండి’ అంది రాధ ఒకరోజు విశ్వంతో.‘వాళ్లకు మనం తప్పితే ఎవరున్నారు. మనం ఎలాగోలా వాళ్లను కూడా కలుపుకొని పోవాలి’ అన్నాడు విశ్వం.కాజువల్‌గా అన్న మాటే. గతంలో అలా అతని ప్రాధాన్యంలో మరో మనిషి లేడు. ఇప్పుడు అతని ప్రాధాన్యంలో తల్లిదండ్రులు ఉన్నారని రాధకు అర్థం కావడంతోటే విశ్వం ‘కూరగాయలు తేనా’ అన్నా ‘గొంతుకోయనా’ అన్నట్టు రాధకు వినిపించడం మొదలయ్యింది.ఇంట్లో నాలుగు స్తంభాలాటగా ఉంది.నాలుగు స్తంభాలున్నప్పుడే అది ఇల్లవుతుందిగానీ ఏ స్తంభం ఎంతదూరంలో ఉండాలన్నదే పేచీగా మారింది.
నవ్వుకుంటూ స్నేహంగా ఉండే ఆ మనుషులు చిరాగ్గా మారిపోయారు. పిల్లలకు కూడా ఇదంతా విసుగ్గా అనిపిస్తోంది. దీనికంతటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని కౌన్సెలింగ్‌కు వచ్చారు.‘చూడండి... ఇందులో నేను చేయగలిందేమీ లేదు. మీ అమ్మా నాన్నలూ మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది’ అంది సైకియాట్రిస్ట్ విశ్వంతో.ఇది తెలిసిన విశ్వం తండ్రి ‘ఎందుకురా... సైకియాట్రిస్ట్ సమక్షంలోనే మాట్లాడుకుందాం’ అని ఆ వయసులో భార్యను వెంటబెట్టుకుని వచ్చాడు.ఆయనే సైకియాట్రిస్ట్‌తో అన్నాడు–‘చూడమ్మా... మేం ఒక విధంగా ఆలోచిస్తే వీరు ఒకవిధంగా రియాక్ట్ అయ్యారు.
ప్రేమలూ బంధాలు ఆప్యాయతలు మరీ ఎక్కువైనా కష్టమే. అందరం తమదైన జీవితాన్ని జీవించే పద్ధతికి అలవాటయ్యామని నాకు అర్థమైంది. వీళ్ల గొడవ చూసి నేను కూడా ఆలోచించాను. ఆ గేటెడ్ కమ్యూనిటీలోనే మా వీధిలోనే వీళ్లు ఇంకొక ఇల్లు తీసుకుంటే సరిపోతుంది. మాతోనే ఉన్నట్టుంటుంది. విడిగానూ ఉన్నట్టుంటుంది. సాయంత్రాలు కలవొచ్చు. ఆదివారాలు కలవొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవొచ్చు. అంతేకాదు... ఒకరికొకరం కంటపడకుండా కొన్ని గంటలు ఉండొచ్చు. దూరం కూడా ప్రేమకు ఆధారం అనిపిస్తోంది. వీళ్లు మాతోనే ఉండాలని మాకు నియమం లేదు. కాని మా కళ్ల ముందు ఉండాలనైతే ఉంది’ అన్నాడాయన.
ఆరు నెలలు గడిచాయి.రెండు కుటుంబాలు ఇప్పుడు ఆ చేదును మర్చిపోయాయి. అత్తగారు మామగారు ఇన్‌స్టెంట్ డ్రైవర్‌కు కాల్‌చేసి కావాల్సిన సమయాల్లో బయటకు వెళుతున్నారు. మనవల్ని కూడా తీసుకెళుతున్నారు. విశ్వం, రాధ ఒక్కోసారి పిల్లల్ని ఇంట్లో ఉంచి అత్తా మామలతో గుళ్లకు గోపురాలకు వెళ్లివస్తున్నారు. రెండు వంటగదులే అయినా వండినవి ఇరువురికీ అందుతున్నాయి.ఇది కూడా బాగున్నట్టే ఉంది.బంధాలు తెగిపోకుండా చేసుకునే ఏ అమరికైనా స్వాగతించాల్సిందే కదా
.– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment