దీపం పెడదాం వస్తారా...?
మళ్ళీ పండగొచ్చింది. అదే.. జనవరి ఒకటి. క్యాలెండర్ మారింది. పార్టీ ఫ్యాషన్స్ మారాయి. ఈ ఏడు అర్ధరాత్రి పార్టీల రూల్స్ మారాయి. అన్నీ మారినా.... మారనిది కొంతమంది జీవితాలు.
ఇటీవల సరూర్‌నగర్‌లోని ఓ మురికివాడకి వెళ్ళాను. వృత్తిపరంగా విలేకరిని, ఆర్.జె.ని కావడం వల్ల ఆ బస్తీ వాసులతో కొంతసేపు గడిపి, వాళ్ళ సంగతులను రేడియోలో వినిపిద్దామని వెళ్ళాను. సాయంత్రం ఐదున్నర కావొస్తోంది. బండి దిగి యధేచ్చగా పారుతున్న చిన్న చిన్న మురికి కాలవలని దాటుకుంటూ బస్తీలోకి అడుగుపెట్టాను. పది అడుగులు వేయగానే పాకలు మొదలయ్యాయి. అవి వాళ్ళ ఇళ్ళట! ఇది గతంలో ఎప్పుడూ మురికివాడలని చూడని అమాయకత్వం కాదు సుమా! మరోసారి మనతో కలిసి జనజీవన స్రవంతిలో నివసిస్తున్న వారిని గమనించిన నిట్టూర్పు! రెండు మూడు ఇలాంటి ‘ఇళ్ళు’ దాటాక, అక్కడే కాలువల సరసన ఓ ముప్ఫైమంది చిన్నారులు అమాయకపు చిరునవ్వుతో స్వాగతం చెప్పారు. ఒంటరి కరెంటుతీగకి వేలాడుతున్న బల్బు వెలుతురులో పుస్తకాల్లో మొహాలని దూర్చి చదువుకుంటున్నారు.
చీకటి పడింది కనుక దోమల స్వైరవిహారం మొదలైంది. ఓడోమాస్లూ, గుడ్నైట్లూ లేవు. నేను తప్ప అందరూ దోమలతో దోస్తీ చేసినట్టున్నారు. కాబట్టి ఎవరికీ ఇబ్బంది కాలేదు. అక్కడే వారికి పాఠాలు నేర్పుతూ ఇంకొంచెం పెద్దపిల్లలు, వాలంటీర్లు కలిసారు. ఈ పెద్ద పిల్లలు అదే వాడలో పెరిగి ఇంటర్ వరకూ ఎలాగోలా నెట్టుకొచ్చారు. వారి వంతు కృషిగా చిన్నపిల్లలకి పాఠాలు చెప్తుంటే, ఈ వాలంటీర్లు నడిపే స్వచ్ఛంద సంస్థ- ‘‘అక్షయ విద్య’’ద్వారా వారి ఇంటర్ ఫీజులు భర్తీ అవుతున్నాయి. ఈ వాలంటీర్లేమో రోజంతా ఉద్యోగాలు చేసి సాయంత్రాలు అక్కడి పిల్లతో గడుపుతారు. సంవత్సరంలో ఒక్కరోజు కూడా మిస్‌కారు.
‘‘పక్క క్లాసుకి వెళ్దామా’’ అని మధు అనే వాలంటీర్ అన్నది. అతుక్కున్న రెండు గుడిసెల మధ్య నుండి కట్టెపుల్లలు వీపుకి గీస్కుంటూ ఆ క్లాసుకి వెళ్తుండగా ఎన్నో జీవరాసులు దర్శనమిచ్చాయి. బల్లులు, తేళ్ళు ఇంకా ఏవేవో! ‘‘ఇక్కడా వాళ్ళు రోజు నిద్రపోతున్నది’’ అని అడిగాను. ‘‘ఇది చాలా మేలు. కొన్ని మురికివాడల్లో అయితే దుర్గంధం మధ్యలో వాళ్ళు ఆడతారు, తింటారు, ఉంటారు. మనం రెండు నిమిషాలు కూడా నిలబడలేని పరిసరాల్లో వారి జీవితాలే గడిచిపోతాయి’’ అని వాస్తవాన్ని వివరించింది - మధు. కూర్చున్న చోటి నుండి లేచి రెండడుగులు వేస్తే - మరికొన్ని ఇళ్ళు.
ఈ పిల్లలకి అమ్మానాన్నలు నామ్‌కేవాస్తే ఉన్నారు. కానీ చాలా వరకూ అమ్మ పనికి వెళ్ళిపోతుంది. నాన్న సాయంత్రాలు తాగొస్తాడు. మరి బడి తరువాత వాళ్ళేం చేయాలి? సాయంత్రాలు దిక్కు తోచకుండా, దిక్కులేకుండా గడిచిపోతున్నాయి. నాన్నొకవేళ ముందే ఇంటికొస్తే - పిల్లలకి తాగుడు అలవాటు చేస్తాడు. అలా కాకపోతే, వీధిలో పెద్ద పిల్లల పక్కన చేరి చిన్నపిల్లలు బూతులు నేర్చుకుంటారు. అవసరం కొద్దీ దొంగతనాలు మొదలుపెడతారు. ఆడపిల్లలు పన్నెండేళ్ళకే ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు లోనవుతారు. ఇది - వారి ఫ్యామిలీ! ఇది వారి స్టోరీ.
ఇక్కడ హైదరాబాదులోనే ఇటువంటి మురికివాడలు 1400 ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఏంటి? మన హైటెక్ స్మార్ట్‌సిటీ గురించే చెబుతున్నాను.
ఇంతకీ నేను వెళ్ళిన పని - అక్కడ పిల్లలకి సోలార్ దీపాలు పంచిపెట్టడానికి. చీకటి పడ్డాక అమ్మ లేటుగా వచ్చి, నాన్న రాలేని పరిస్థితిలో ఉంటే - కనీసం ఈ దీపం మాటున, కళ్ళనిండా వాళ్ళ స్వప్న లోకాన్ని చూస్కుంటూ - ఓ పుస్తకం పట్టుకుని వాళ్ళ సాయంత్రం గడిచిపోతుందన్న చిన్న ఆశ.
మనసు పీకుతోంది. మళ్ళీ వెళ్ళాలని - ఆ బంగారు తల్లులు, తండ్రులతో పండగవేళ గడపాలని. మీరూ వస్తారా?