వింటర్‌లో పెరిగే కీళ్లనొప్పులు? | Winter growing arthritis? | Sakshi
Sakshi News home page

వింటర్‌లో పెరిగే కీళ్లనొప్పులు?

Published Wed, Oct 26 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

Winter growing arthritis?

అర్థోపెడిక్ కౌన్సెలింగ్

 

చలికాలంలో కీళ్లనొప్పులు మరీ పెరిగినట్లుగా అనిపిస్తోంది. నిజంగానే ఎక్కువవుతాయా?  - రామకృష్ణ, హైదరాబాద్
ఈ సీజన్‌లో పెద్దవయసు వారిలో మామూలు కీళ్లనొప్పులు (జాయింట్ పెయిన్స్) పెరగడమే కాదు... అవి గౌట్, ఆర్థరైటిస్ నొప్పులను మరింతగా పెంచుతాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎండాకాలంలోలా ఈ వింటర్ సీజన్‌లో సూర్యరశ్మి ఎక్కువగా తగిలే అవకాశం ఉండదు. దాంతో ఆటోమేటిగ్గా ఎముకలకు కావాల్సిన విటమిన్-డి కూడా తగ్గడం లాంటి అనేక కారణాలతో నొప్పి పెరుగుతుంది.


అలా ఎందుకంటే...
చలికాలంలో బయటి వాతావరణ ప్రభావం వల్ల ఉపరితల భాగాలకు ప్రసరించే  రక్తం చలి కారణంగా తన వేడిని కోల్పోతుంది. పైగా చలి కారణంగా అక్కడి రక్తనాళాలు కాస్త కుంచించుకుపోవడంతో కాళ్లూ చేతుల వంటి భాగాలకు, చర్మంపైన ఉండే నాడీకణాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. నరాల చివర్లు (నర్వ్ ఎడింగ్స్) చిన్న విషయానికి అతిగా స్పందించేలా (సెన్సిటివ్‌గా) తయారవుతాయి. అందుకే ఈ సీజన్‌లో ఏదైనా భాగంలో నొప్పి, వాపు, మంట (ఇన్‌ఫ్లమేషన్) వచ్చినా లేదా ఆర్థరైటిస్ వంటి జబ్బుల్లో వచ్చే నొప్పులైనా.. తగ్గడానికి టైమ్ పడుతుంది. 

     
ఈ సీజన్‌లో బయటి ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉండటం వల్ల మన చర్మం కూడా బాగా చల్లగా అయిపోతుంది. సాధారణంగా మన చర్మం సహజంగా ఉండాల్సిన 98.4  డిగ్రీల ఫారన్‌హీట్ నుంచి ఒక్కోసారిగా 70 ప్లస్ లేదా 80 ప్లస్ డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పడిపోతుంది. ఇలా ఉష్ణోగ్రత పడిపోవడంతో చర్మంలోని నొప్పిని గ్రహించే భాగాలు (పెయిన్ సెన్సర్స్) మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది.

     
ఈ సీజన్‌లో సహజంగానే చలికి కీళ్లు బిగుసుకుపోతుంటాయి. దాంతో వాటిలో కదలికలు తగ్గుతాయి. కదలికలు తగ్గిన కీళ్లలో వ్యాయామం మందగించిన కారణాన వాటికి పోషకాలు సరిగా అందవు. ఇది కూడా నొప్పులు పెరగడానికి ఒక కారణమే. చాలామందిలో చలికాలంలో నొప్పిని భరించే శక్తి (పెయిన్ టాలరెన్స్) తగ్గుతుంది. అందుకే ఎప్పుడూ ఉండే మామూలు నొప్పులు సైతం ఈ కాలంలో మరింత పెరిగినట్లు అనిపిస్తాయి.

 
నొప్పులను తగ్గించుకోవడం ఎలా?
ఈ సీజన్‌లో నొప్పి అనేది వస్తే దాన్ని పూర్తిగా నివారించలేకపోయినా తగ్గించుకోడానికి  కొన్ని ఉపశమన మార్గాలున్నాయి. అవి...  బయట చలిగా ఉన్నప్పుడు శరీరానికి తగినంత ఉష్ణోగ్రత ఇచ్చే దుస్తులను  ధరించాలి. చేతులకు గ్లొవ్స్ వేసుకోవడం, కాళ్లకు సాక్స్ వేసుకోవడం మంచిది. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు మోకాళ్లు, మోచేతుల వద్ద మరింత మందంగా ఉండే దుస్తులు వేసుకోవడం శ్రేయస్కరం. ఈ సీజన్‌లో ఆరుబయట కాకుండా వీలైతే ఇన్‌డోర్ వ్యాయామాలు చేయండి. చలికాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామాలు, తగినంత శారీరక శ్రమ మంచి మార్గం. మన కీళ్లలో ఎప్పుడూ కదలికలు ఉండేలా చేసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్య నిర్వహణ మెరుగ్గా ఉంటుంది.

     
ఈ సీజన్‌లో వ్యాయామాలు తప్పనిసరి. వ్యాయామం సమయంలో మనం ఆహ్లాదంగా ఉండటానికి దోహదపడేదీ, మన ఒత్తిడిని గణనీయంగా తగ్గించేది అయిన  ఎండార్ఫిన్ అనే స్రావం శరీరంలోకి విడుదల అవుతుంది. ‘ఎండార్ఫిన్’లో నొప్పిని తగ్గించే గుణం చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్‌లో వ్యాయామం తప్పనిసరి. పైగా వ్యాయామం కారణంగా ఈ సీజన్‌లో సహజంగా మందగించే రక్త రసఫరా బాగా మెరుగతుంది. దాంతో ఒంటిపైన ఉండే నొప్పి సెన్సర్స్ కూడా మామూలుగా పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గుతుంది.

 
నొప్పులు తగ్గడానికి చేయాల్సిన పనులు
...
శరీరానికి శ్రమ కలిగించకుండానే తేలికపాటి కదలికలతో మనకు మంచి వ్యాయామం కలిగించే యాక్టివిటీస్ ఈ కింద ఉన్నాయి. మీకు వీలైనవాటిని ఎంచుకోండి. ఇండోర్స్‌లో ఎక్కువగా నడవడం. ఇందుకు తేలిక మార్గం ఏమిటంటే ఏదైనా షాపింగ్ మాల్‌ను ఎంచుకొని లోపల చాలాసేపు తిరగడం. అన్ని వస్తువులను పరిశీలిస్తూ అక్కడ వీలైనంత ఎక్కువగా నడుస్తుండండి.  ఇంట్లో పనులు చేయడం... అంటే ఇల్లు శుభ్రం చేయడం, వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం వంటివి.  పిల్లలతో ఆడటం... ఇందులో కూర్చుని ఆడే ఆటలను మినహాయించాలి.  ఇన్‌డోర్ స్విమ్మింగ్ ఇంట్లోనే తేలికపాటి మ్యూజిక్‌కు డాన్స్ చేయడం  ఆఫీసులో లేదా మీరు వెళ్లిన చోట లిఫ్ట్‌కు బదులు మెట్లనే ఉపయోగించడం.  టీవీ చూస్తున్నప్పుడు కూర్చునే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం.

 
నొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని సూచనలివి...

ఈ సీజన్‌లో వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. చాలామంది చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతారు. ఒంటిని వెచ్చబరచుకోడానికి దోహదం కాఫీ, టీ వంటివి ఎక్కువగా తాగేస్తారు. పైగా దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీరు బయటకు వెళ్తుంది. ఈ అన్ని కారణాలతో శరీరంలో నీళ్లు,  లవణాల పాళ్లు తగ్గుతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి.  మోకాళ్లపై ఎలాంటి భారం పడకుండానే మంచి వ్యాయామాన్ని చేకూర్చే ఈదడం వంటి ప్రక్రియలు ఈ సీజన్‌లో చాలా మంచిది.

 

 

డాక్టర్ కె.సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,  ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement