Vitamin-d
-
వర్షాకాలంలో విటమిన్-డి తీసుకోవడం ఎలా? సప్లిమెంట్స్ తీసుకోవచ్చా?
మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో విటమిన్-డి ఒకటి. దీన్ని ‘సన్‌షైన్’ విటమిన్ అని కూడా పిలుస్తారు. శరీరీనాకి కాల్షియం అందించడంలో విటమిన్-డి ఎంతో ముఖ్యమైనది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి సరైన మోతాదులో విటమిన్-డి లభించకపోతే ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. సప్లిమెంట్స్ కంటే సూర్యకాంతిలో విటమిన్-డి సమృద్దిగా దొరుకుతుంది. మరి ఈ వర్షాకాలంలో విటమిన్-డిని ఏ విధంగా తీసుకోవాలి? ఈ స్టోరీలో చూసేద్దాం. ►భారతీయుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సర్వేలో దాదాపు 76 శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా 25ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఎక్కువగా విటమిన్-డి లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. విటమిన్-డి పొందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రతిరోజూ గుడ్డు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసోనలో విటమిన్-డి ఉంటుంది. పాలలో విటమిన్-డితో పాటు పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ పాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి పుట్టగొడుగులు తినడం వల్ల విటమిన్-డి లోపాన్ని అధిగమించవచ్చు. ప్రతిరోజూ ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి నారింజలో విటమిన్-సితో పాటు విటమని్-డి కూడా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆకుకూరలు, సోయా పాలు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్-డి ఎంత మొత్తం తీసుకోవాలి ఆరోగ్యకరమైన ఎముకలు, కాల్షియం, మెటబాలిజం మెయింటేన్ చేయాలంటే తగిన మోతాదులో విటమిన్-డి అవసరం. పిల్లలు, యుక్తవయస్సు వాళ్ళు 600 IU లేదా 15 మైక్రోగ్రాములు తీసుకోవాలి. 70 ఏళ్లు పైబడిన వారిలో 800 ఐయూ (20 ఎంసీజీ) అవసరం. ఇక గర్భిణీలు, పాలిచ్చే మహిళలకి కూడా 600 IU లేదా 15 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరం. సప్లిమెంట్ల రూపంలో తీసుకునే వాళ్ళు వైద్యుల సిఫార్సు మేరకు వారానికి ఒకటి మాత్రమే తీసుకోవాలి. -
పెద్దవాళ్లు విటమిన్–డి తీసుకున్నా వృథానే!
మెల్బోర్న్: పెద్ద వయస్కులు విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవటం వల్ల వారిలో ఎముకల సాంద్రత మెరుగు పడే అవకాశాలు లేవని తాజా అధ్యయనంలో తేలింది. ఎముకలు విరగటాన్ని ఈ సప్లిమెంట్లు నిరోధించలేవని వెల్లడైంది. పెద్ద వయస్కుల్లో ఎముకలు పెళుసుబారకుండా ఉండేందుకు గత కొంత కాలంగా డాక్టర్లు విటమిన్–డి సప్లిమెంట్లను సిఫార్సు చేయడం తెల్సిందే. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్‌కు చెందిన పరిశోధకులు సుమారు 81 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అసలు విటమన్–డి సప్లిమెంట్ల వల్ల అనుకున్నంత ప్రయోజనంలేదని తేలింది. ఈ సప్లిమెంట్లు వల్ల పూర్తిగా, పాక్షికంగా విరిగిన ఎముకలు కేవలం 15 శాతం అతుక్కుంటున్నట్లు తేల్చారు. -
విటమిన్ –డి తో పిల్లలకు పుష్టి!
దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతన్న పిల్లలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ తగినన్ని పోషకాలు అందించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే విటమిన్ – డి ని అందిస్తే అది పిల్లలు పుష్టిగా ఎదిగేందుకు మాత్రమే కాకుండా, బరువు పెరిగేందుకు, కదలికలకు సంబంధించిన నైపుణ్యాలను వేగంగా అందుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు పంజాబ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలతో కలిసి జరిపిన అధ్యయనం ద్వారా తాము ఈ విషయాన్ని తెలుసుకోగలిగామని డాక్టర్ జవేరియా సలీమ్ తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఆరు నెలల నుంచి ఐదేళ్ల మధ్య వయస్కులపై విటమిన్ – డి ప్రభావం బాగా ఉంది. ఎనిమిది వారాలపాటు వీరిలో కొంతమందికి ఐదు మిల్లీగ్రాములు లేదా రెండు లక్షల ఐంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ – డి అందించారు. మిగిలినవారికి అధిక శక్తి గల ఆహారం, కొంతమందికి సాధారణ ఆహారం అందించారు. ఆ తరువాత పిల్లలను పరిశీలించగా ఎన్నో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. మిగిలిన వారితో పోలిస్తే వేగంగా నడవడం మొదలుకొని బరువు కూడా పెరిగారని సలీమ్ తెలిపారు. విటమిన్ – డి కేంద్ర నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందనేందుకు ఈ అధ్యయనం తొలి నిదర్శనమని, మరిన్ని పరిశోధనల ద్వారా ఈ విషయాలను నిర్ధారించుకుంటే పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చవకైన, సులువైన మార్గం దొరికినట్లేనని వివరించారు. -
వింటర్లో పెరిగే కీళ్లనొప్పులు?
అర్థోపెడిక్ కౌన్సెలింగ్ చలికాలంలో కీళ్లనొప్పులు మరీ పెరిగినట్లుగా అనిపిస్తోంది. నిజంగానే ఎక్కువవుతాయా? - రామకృష్ణ, హైదరాబాద్ ఈ సీజన్లో పెద్దవయసు వారిలో మామూలు కీళ్లనొప్పులు (జాయింట్ పెయిన్స్) పెరగడమే కాదు... అవి గౌట్, ఆర్థరైటిస్ నొప్పులను మరింతగా పెంచుతాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎండాకాలంలోలా ఈ వింటర్ సీజన్లో సూర్యరశ్మి ఎక్కువగా తగిలే అవకాశం ఉండదు. దాంతో ఆటోమేటిగ్గా ఎముకలకు కావాల్సిన విటమిన్-డి కూడా తగ్గడం లాంటి అనేక కారణాలతో నొప్పి పెరుగుతుంది. అలా ఎందుకంటే... చలికాలంలో బయటి వాతావరణ ప్రభావం వల్ల ఉపరితల భాగాలకు ప్రసరించే రక్తం చలి కారణంగా తన వేడిని కోల్పోతుంది. పైగా చలి కారణంగా అక్కడి రక్తనాళాలు కాస్త కుంచించుకుపోవడంతో కాళ్లూ చేతుల వంటి భాగాలకు, చర్మంపైన ఉండే నాడీకణాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. నరాల చివర్లు (నర్వ్ ఎడింగ్స్) చిన్న విషయానికి అతిగా స్పందించేలా (సెన్సిటివ్‌గా) తయారవుతాయి. అందుకే ఈ సీజన్లో ఏదైనా భాగంలో నొప్పి, వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) వచ్చినా లేదా ఆర్థరైటిస్ వంటి జబ్బుల్లో వచ్చే నొప్పులైనా.. తగ్గడానికి టైమ్ పడుతుంది. ఈ సీజన్లో బయటి ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉండటం వల్ల మన చర్మం కూడా బాగా చల్లగా అయిపోతుంది. సాధారణంగా మన చర్మం సహజంగా ఉండాల్సిన 98.4 డిగ్రీల ఫారన్‌హీట్ నుంచి ఒక్కోసారిగా 70 ప్లస్ లేదా 80 ప్లస్ డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పడిపోతుంది. ఇలా ఉష్ణోగ్రత పడిపోవడంతో చర్మంలోని నొప్పిని గ్రహించే భాగాలు (పెయిన్ సెన్సర్స్) మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఈ సీజన్లో సహజంగానే చలికి కీళ్లు బిగుసుకుపోతుంటాయి. దాంతో వాటిలో కదలికలు తగ్గుతాయి. కదలికలు తగ్గిన కీళ్లలో వ్యాయామం మందగించిన కారణాన వాటికి పోషకాలు సరిగా అందవు. ఇది కూడా నొప్పులు పెరగడానికి ఒక కారణమే. చాలామందిలో చలికాలంలో నొప్పిని భరించే శక్తి (పెయిన్ టాలరెన్స్) తగ్గుతుంది. అందుకే ఎప్పుడూ ఉండే మామూలు నొప్పులు సైతం ఈ కాలంలో మరింత పెరిగినట్లు అనిపిస్తాయి. నొప్పులను తగ్గించుకోవడం ఎలా? ఈ సీజన్లో నొప్పి అనేది వస్తే దాన్ని పూర్తిగా నివారించలేకపోయినా తగ్గించుకోడానికి కొన్ని ఉపశమన మార్గాలున్నాయి. అవి... బయట చలిగా ఉన్నప్పుడు శరీరానికి తగినంత ఉష్ణోగ్రత ఇచ్చే దుస్తులను ధరించాలి. చేతులకు గ్లొవ్స్ వేసుకోవడం, కాళ్లకు సాక్స్ వేసుకోవడం మంచిది. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు మోకాళ్లు, మోచేతుల వద్ద మరింత మందంగా ఉండే దుస్తులు వేసుకోవడం శ్రేయస్కరం. ఈ సీజన్లో ఆరుబయట కాకుండా వీలైతే ఇన్డోర్ వ్యాయామాలు చేయండి. చలికాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామాలు, తగినంత శారీరక శ్రమ మంచి మార్గం. మన కీళ్లలో ఎప్పుడూ కదలికలు ఉండేలా చేసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్య నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. ఈ సీజన్లో వ్యాయామాలు తప్పనిసరి. వ్యాయామం సమయంలో మనం ఆహ్లాదంగా ఉండటానికి దోహదపడేదీ, మన ఒత్తిడిని గణనీయంగా తగ్గించేది అయిన ఎండార్ఫిన్ అనే స్రావం శరీరంలోకి విడుదల అవుతుంది. ‘ఎండార్ఫిన్’లో నొప్పిని తగ్గించే గుణం చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్లో వ్యాయామం తప్పనిసరి. పైగా వ్యాయామం కారణంగా ఈ సీజన్లో సహజంగా మందగించే రక్త రసఫరా బాగా మెరుగతుంది. దాంతో ఒంటిపైన ఉండే నొప్పి సెన్సర్స్ కూడా మామూలుగా పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గుతుంది. నొప్పులు తగ్గడానికి చేయాల్సిన పనులు... శరీరానికి శ్రమ కలిగించకుండానే తేలికపాటి కదలికలతో మనకు మంచి వ్యాయామం కలిగించే యాక్టివిటీస్ ఈ కింద ఉన్నాయి. మీకు వీలైనవాటిని ఎంచుకోండి. ఇండోర్స్‌లో ఎక్కువగా నడవడం. ఇందుకు తేలిక మార్గం ఏమిటంటే ఏదైనా షాపింగ్ మాల్‌ను ఎంచుకొని లోపల చాలాసేపు తిరగడం. అన్ని వస్తువులను పరిశీలిస్తూ అక్కడ వీలైనంత ఎక్కువగా నడుస్తుండండి. ఇంట్లో పనులు చేయడం... అంటే ఇల్లు శుభ్రం చేయడం, వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం వంటివి. పిల్లలతో ఆడటం... ఇందులో కూర్చుని ఆడే ఆటలను మినహాయించాలి. ఇన్డోర్ స్విమ్మింగ్ ఇంట్లోనే తేలికపాటి మ్యూజిక్కు డాన్స్ చేయడం ఆఫీసులో లేదా మీరు వెళ్లిన చోట లిఫ్ట్‌కు బదులు మెట్లనే ఉపయోగించడం. టీవీ చూస్తున్నప్పుడు కూర్చునే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం. నొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని సూచనలివి... ఈ సీజన్లో వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. చాలామంది చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతారు. ఒంటిని వెచ్చబరచుకోడానికి దోహదం కాఫీ, టీ వంటివి ఎక్కువగా తాగేస్తారు. పైగా దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీరు బయటకు వెళ్తుంది. ఈ అన్ని కారణాలతో శరీరంలో నీళ్లు, లవణాల పాళ్లు తగ్గుతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. మోకాళ్లపై ఎలాంటి భారం పడకుండానే మంచి వ్యాయామాన్ని చేకూర్చే ఈదడం వంటి ప్రక్రియలు ఈ సీజన్లో చాలా మంచిది. డాక్టర్ కె.సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఎండ కన్నెరుగనివ్వని జబ్బు
మెడిక్షనరీ శరీరానికి కాస్తంత ఎండ పొడ సోకాలి. లేలేత సూర్యకిరణాలు సోకితేనే శరీరంలో విటమిన్-డి తయారవుతుంది. అయితే, అత్యంత అరుదుగా కొందరికి సూర్యరశ్మి ఏమాత్రం సరిపడదు. వాళ్ల చర్మానికి కొద్దిసేపు ఎండ సోకినా, ఎండ తాకిన ప్రదేశమంతా మచ్చలు, దద్దుర్లు ఏర్పడతాయి. ఒక్కోసారి అగ్నిప్రమాదానికి గురైన స్థాయిలోనే చర్మమంతా కమిలిపోయి చూడటానికే భయంకరంగా మారుతుంది. ఎండ కన్నెరుగనివ్వని ఈ జబ్బును ‘జీరోడెర్మా పిగ్మెంటోసమ్’ అంటారు. జన్యువుల్లోని డీఎన్ఏలో తలెత్తే లోపాల వల్ల చాలామందికి బాల్యంలోనే ఈ వ్యాధి వస్తుంది. ఈ జబ్బు సోకిన వారు పగటివేళ ఆరుబయట సంచరించలేరు. రాత్రివేళల్లో మాత్రమే సురక్షితంగా సంచరించగలరు. అందుకే ఈ జబ్బు సోకిన చిన్నారులను ‘చిల్డ్రన్ ఆఫ్ నైట్’ అంటారు. -
విటమిన్-డితో రక్తపోటుకు చెక్
పరిపరి... శోధన సూర్యరశ్మి నుంచి సహజసిద్ధంగా లభించే విటమిన్-డి ఎముకల పటిష్టతకు దోహదపడుతుందని తెలిసిందే. దీనితో మరో ప్రయోజనమూ ఉందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. విటమిన్-డి పుష్కలం గా తీసుకుంటే, అధిక రక్తపోటు బారినపడే ముప్పు చాలా వరకు తప్పుతుందని బ్రిటన్‌కు చెందిన క్వీన్ మార్గరెట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్-డి శరీరానికి సమృద్ధిగా లభిస్తే, మానసిక ఒత్తిడిని కలిగించే ‘కార్టిసోల్’ హార్మోన్ విడుదల తగ్గుతుందని, ఫలితంగా రక్తపోటు కూడా అదుపులోకి వస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన క్వీన్ మార్గరెట్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ రాక్వెల్ రెవ్యూల్టా ఇనీస్టా చెబుతున్నారు. విటమిన్-డి తగినంతగా తీసుకునే వారికి డయాబెటిస్, ఆర్థరైటిస్, కొన్ని రకాల కేన్సర్లు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయని ఆయన వివరిస్తున్నారు.