దోనేరు సుందరమ్మ,తుపాకుల ఆదిలక్ష్మి
నేను 10వ తరగతి పాసైన తర్వాత పెళ్లి చేసేశారు. మా నాన్న, మామయ్యలు ఊరి పెద్దలుగా ఉండి అందరి తల్లో నాలుకలా వ్యవహరించేవారు. సాధారణంగా మన్యంలో మహిళలకు ప్రాధాన్యత తక్కువ. అభివృద్ధికి దూరంగా ఉండే మా పంచాయితీకి నిధులు అరకొరగా వస్తున్నాయి. బడ్జెట్‌లో లక్షల కోట్లు ప్రకటిస్తున్నా పంచాయితీకి కేవలం వేలల్లో మాత్రమే ఉంటున్నాయి. దీంతో.. మా బొర్రా పంచాయితీ అభివృద్ధికి దూరమైపోయింది. గత ఎన్నికల సమయంలో రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసే అవకాశం వచ్చింది. మా కుటుంబాలకు రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయాల్లో ఓనమాలు కూడా రావు. పదవిని ఎలా వినియోగించుకోవాలి, ఏఏ అభివృద్ధి పనులు చేసే అవకాశముందని మా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచుల దగ్గర నేర్చుకున్నారు. నా భర్త చంద్రన్న పోలీస్ కానిస్టేబుల్ కావడంతో నా పదవి విషయంలో తలదూర్చరు. కాబట్టి నేనే అన్ని విషయాల్లోనూ అవగాహన కలిగించుకున్నాను. ఎదురైన అనుభవాల నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకుంటున్నాను. మా ఊరిలో రాజకీయాలంటే ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తున్నాను. మా పంచాయితీలో 14 గ్రామాలున్నాయి. ఒక్కో గ్రామంలో ఒక్కో స్వభావం ఉన్న మనుషులు ఉంటారు. మహిళను కదా.. అలాంటి వారి నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే ఆందోళన ఉండేది. అందుకే వారందరితోనూ కలుపుగోలుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. వారిని కూడా సలహాలు అడిగేదాన్ని. పదవిదేముంది సార్ ఐదేళ్ల తర్వాత పోతుంది. మా ప్రాంత ప్రజల దృష్టిలో మహిళా సర్పంచైనా మంచిగా చేసిందనే పేరుండిపోవాలన్నదే నా ఆశయం. మన్యం ప్రాంతంలోనూ రాజకీయాల్లో మహిళలు రాణించగలరు అని నిరూపించాలని మా కుటుంబ సభ్యులు చెప్పిన మాటలతోనే స్వశక్తిగా ఎదుగుతున్నాను.
– దోనేరు సుందరమ్మ, బొర్రా పంచాయతీ సర్పంచి, అరకు నియోజకవర్గం, విశాఖపట్నం
మొదటి ఏడాది భర్త నడిపించారు
నేను ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. మా కుటుంబంలో ఎవ్వరికీ రాజకీయ పదవుల నేపథ్యం లేదు. గ్రామంలో పలుకుబడి ఉండటంతో వచ్చిన రిజర్వేషన్ల ప్రకారం సీటు దక్కింది. సర్పంచిగా పోటీ చెయ్యమని చెప్పారు. మొదట్లో భయం వేసింది. గ్రామ పెద్దలు ధైర్యం చెప్పడంతో ముందడుగు వేశాను. సర్పంచిగా గెలిచానే కానీ.. భయం ఉండేది. అధికారులతో ఎలా మాట్లాడాలి. ఏఏ పనులు చేసే అవకాశముంటుంది. ఎలాంటి పవర్ ఉంటుది.. ఇవేమీ తెలీదు. నా భర్త కొద్దో గొప్పో రాజకీయ అనుభవం ఉంది. ఆయన ధైర్యం చెప్పారు. ముందుండి నడిపిస్తానని చెప్పారు. మొదటి సంవత్సరమంతా నేను వెనుక.. నా భర్త ముందుండేవారు. ఏ సందర్భాల్లో ఎలా మాట్లాడాలి. ఏ తరహా పనులకు ఏ శాఖ అధికారిని సంప్రదించాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా వ్యవహరించాలనేది నా భర్త నడవడికను చూసి నేర్చుకున్నారు. క్రమంగా ఆయన సహాయం తీసుకోవడం తగ్గించాను. స్వతహాగా ప్రథమ పౌరురాలిగా నడవడం నేర్చుకున్నాను. ఇప్పుడు పూర్తి స్థాయి సర్పంచిగా వ్యవహరిస్తున్నాను. ఏదీ ముందు నుంచి రాదు కదా. నేర్చుకోవాలనే తపన పెరిగింది.. కాబట్టి ఈ నాలుగేళ్ల కాలంలో ఎవ్వరి నుంచి ఎలాంటి విమర్శలూ ఎదుర్కోలేదు. మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే నాలాగే ఏమీ రాదని భయపడుతుంటారు. కానీ.. ఆ భయం నుంచే చాలా నేర్చుకోవచ్చని తెలుసుకున్నాను.
– తుపాకుల ఆదిలక్ష్మి, మజ్జివలస గ్రామ సర్పంచి, భీమిలి మండలం, విశాఖపట్నం.
Comments
Please login to add a commentAdd a comment