స్త్రీలోక సంచారం | Women empowerment:Miss India World-2018 | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Thu, Jun 21 2018 12:07 AM | Last Updated on Thu, Jun 21 2018 12:07 AM

Women empowerment:Miss India World-2018 - Sakshi

::: ముంబైలో జరిగిన మిస్‌ ఇండియా వరల్డ్‌–2018 పోటీలలో చెన్నైలో బి.ఎ. చదువుతున్న అనుకీర్తీవాస్, హర్యానా యువతి మీనాక్షీ చౌదరి (ఫస్ట్‌ రన్నర్‌ అప్‌), హైదరాబాద్‌ అమ్మాయి శ్రేయారావ్‌ కామవరపు (సెకండ్‌ రన్నర్‌ అప్‌) విజేతలుగా నిలిచారు. డిసెంబర్‌ 8న చైనాలోని సేన్యాలో జరిగే మిస్‌ వరల్డ్‌ పోటీలకు అనుకీర్తీవాస్, అంతకన్నా ముందు అక్టోబర్‌ 25న బర్మాలోని మయన్మార్‌లో జరిగే ‘మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌’ పోటీలకు మీనాక్షీ చౌదరి, సెప్టెంబరులో జరిగే అవకాశం ఉన్న ‘మిస్‌ యునైటెడ్‌ కాంటినెంట్స్‌’ పోటీలకు శ్రేయారావ్‌ కామవరపు భారతదేశం నుంచి తలపడతారు ::: బలప్రయాగంతో రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించలేమని అంటూ జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. రంజాన్‌ మాసపు కాల్పుల విరమణ గడుపు ముగిసినప్పటికీ, శాంతిభద్రతల రీత్యా దానిని పొడిగించాలని మెహబూబా కోరడంతో కేంద్ర నిరాకరించడమే కాకుండా, సంకీర్ణ ప్రభుత్వం నుండి బీజేపీ వైదొలగడతో ఆమె రాజీనామా చేయవలసి వచ్చింది :::  ఇజ్రాయెల్‌పై ఐక్యరాజ్యసమితి పక్షపాత వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ ‘సమితి హక్కుల మండలి’ నుంచి యు.ఎస్‌. ఏ క్షణమైనా వైదొలగే అకాశాలున్నాయని ఐరాసాలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రకటించారు. 

ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా ఐరాస ‘తీవ్రమైన, నిర్హేతుకమైన’ దుష్పచారం చేస్తోంది కనుక తాము ‘హక్కుల మండలి’ నుంచి తప్పుకోవడం అనివార్యం కావచ్చుననే సంకేతాలను గత ఏడాది మండలి ప్రసంగంలోనే నిక్కీ హేలీ బహిర్గతం చేశారు ::: ఫ్రాన్స్‌ పార్లమెంటు సభ్యురాలు (దిగువ సభ), ‘నేషనల్‌ ర్యాలీ’ పార్టీ అధ్యక్షురాలు మెరీన్‌ లీపెన్‌ పార్లమెంటు నిధుల నుంచి అక్రమంగా వాడుకున్న మూడు లక్షలకుపైగా యూరో డాలర్లను తిరిగి పార్లమెంటుకు జమ చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. పార్టీలోని ఇద్దరు సహాయకుల కోసం (పార్లమెంటు అసిస్టెంట్‌లు) లీపెన్‌ పార్లమెంటు నిధులను దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో వెంటనే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది ::: హెచ్‌.బి.వో. చానల్‌లో ఎనిమిదేళ్లుగా ప్రసారం అవుతున్న అమెరికన్‌ ఫాంటసీ డ్రామా టెలివిజన్‌ సీరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’కి నటి ఎమీలియా క్లార్క్‌ గుడ్‌బై చెప్పారు. ఎనిమిదో సీజన్‌తో (ఇప్పటికి ఏడు సీజన్లు అయ్యాయి) 2019లో ముగియనున్న ఈ సిరీస్‌లో మొదటి నుంచీ నటిస్తున్న ఎమీలియా.. చివరి సీజన్‌లో కూడా తను ఉన్న సన్నివేశాలను ముందే పూర్తి చేసుకుని, వదల్లేక వదల్లేక వెళ్లిపోతున్నట్లు  ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఉద్వేగభరితమైన పోస్టు పెట్టారు ::: అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుస్మితాదేవ్‌ లైంగిక అంశాలపై తన మహిళా కార్యకర్తలకు అవగాహన కల్పించడం కోసం జూన్‌ 21 నుంచి 23 వరకు గుజరాత్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. 

ఇందుకోసం ఎంపికైన 50 మంది మహిళలకు చక్కటి తర్ఫీదు ఇప్పించి భవిష్యత్తులో వివిధ రాజకీయ వేదికలపై మాట్లాడిస్తారు ::: నాలుగు నెలలుగా విధుల్లోకి రాని ఐఏఎస్‌ ఆఫీసర్‌లు జీతాలు తీసుకోడానికి ఎలా వస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీత విమర్శించడంపై ఐఏఎస్‌ ఆఫీసర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నివాసంలో ఇటీవల ధర్నా చేస్తున్న కేజ్రీవాల్‌ను కలిసేందుకు వచ్చినప్పుడు ఆమెను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ సునీత ఈ విమర్శ చేశారు ::: కారులో వెళుతూ చెత్తను వీధిలో పారేస్తున్న వ్యక్తిని తన కారులోంచి చూసి అనుష్క తిట్టడాన్ని, ఆమె తిడుతున్నప్పుడు వీడియో తీసి దానిని అనుష్క భర్త కోహ్లీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడాన్ని దియా మీర్జా సమర్థించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ఉంచేలా చేయడం మనలో ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యావరణ పరిరక్షణకు యు.ఎన్‌. గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉన్న మీర్జా అన్నారు :::

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement