వ్యవసాయం ఈ మాత్రమైనా నడుస్తున్నదంటే మహిళా రైతుల శ్రమ వల్లనే అయినప్పటికీ వారి శ్రమకు గుర్తింపు లేదని వేరే చెప్పాల్సిన పని లేదు. జయలక్ష్మి జీవితం చూస్తే చాలు, మనకు అర్థమవుతుంది. ఆమె ఊరు అతుకొట్టాయ్. తమిళనాడులోని ధర్మపురి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఆ ఊరుంది. తెల్లవారుజామున 4.30 గంటలకు నిద్ర లేస్తుంది జయలక్ష్మి. ఇంటి పనులు, పిల్లలను బడికి పంపించి, వంట పనులు పూర్తి చేసుకొని.. పొలం పనులు ప్రారంభిస్తుంది.
సూర్యుడు నెత్తి మీదకు వచ్చి ఎండ చుర్రుమనిపించే 11.30 గంటల సమయానికి ఇంటికి చేరి.. బట్టలు ఉతకటం, అంట్లు తోమటం మొదలు పెడుతుంది. పశువులకు నీళ్లు పెట్టి, గడ్డి వేస్తుంది. 3 గంటల తర్వాత మళ్లీ పొలం పనిలో నడుము వంచుతుంది. 6 గంటల కల్లా ఇల్లు చేరుకొని వంట పని, ఇతర ఇంటి పనుల్లో మునిగిపోతుంది. నడుము వాల్చేటప్పటికి రాత్రి 11 గంటలవుతుంది. ఇంత చేసినా మొగుడు ఎప్పుడేమంటాడోనన్న భయం నీడలాగా వెంటాడుతూనే ఉంటుంది.
‘పొద్దున వండిన అన్నం రాత్రి పూట పెడితే మా ఆయన పళ్లెం ఇసిరికొడతాడు.. నేనే కాదు, మా ఊళ్లో ఆడవాళ్లు ఎవరైనా అంతే. ఇంటి పనితోపాటు పొలం పనిలో చాలా వరకు మేమే చేస్తాం. మగవాళ్లు దుక్కి చెయ్యటం, రాత్రి పూట అడవి పందులను పారదోలే పనులు తప్ప.. మిగతావన్నీ మేమే చేస్తాం..’ అంటుంది జయలక్ష్మి. మహిళా రైతులు ఇంత శ్రమ పడుతున్నా.. వారికి భూమి మీద హక్కుల్లేవు. తమిళనాడులో 12.8 శాతం మహిళా రైతులకు మాత్రమే ఎకరమో అరెకరమో భూమి ఉంది. శ్రమ మాత్రం 90 శాతం వారిదే. పితృస్వామిక వ్యవస్థ ఇళ్లలో, పొలాల్లో.. అంతటా ఇంకా రాజ్యం ఏలుతూనే ఉంది!
Comments
Please login to add a commentAdd a comment