రిస్కూ ఉంది.. రాబడీ ఉంది...
ఉమెన్ ఫైనాన్స్ / ఈక్విటీ డెరివేటివ్స్
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టదలచుకునే వారికి వివిధ రకాల కంపెనీలే కాకుండా, ఆ కంపెనీల ఈక్విటీ షేరు ధర ఆధారంగా పని చేసే డెరివేటివ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఈక్విటీ డెరివేటివ్స్ అంటారు. వీటిలో మళ్లీ రెండురకాల కాంట్రాక్ట్స్ అయిన ఫ్యూచర్, ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొనుగోళ్లు, అమ్మకాలు జరపాలంటే తప్పనిసరిగా ఏదైనా ఈక్విటీ డెరివేటివ్ బ్రోకర్ వద్ద ఖాతాని ప్రారంభించాలి. అయితే ఇవి చాలా రిస్క్‌తో కూడినవి. కనుక వీటిలో పెట్టుబడి పెట్టబోయే ముందు అవగాహన కలిగి ఉండడం ఉత్తమం.
ఫ్యూచర్స్, ఆప్షన్స్
ఎల్లప్పుడూ మూడు రకాల కాల వ్యవధితో కూడిన కాంట్రాక్టులు అందుబాటులో ఉంటాయి. {పతి నెల చివరి గురువారం ఆ నెల కాంట్రాక్టు క్లోజ్ అవుతుంది. ఆ మరుసటి రోజు 3 నెలల కాలవ్యవధిలో మరొక కొత్త కాంట్రాక్టు మొదలవుతుంది.అన్ని ఈక్విటీ షూర్లు ఈక్విటీ డెరివేటివ్స్‌లో ఉండవు, ఏయే షేర్లు ఈక్విటీ డెరివేటివ్స్‌తో ఉండాలనేది ‘సెబి’ గైడ్ లైన్స్ ప్రకారం ఎక్స్చేంజ్ వారి చేత నిర్ణయమౌతాయి. ఒక్కొక్క కాంట్రాక్టు విలువ కనీసం 5 లక్షల రూపాయలు ఉంటుంది. దీని ఆధారంగా మార్కెట్ లాట్‌ని నిర్ణయిస్తారు. {పతి ఆరు నెలలకు ఒకసారి ఈ మార్కెట్ లాట్‌ను వాటి రేటు ఆధారంగా మార్పులు చేస్తుంటారు.
ఈక్విటీ షేర్లకు, ఈక్విటీ డెరివేటివ్స్‌కి ఉన్న తేడా ఏంటో చూద్దాం..
ఈక్విటీ షేర్లు ఒక్క షేర్ అయినా కొనవచ్చు. కానీ ఈక్విటీ డెరివేటివ్స్‌ని మాత్రం ఎక్స్చేంజ్ వారు ఎన్ని షేర్లనైతే ఒక లాట్‌గా నిర్ణయిస్తారో అన్ని షేర్లూ తీసుకోవాలి. ఈక్విటీ షేర్లు కొనడానికి షేరు ధర మొత్తానికి సొమ్మును చెల్లించవలసి ఉంటుంది. కానీ డెరివేటివ్స్‌లో మార్జిన్ సొమ్మును చెల్లించవ చ్చు. ఉదాహరణకు ఒక షేరు ధర 100 రూపాయలు అనుకుంటే 10,000 రూపాయలతో 100 షేర్లు కొనవచ్చు. అదే షేరు ఈక్విటీ డెరివేటివ్స్‌లో ఫ్యూచర్స్ మార్జిన్ 25 శాతం ఉందనుకుంటే, అదే 100 షేర్లను 2,500 రూపాయలకు పొందవచ్చు. ఈ మార్జిన్ శాతాన్ని ఎక్స్చేంజ్ వారే నిర్ణయిస్తారు.
ఈక్విటీ షేరుకు కాల వ్యవధి ఏమీ ఉండదు. ఎంతకాలమైనా డీమ్యాట్ ఖాతాలో ఉంచుకోవచ్చు. కానీ ఈక్విటీ డెరివేటివ్స్‌లో మాత్రం కాంట్రాక్టు ముగిసే తేదీ నిర్ణయించి ఉంటుంది. ఆ తేదీన తప్పనిసరిగా క్లోజ్ చెయ్యాలి. లేదా ఆటోమేటిక్‌గా ఎక్సేంజ్ వారే క్లోజ్ చేసేస్తారు. ఒక కంపెనీ షేరు ధర తగ్గుతుందని ఊహించినవారు ఫ్యూచర్స్‌లో ఆ షేర్ లాట్‌ని అమ్మవచ్చు. కానీ అదే షేర్లనైతే అమ్మడానికి వీలు కాదు. ముందే కొని ఉంటేనే అమ్మగలం. మార్జిన్ శాతం పెరిగితే ఆ పెరిగిన సొమ్మును మళ్లీ చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ చెల్లించకపోతే పెనాల్టీ కట్టవలసి ఉంటుంది.
ఫైనాన్షియల్ డెరివేటివ్స్‌లో స్టాక్ ఆధారిత డెరివేటివ్స్ మాత్రమే కాకుండా ఇండెక్స్ ఆధారిత డెరివేటివ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డెరివేటివ్స్‌లో కాంట్రాక్టు ధర ఆ షేరు ధర కన్నా ఎక్కువగా ఉంటుంది. కాంట్రాక్టు వ్యవధి దగ్గర పడుతున్న కొద్దీ షేరు ధరకు మ్యాచ్ అవుతూ ఉంటుంది. ప్రతి రోజూ ఆ కాంట్రాక్టు క్లోజింగ్ ధరకు ‘మార్క్ టు మార్కెట్’ చేస్తారు. లాభం వస్తే ఖాతాకు జమ చేస్తారు. నష్టం వస్తే ఆ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఈ విషయాలన్నీ గమనించి రిస్క్‌ను భరించగలిగే శక్తి ఉన్నప్పుడు ఏ కంపెనీదైతే షేరును మీరు డెరివేటివ్స్‌లో తీసుకోదలచుకున్నారో ఆ కంపెనీ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాకే వీటిలో పెట్టుబడి పెట్టాలి. లేకపోతే అసలుకే ఎసరు రావచ్చు.
రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’