ఢిల్లీలోని తన నివాస గృహంలో మాలా పాల్ (87)
‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదం భగత్‌సింగ్‌ది. ‘ఆకాశంలో సగం’ అనే నినాదం విప్లవనేత మావోది. ‘డూ ఆర్ డై’ అనే నినాదం గాంధీజీది.‘మహిళల హక్కులూ మానవహక్కులే’ అనే నినాదం.. ఎవరిది? ఆ అజ్ఞాత నినాదకర్త గురించి చదవండి.
1984. జెనీవాలో యు.ఎన్. కాన్ఫరెన్స్ జరుగుతోంది. మానవ హక్కుల మీద చర్చ. ఇండియా నుంచి మాట్లాడ్డానికి మాలా పాల్ అనే ఆవిడ వెళ్లారు. ముగ్గురు పిల్లల తల్లి. ఆమె వంతు వచ్చింది. ‘‘ఇండియాలో, ఇంకా అనేక ప్రపంచ దేశాల్లో మహిళలు కనీస హక్కులకు కూడా నోచుకోకుండా దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు. మనం మానవ హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం. మహిళల హక్కులూ మానవ హక్కులేనని ఎందుకు గుర్తించలేకపోతున్నాం! ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ కాదా?!’’ అన్నారు మాలా. ఆ మాటకు మాలా పక్కన ఉన్నావిడ గట్టిగా బల్లను చరిచి మాలాను సమర్థించారు. మరుక్షణం హాలంతా హర్షధ్వానాలు. మాలా పాల్ ‘ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ ప్రతినిధిగా ఆ సదస్సుకు హాజరు అయ్యారు.
ఆ బల్లగుద్దిన ఆవిడ సెనెగల్ రాయబారి. కొన్ని వారాల తర్వాత ఐక్యరాజ్యసమితి.. మాలా అన్న మాటను తన అధికారిక నినాదంగా స్వీకరించింది. ‘ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్’ అనే ఆ మాట అప్పట్నుంచి వాడుకలోకి వచ్చింది. ఏమిటి అంత పవర్ ఆ మాటలో! మహిళ కూడా మనిషేనని గుర్తు చేయడం. గుర్తు చేయవలసినంతగా మహిళల హక్కుల గురించి పట్టించుకోవడం మానేశాం అని చెప్పడం. 1995లో ఐక్యరాజ్యసమితి చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన నాల్గవ ప్రపంచ మహిళా సదస్సులో ప్రసంగిస్తూ అప్పటి అమెరికా ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ ‘ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్’ అని అనడంతో అప్పట్నుంచీ అదొక పొలిటికల్–ఫెమినిస్ట్ నినాదం కూడా అయింది.
1984 అంటే ఇంటర్నెట్‌కు ముందు కాలం. అందుకే మాలా పాల్ అజ్ఞాతంగా ఉండిపోయారు. ఆమె నినాదానికి లభించిన ప్రాధాన్యం నినాదకర్తగా ఆమెకు గుర్తింపు లభించలేదు. అయితే గుర్తింపు కోసం మాలా నినదించలేదు. మహిళల హక్కులను మానవహక్కులుగా గుర్తించమని మాత్రమే అడిగారు. ప్రస్తుతం మాలా వయసు 87 సంవత్సరాలు. యాభైఏళ్ల పాటు విదేశాల్లో గడిపాక, భర్త మరణానంతరం జన్మభూమి జ్ఞాపకాలతో తిరిగి ఇండియా చేరుకుని ఢిల్లీలో ఉండిపోయారు. మాలా 1932లో లాహోర్‌లో జన్మించారు. ఆరుగురు తోబుట్టువులలో ఆఖరి బిడ్డ. తండ్రి ఇండియన్ సివిల్ సర్వీస్‌లో పనిచేసేవారు. అంత గొప్ప హోదా పిల్లలకీ గొప్ప జీవితాన్ని ఇచ్చింది. క్రమశిక్షణతో పెరిగారు. సిటీలోని టాప్ స్కూళ్లలో చదివారు. అయితే దేశ విభజనతో ఆ కుటుంబ పరిస్థితి తలకిందులయింది. 18వ ఏట మాలా పెళ్లయే వరకు వారు ఢిల్లీలోని బరోడా హౌస్‌కి అనుబంధంగా ఉన్న ఒక ఇంట్లో ఉన్నారు.
మాలా భర్త డాక్టర్ రాజీందర్ పాల్ ఆమె కన్నా 13 ఏళ్లు పెద్ద. మలేరియాలజిస్టు. ఆయన వృత్తి జీవితమంతా పూర్తిగా విదేశాల్లోనే గడిచింది. భార్యాభర్తలు కెనడాలో ఉన్నారు. యు.ఎస్.లో ఉన్నారు. చివరికి స్విట్జర్లాండ్‌లో ఉండిపోయారు. అక్కడి ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయంలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున మాలా భర్త వివిధ రకాలైన ప్రాజెక్టులలో తలమునకలై ఉండేవారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ఉన్నప్పుడు మాలా ‘ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ (ఎ.ఐ.డబ్లు్య.సి) వలంటీర్‌గా పని చేశారు. తర్వాత ఆ సంస్థకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు రావడంతో సమితిలోని ‘ఎకోసాక్’ (ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్)లో శాశ్వత సభ్యురాలయ్యారు. ఎ.ఐ.డబ్లు్య.సి. కి సమితి గుర్తింపు లభించడం అన్నది అప్పట్లో భారత్‌కు గర్వకారణమైన విషయం అయింది. అక్కడి నుంచి మాలా ‘కాంగ్రెస్ ఆఫ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్’ సంస్థకు వైస్–ప్రెసిడెంట్ అయ్యారు.
ఆ హోదాలో మాలా అనేక సమస్యలపై ఐక్యరాజ్యసమితిలో పోరాటం జరిపారు. బాలికల హక్కుల పరిరక్షణ, పర్యావరణం, గృహ వసతి, వృద్ధాప్యం, ఆధ్యాత్మిక జీవనం వంటి అనేక ముఖ్యమైన అంశాలపై ఆమె ప్రభుత్వాల ఉదాసీనత్వాన్ని వేలెత్తి చూపేవారు. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన సూచనలు చేసేవారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇంటర్నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్’లో కూడా మాలా సభ్యురాలు. సొంత ఖర్చుతో వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ఆమె ప్రసంగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటిని నడుపుతూనే. పిల్లల ఆలనాపాలనా చూస్తూనే. ఎప్పుడూ బిజీగా, అందుబాటులో లేకుండా ఉండే భర్తతో సర్దుకు వస్తూనే! ప్రస్తుతం మాలా తన కుమార్తె దగ్గర ఉంటున్నారు. పిల్లల పిల్లలతో ఉల్లాసంగా గడుపుతున్నారు. వంట మనిషి కూతుర్ని మంచి స్కూల్లో చదివిస్తున్నారు. తనే స్వయంగా ఆ అమ్మాయికి పాఠాలు చెబుతుంటారు. ‘ఆడపిల్లకు చదువే రక్షణ. చదువే భద్రత’ అంటారు మాలా పాల్.
Comments
Please login to add a commentAdd a comment