
68 ఏళ్ల తర్వాత క్రొయేషియా తొలిసారి వరల్డ్ కప్ ఫుట్‌బాల్ పోటీలలో ఫైనల్స్‌కు చేరిన ఆనందోత్సాహంలో క్రోయేషియా అధ్యక్షురాలు కొలిందా గ్రేబర్–కితారోబిక్.. డ్రెస్సింగ్‌రూమ్‌కి వెళ్లి మరీ తన దేశ క్రీడాకారుల జట్టును ఆలింగనం చేసుకున్నారు. అలా ఆమె ఆలింగనం చేసుకున్న క్రీడాకారులలో ఛాతీపై ఏ అచ్ఛాదనా లేని వారు కూడా ఉండడం మీడియాకు ఒక విశేషం అవగా, అచ్చు కొలిందా గ్రేబర్‌లా ఉండే యు.ఎస్. మోడల్ కోకో ఆస్టి బికినీలో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి, అందులో ఉన్నది కొలిందానే అనుకునేంతగా నెటిజన్‌లను తప్పదారి పట్టించింది ::: మహిళల భద్రత కోసం భిన్నమైన ఆలోచనలను ఆవిష్కరించేందుకు ఐఐటి–హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ఆగస్టు 12 వరకు జరుగుతున్న ‘మెగాథాన్ 2018’ లో దేశవ్యాప్తంగా విద్యార్థులు పాల్గొంటున్నారు. మహిళల భద్రతకు అవసరమైన మెరుగైన పరిష్కారాలను కనుగొనడం కోసం రెండేళ్ల క్రితం తొలిసారి ‘హ్యాకథాన్’ పేరుతో 450 మంది విద్యార్థులతో మొదలైన ఈ విద్యార్థి ఉద్యమం 2017 నాటికి వెయ్యిమందికి చేరుకుని ఈ ఏడాది.. ఈవెంట్‌లో ప్రత్యక్షం పాల్గొనలేని విద్యార్థులను సైతం కలుపుకునేందుకు ‘ఆన్‌లైన్ రౌండ్’ను కూడా ప్రారంభించింది.
చేతిలో బిస్కెట్ పాకెట్లు ఉన్న ఒక మహిళను.. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా సభ్యురాలిగా అనుమానించి గ్రామస్తులు ఒక స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన దేశంలోని మహిళల భద్రతపై సందేహాలను రేకెత్తిస్తోంది. తమిళనాడు మదురైలోని మేలూరు సమీపంలో ఉన్న పత్తినెట్టంకుడిలో గురువారం జరిగిన ఈ ఘటనలో గ్రామస్తులలోనే కొందరు ఆమె ప్రాణ రక్షణ కోసం పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఆమెను విడిపించి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు ::: రాంచీలోని ‘నిర్మల్ హృదయ్’లో అవివాహిత తల్లులకు పుట్టిన బిడ్డల్ని అందులో పనిచేసే ఒక ఉద్యోగి, నన్ కలిసి విక్రయించారనే ఆరోపణలు వచ్చి, వారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొత్తం ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ పైనే దర్యాప్తు చేయించాలన్న బి.జె.పి. ఆలోచన వెనుక మిషనరీస్‌ను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విమర్శించారు. ‘‘స్వయంగా మదర్ థెరిస్సానే స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీని కూడా వీళ్లు వదిలిపెట్టడం లేదు. చారిటీస్ పేరును చెడగొట్టడానికి ప్రయత్నించడం, సిస్టర్స్‌ని టార్గెట్ చెయ్యడం వంటివి తీవ్రంగా ఖండించవలసిన విషయాలు’’ అని మమత ట్విట్టర్‌లో కామెంట్ పోస్ట్ చేశారు ::: అత్యాచారం, లైంగిక వేధింపులలో దోషులైన వారికి డ్రైవింగ్ లైసెన్సు, ఆయుధాలు కలిగివుండే ౖలñ సెన్సులను రద్దు చేయడంతో పాటు, వారిని వృద్యాప్య పింఛన్లకు అనర్హులను చేయడం కూడా జరుగుతుందని హరియాణ ప్రభుత్వం ప్రకటించింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్షను విధించే ఆలోచన ప్రభుత్వ పరిగణనలో ఉందని పంచకులలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడిస్తూ.. లైసెన్సులను, పింఛన్లను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసిందని హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు..
హాలీవుడ్ నటి డెమీ మూర్ క్రెడిట్ కార్డును దొంగిలించి, ఆ విషయాన్ని ఆమె కనిపెట్టే లోపే లక్షా 60 వేల డాలర్ల (సుమారు కోటీ పదిహేను లక్షల యాభై వేల రూపాయలు) కొనుగోళ్లు జరిపిన డేవిడ్ మేథ్యూ రీడ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. కార్డు పోయిన వెంటనే ఆ విషయాన్ని డెమీ మూర్ సహాయకురాలు క్రిడెట్ కార్డ్ కంపెనీకి తెలియజేసేటప్పటికీ ఖరీదైన కోనుగోళ్లు అనేకం జరిగిపోయాయి ::: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని గతంలో బహిర్గతం చేసిన పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌ను గురువారం నాడు ఒక నైట్ క్లబ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. మారువేషంలో క్లబ్బుకు వచ్చిన ముగ్గురు ‘నైతిక విలువల పరిరక్షణ’ డిటెక్టివ్‌లను తాకినందుకే ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతుండగా, రాజకీయ కక్షల కారణంగానే తన క్లయింట్‌ను ఇలా సాధిస్తున్నారని స్టార్మీ తరఫు న్యాయవాది ఆరోపిస్తున్నారు ::: యు.ఎస్. నేవీలో మహిళా ఉద్యోగుల హెయిర్ స్టెయిల్‌పై ఏళ్లనాటి నిషేధాన్ని తొలగిస్తూ, ఇక మీదట మహిళలు యూనిఫామ్‌లో ఉన్నప్పటికీ తమకు ఇష్టమైనట్లు పోనీ టైల్స్, వదులు జడలు, వైడర్ బన్స్, లాక్స్ వంటి వాటితో స్వేచ్ఛగా విధులకు హాజరు కావచ్చని నేవల్ ఆపరేషన్స్ చీఫ్ ఆడమ్ జాన్ రిచర్డ్‌సన్ ప్రకటించారు. ఇందువల్ల నేవీ మరింత సంఘటితం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment