
అరివీర భయంకర మైకాసురుడు
తిక్క లెక్క
మైకు కనిపించగానే మైకం ముంచుకొచ్చినట్లు గంటల తరబడి ఉపన్యాసాలు దంచేవాళ్లను మైకాసురులని పిలుచుకుంటాం. ఇలాంటి శాల్తీలు ఎక్కువగా సాహితీ సభల్లో, రాజకీయ సభల్లో తారసపడుతూ జనాల సహనానికి పరీక్ష పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్లందరినీ తలదన్నే అరివీర భయంకర మహా మైకాసురుడు ఈ ఫొటోలో కనిపిస్తున్న పెద్దమనిషి. ఈ ముంబైవాలా పేరు అజయ్ శేష్. వృత్తిరీత్యా వైద్యుడు, ప్రవృత్తిరీత్యా మైకాసురుడు.
మైకు పట్టుకుని మరీ రికార్డు బద్దలు కొట్టాలని డిసైడైపోయిన ఈ పెద్దమనిషి గత ఏడాది మే 27న ముంబైలోని ఒక హోటల్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశాడు. జనాలు వచ్చి కూర్చున్నాక మే 27 మధ్యాహ్నం 3.44 గంటలకు మైకు పుచ్చుకుని ఉపన్యాసం మొదలుపెట్టాడు. నిరంతరాయంగా తన వాగ్ధాటిని మే 30 వేకువ జామున 4.13 గంటల వరకు కొనసాగించి గిన్నెస్ రికార్డు బద్దలు కొట్టాడు.