కరెంటు కంకులు
సందర్భం
వేసవిలో ఉన్నాం. మొన్నొక వర్షం పడింది. అకాలం! ఇప్పుడైతే మామిడి చెట్లకు పిందెలు మాత్రమే పడాలి. పండ్లే వచ్చేశాయి. స్వయంకృతం! నవంబర్‌లో బంగినపల్లి ఏమిటి? డిసెంబర్‌లో రసాలు ఏంటి? ఏదీ తీరుగా లేదు. ఇది వసంతం కదా. పూలూ, పక్షుల కాలం కదా! వారంలో ఉగాది పెట్టుకుని ఒక్క కోయిలా ‘కుహూ’మని కుయ్యలేదు. కూసిందేమో, రిథమ్ మారి మనమే గుర్తుపట్టలేకపోయి ఉంటాం. మరి పిచ్చుకెక్కడ? మన హౌస్ స్పారో!! బియ్యం నేరుగా బస్తాల్లోనే పండుతున్నాక ఒక్క పిచ్చుకా ఇళ్ల ముందుకు రావడం లేదు. ముంగిట్లో కంకులుంటేనా! పాపం... గింజల్లేని కరెంటు కంకులపైనే అవి ‘ట్వియ్ ట్వియ్’మని వాలుతున్నాయి. ఎండకు సోలిపోతున్నాయి. ఇవాళ పిచ్చుకల రోజు. వరల్డ్ స్పారో డే.
పిచ్చుకలకు రుతువులతో, ‘రోజు’లతో పన్లేదు. మనమే... వాటిని మిస్ అవుతున్నామని చెప్పి, గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకోవడానికి ఓ రోజు పెట్టుకున్నాం. సాయంత్రానికి కాస్త ఎగువన... సోమరి సంధ్యలోకి పిచ్చుకలొచ్చి వాలి, గడప దాకా గెంతి, ఇంట్లో మనుషులేం చేస్తున్నారో మెడ, ముక్కు తిప్పుకుంటూ చూసి వెళ్లే రోజులు ఇప్పుడు లేవు! ఇంట్లో జనాలే ఉండడం లేదు. ఉదయాలు, మధ్యాహ్నాలు, సాయంత్రాలు... మూడింటినీ... టప్పర్‌వేర్‌లో మిక్స్ చేసుకుని వేళాపాళా లేని చదువులకు పిల్లలు, ఓవర్‌టైమ్ కొలువులకు పెద్దలు వెళ్లిపోతుంటే... పిచ్చుకలకు ఇళ్లెక్కడ కనిపిస్తాయి? కరెంటు తీగలెక్కి చూసినా కంకులెలా కనిపిస్తాయి? ఎక్కడి రుతువును అక్కడ ఉంచుకోగలిగితేనే మనిషికైనా, పక్షులకైనా పచ్చని బతుకు. k
► బియ్యం నేరుగా బస్తాల్లోనే పండుతున్నాక ఒక్క పిచ్చుకా ఇళ్ల ముందుకు రావడం లేదు.