ఎనిమిదో అడుగు | Wrestler Babita Phogat Marries Vivek Suhag | Sakshi
Sakshi News home page

ఎనిమిదో అడుగు

Published Wed, Dec 4 2019 12:26 AM | Last Updated on Wed, Dec 4 2019 12:26 AM

Wrestler Babita Phogat Marries Vivek Suhag - Sakshi

మొదటి అడుగు: దైవం మనిద్దరినీ ఒకటి చేయుగాక.
రెండవ అడుగు: మనిద్దరికీ శక్తి లభించుగాక.
మూడవ అడుగు: వివాహ వ్రత సిద్ధి కలుగుగాక.
నాలుగు అడుగు: మనకు ఆనందం కలుగుగాక
ఐదవ అడుగు: దైవం మనకు పశుసంపదను కలిగించుగాక
ఆరవ అడుగు: రుతువులు మనకు సుఖమిచ్చుగాక
ఏడవ అడుగు: దైవం మనకు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణను అనుగ్రహించుగాక.

వివాహ వేడుకలో వేసే ఏడు అడుగుల అర్థం ఇది. ఈ ఏడు అడుగులతో పాటు మరో అడుగు కూడా వేసింది బబితా పోగట్‌. తోటి రెజ్లింగ్‌ క్రీడాకారుడు వివేక్‌సుహాగ్‌తో బబిత వివాహం మొన్న ఆదివారం జరిగింది. ఈ వివాహ వేడుకలో సంప్రదాయంగా వేసే ఏడు అడుగులతో పాటు ఆడపిల్లల అభ్యున్నతి కోరుతూ అదనంగా మరో అడుగు వేశారీ దంపతులు. ‘ఆడపిల్లలను కాపాడుదాం, అడపిల్లలను చదువుకోనిద్దాం, ఆడపిల్లలను ఆడుకోనిద్దాం’ అని ఎనిమిదో అడుగు వేశారు ఈ యువదంపతులు. భారతప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారానికి కొనసాగింపుగా ‘ఆడపిల్లలను క్రీడాకారులుగా తీర్దిద్దిదుదాం’ అని కొత్త ఆలోచనకు ఇలా నాంది పలికారు వీళ్లు.

దేశమెరిగిన సిస్టర్స్‌
బబిత పోగట్‌ పరిచయం అవసరం లేని క్రీడాకారిణి. మల్లయుద్ధ క్రీడాకారిణులు పోగట్‌ సిస్టర్స్‌లో రెండవ అమ్మాయి బబిత. పదేళ్ల కిందట కామన్‌వెల్త్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో మొదలు పెట్టి ఈ పదేళ్లలో కామన్‌వెల్త్‌ గేమ్స్, ఏషియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించింది. బబిత అక్క గీత కూడా ఇదే స్థాయిలో విజయాలనందుకుంది. ఈ మల్లయోధురాళ్ల జీవితం ఆధారంగా గత ఏడాది హిందీలో ‘దంగల్‌’ సినిమా వచ్చింది. అప్పటి వరకు క్రీడాభిమానులకు మాత్రమే తెలిసిన రెజ్లింగ్‌ సిస్టర్స్‌ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించారు.

మరో ముందడుగు
బబిత తండ్రి మహావీర్‌సింగ్‌ పోగట్‌ ద్రోణాచార్య అవార్డు గ్రహీత. అతడు తన కూతుళ్లు నలుగురినీ మల్లయోధులుగా తీర్చిదిద్దడం ద్వారా హరియాణా సమాజంలో ఆడపిల్లల అభ్యుదయానికి దార్శనికుడయ్యాడు. తల్లి గర్భంలో పిండంగా ఉండగానే చిదిమేసే దుష్ట సంప్రదాయం వేళ్లూనుకుని పోయిన హరియాణా రాష్ట్రంలో పోగట్‌ సిస్టర్స్‌ సంప్రదాయ పరిధులను చెరిపేసి విజయశిఖరాల వైపు అడుగులు వేశారు. ఇప్పుడు హరియాణాలో వారి సొంతూరు బలాలి గ్రామంలో జరిగిన వివాహ వేడుక సందర్భంగా బబిత దంపతులు.. సామాజిక చైతన్యం కోసం వివాహవేడుకలో ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయాన్ని సవరించి కొత్త
సంప్రదాయం వైపు అడుగులు వేశారు.తొలి ఏడు అడుగులు తమకు సంపూర్ణమైన జీవితం సిద్ధించాలని కోరుకున్న ఈ కొత్త దంపతులు ఎనిమిదో అడుగుని సమాజ హితం కోసం వేశారు. తాను ఈ ఏడాది జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో దాద్రి నియోజకవర్గం నుంచి బరిలో దిగడం కూడా విధాన నిర్ణయాల్లో భాగం పంచుకునే అధికారం ఆడవాళ్లకు కూడా ఉందని తెలియచేయడానికేనని ఆమె ఎన్నికల సందర్భంగా చెప్పారు.
– మంజీర

ఇది సమష్టి నిర్ణయం

మేము ప్రాక్టీస్‌ కోసం గోధుమ చేలలో పరుగులు తీసేటప్పుడు అందరూ మమ్మల్ని వింతగా చూసేవాళ్లు. వాళ్ల దృష్టిలో స్త్రీ ఎలా ఉండాలంటే... దేహాకృతి స్పష్టంగా తెలియనంత వదులుగా దుస్తులు ధరించాలి. అలాంటి భావజాలం రాజ్యమేలుతున్న రోజుల్లో మేము నిక్కర్, టీ షర్ట్‌ వేసుకుని జుట్టు పొట్టిగా కత్తిరించుకుని పరుగులు తీయడం మా ఊరి వాళ్లకు ఓ పెద్ద విచిత్రం. ఇన్నేళ్ల మా ప్రయాణంలో మేము ఎక్కడ తప్పటడుగు వేస్తామా అని ఎదురు చూసిన వాళ్లే ఎక్కువ. అలాంటి సమాజంలో ఆడపిల్ల తన జీవితాన్ని తాను జీవించే పరిస్థితులు నెలకొనాల్సిన అవసరం చాలా ఉంది. అడ్డంకులను దాటుకుని ముందడుగు వేసిన మాలాంటి వాళ్లందరం రాబోయే తరాలకు కొత్తదారిని నిర్మించాలి. ఇందులో భాగంగానే గత ఏడాది మా కజిన్‌ వినేశ్‌ కూడా తన పెళ్లిలో ఎనిమిది అడుగులు వేసింది. ఇది మేమంతా సమష్టిగా తీసుకున్న నిర్ణయం.
– బబిత పోగట్, రెజ్లింగ్‌ క్రీడాకారిణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement