ప్రాణాధారం | Yoga practice | Sakshi
Sakshi News home page

ప్రాణాధారం

Published Wed, Feb 17 2016 10:35 PM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

ప్రాణాధారం

ప్రాణాధారం

ప్రాణాయామం అంటే ప్రాణ + ఆయామ (నియంత్రించుట) లేదా ప్రాణ + యమ (ఎరుక).   లోపలికి వెళ్లి బయటకు వచ్చే ప్రాణ వాయువును పూర్తిగా మనసు పెట్టి నియంత్రించడం అని అర్థం చేసుకోవాలి. యోగసాధనలో ప్రాణయామం చాలా విశిష్టత  కలిగిన భాగం. మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా ఆసనాలు వేయడం పూర్తయ్యాక ప్రాణాయామం విధిగా ఆచరించదగినది.
 
ప్రాణయామాల వల్ల సప్తధాతువులైన రస, రక్త, మాంస, మేధ, అస్తి, మజ్జ, శుక్రములోని 724 ట్రిలియన్‌ల (లక్ష కోట్ల) కణజాలానికి ఆక్సిజన్ పూర్తిగా అందుతుంది. దీంతో శరీరభాగాలన్నీ ఆరోగ్యవంతం అవుతాయి. యోగాసనాల సాధన క్రమంలో శరీరంలో ఉత్పత్తి అయి పేరుకుపోయే లాక్టిక్ ఆమ్లం కండరాల నొప్పులకు, కీళ్ల నొప్పులకు ముఖ్య కారణం. దీనిని తీసివేసి దేహానికి ఉపశమనం కలిగించాలి. అలా చేయాలంటే ప్రాణాయామం చక్కని మార్గం.  శరీరంలో ఉత్పత్తి అయిన లాక్టిక్ ఆమ్లం కార్బన్‌డయాక్సైడ్‌తో కలిసి బయటకు తేలికగా పోయేందుకు ఆసనాలు సాధన చేసిన తర్వాత ప్రాణాయామం చేయడం చాలా మంచిది.

ప్రాణాయామాలు రెండు రకాలు
ప్రాణయామాన్ని బహిరంగ, అంతరంగ అని రెండు విధాలుగా విభజించవచ్చు. కణజాలం బాహ్యపొర వరకూ ప్రాణవాయువును తీసుకెళ్లేవి బహిరంగ ప్రాణయామాలు, కణజాలం లోపలి వరకూ ప్రాణవాయువును పంపేవి అంతరంగ ప్రాణయామాలు. కొత్తగా సాధన చేసేవాళ్లు బహిరంగ ప్రాణయామాల మీద పట్టు సాధించిన తర్వాతనే అంతరంగ ప్రాణయామ సాధన ప్రారంభించాలి. అందుకని తొలుత బహిరంగ ప్రాణాయామాల గురించి వివరిస్తున్నాం.
 
 
సూర్యభేది

బహిరంగ ప్రాణయామాల్లో సూర్యభేది ఒకటి. దీనిని సాధన చేయాలంటే మొదట నాసికాగ్ర ముద్ర వేయాలి. అంటే కుడి చూపుడువేలు, మధ్యవేలు కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో ఉంచాలి. ఉంగరపు వేలును ఎడమ ముక్కు ఎముక (సెప్టమ్ బోన్) మీద ఉంచి బొటన, చిటికెనవేళ్లను కుడి, ఎడమ నాసికలను మూయడానికీ తెరవడానికీ  ఉపయోగించాలి. ఎడమ చేతిని ఎడమ మోకాలి మీద ధ్యానముద్రలో ఉంచాలి. అంటే చూపుడు వేలు కొనను బొటనవేలు కొనకు తాకించి మిగిలిన మూడు వేళ్లను బయటకు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు చూపిస్తూ ఉంచాలి. కుడినాసికతో శ్వాస సుఖ పూర్వకంగా లోపలికి తీసుకుని బొటనవేలితో కుడినాసికను మూసి, ఎడమ నాసిక గుండా శ్వాసను సుఖపూర్వకంగా బయటకు వదలాలి. ఎడమనాసికను చిటికెనవేలుతో మూసి కుడి నాసిక నుంచి మళ్లీ శ్వాస తీసుకోవాలి. ఇలా 5 నంచి 10 సార్లు చేయవచ్చు. తీసుకునే శ్వాసకన్నా వదిలే శ్వాసకు ఎక్కువ సమయం తీసుకోవడం మంచిది. మధ్యలో శ్వాసను ఆపి ఉంచవలసిన అవసరం లేదు.

ఉపయోగాలు: ఇది సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్‌ను ఉత్తేజ పరచి జీవక్రియను చైతన్యవంతం చేస్తుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. బద్ధకాన్ని దూరం చేస్తుంది. పొట్ట కండరాల్లో  కొవ్వు కరగడానికి ఉపకరిస్తుంది. ‘ఉజ్జయి’ చేయడం వలన కేలరీలు ఎక్కువ ఖర్చవుతాయి.
 (ఉజ్జయి అనగా శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు పాము బుసలా శబ్దం చేయడం).    
 
 
విభాగ (3 రకాలు)
రెండవ బహిరంగ ప్రాణయామం ఇది. ఊపిరితిత్తులలోని విభిన్న భాగాలకు ఆరోగ్యాన్ని అందిస్తుంది కాబట్టి దీన్ని విభాగ ప్రాణయామం అంటారు.
 
ఉపయోగాలు: ఊపిరి తిత్తుల్లోని పైభాగాలకు, మధ్య భాగాలకు, క్రింది భాగాలకు ఆక్సిజన్‌ను విడివిడిగా సరఫరా చేసేందుకు ఉపకరిస్తుంది.  దీని వలన ఊపిరితిత్తుల్లో అత్యంత కింద భాగంలో ఎప్పుడూ పనిచేయని ఊపిరితిత్తులు కూడా పనిచేయడం మొదలుపెడతాయి. ఊపిరితిత్తుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఆస్త్మా సమస్య ఉన్నవారు, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు దీనిని మరింత ఎక్కువ సాధన చేయాలి. దీనిని 3 రకాలుగా సాధన చేయవచ్చు.
 
 ఊర్ధ్వ: సుఖాసనంలో గాని, అర్ధ పద్మాసనంలో గాని, పద్మాసనంలోగాని కూర్చోవాలి. అలా నేల మీద కూర్చోలేనివారు కుర్చీలో కూర్చుని చేయవచ్చు. దీనిలో వెన్నెముకను నిటారుగా ఉంచి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి తీసుకెళ్లి అరచేతుల్ని ఆకాశంవైపు చూపుతూ ఇంటర్‌లాక్ చేయాలి. తలని కాస్త పైకి లేపి 3 నుంచి 5 సాధారణ శ్వాసలు తీసుకుని శ్వాస వదులుతూ చేతులు రెండూ భూమి వైపునకు చూపిస్తూ పక్క నుంచి నెమ్మదిగా కిందకు తీసుకు రావాలి. మెడను, భుజాలను పైకి కిందకు కదిలిస్తూ రిలాక్స్ అవ్వాలి. ఇది మెదడు, థైరాయిడ్ సమస్యలకు ఉపయుక్తం.
 
మధ్య: చేతులు రెండూ ఇంటర్‌లాక్ చేసి శ్వాస తీసుకుంటూ ముందుకు నేలకి సమాంతరంగా స్ట్రెచ్ చేయాలి. వీలుకొద్దీ 3 నుంచి 5 సాధారణ శ్వాసలు తీసుకుని తర్వాత శ్వాస వదులుతూ చేతులు ముందు నుంచి పక్కకు కిందకు తీసుకురావాలి. భుజాలు, మెడ కండరాలు పట్టుకుంటే రిలాక్స్ చేయాలి.  గుండెలో బ్లాక్స్ ఉన్నవారికి హైబీపీ ఉన్నవారికి మంచిది.
 
అధో: చేతులు రెండూ వెనుకకు కిందకు తీసుకెళ్లి ఇంటర్‌లాక్ చేసి కలిపి ఉంచిన అరచేతులు రెండింటినీ భూమి వైపునకు చూపిస్తూ సాగదీస్తూ ఛాతీని ముందుకు ప్రొజెక్ట్ చేసి 3 లేదా 5 సాధారణ శ్వాసలు తీసుకుని తర్వాత శ్వాస వదులుతూ చేతులు కిందకు తీసుకురావాలి. మెడ, భుజాలు రిలాక్స్ చేయాలి. జీర్ణసమస్య ఉన్నవారికి మేలు చేస్తుంది. లివర్, పాంక్రియాస్, జీర్ణవ్యవస్థలకు చాలా మంచిది.
 
జాగ్రత్తలు: కొన్ని రకాల ప్రాణయామాలను హైబీపీ ఉన్నవాళ్లు, హైపర్ యాక్టివ్‌గా ఉన్న పిల్లలు చేయకపోవడం మంచిది. ఏ ప్రాణయామమైనా ఊపిరితిత్తుల సామర్థ్యానికి మించి చేయరాదు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ కొనసాగించవ చ్చు.
 
ఎ.ఎల్.వి కుమార్
ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement