ఆరోగ్యం నవ్వాలంటే.. నువ్వులు
గుడ్‌ఫుడ్
ఇప్పుడంటే మనం వంటకు రకరకాల నూనెలు ఉపయోగిస్తున్నాం. కానీ ఒకప్పుడు వంట నూనె అంటే నువ్వులనూనే. అంటే... తిలల నుంచి తీసిందే ‘తైలం’ అన్నమాట. మన భారతీయ సంస్కృతిలో నువ్వులు అంతగా ఇమిడిపోయాయి. నువ్వులలో ఉన్న మంచి ఆరోగ్యకరమైన పోషకాల జాబితాకు అంతే లేదంటే అతిశయోక్తి కాదు. గుండెజబ్బుల నిరోధానికి నువ్వులు ఎంతగానో మేలు చేస్తాయి. నువ్వుల్లో ప్రొటీన్లు ఎక్కువ. ఇందులో విటమిన్–ఇ, క్యాల్షియమ్‌లు కూడా ఎక్కువ. కాబట్టి శరీరంలో అయ్యే గాయాల రిపేర్‌కు ఇది బాగా తోడ్పడుతుంది.
నువ్వుల్లో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రుతుస్రావం అయ్యే మహిళలు నువ్వులను ఏ రూపంలో తీసుకున్నా వాటివల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.నువ్వులలో విటమిన్–బి కాంప్లెక్స్‌లోని పోషకాలైన నియాసిస్, రైబోఫ్లేవిన్, థయామిన్ వంటివి మరింత ఎక్కువ. నువ్వుగింజల్లోని బరువులో 50 శాతం మేరకు నూనె పదార్థమే ఉంటుంది. అందులో విటమిన్–ఇ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మసౌందర్యానికి, మేని ఛాయ మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది.