ఈ వారం యూట్యుబ్ హిట్స్
మొహెంజోదారో : ట్రైలర్
నిడివి : 3 ని. 30 సె.
హిట్స్ : 77,41,591
బ్రిటిష్ పాలనకు ముందు, మొఘల్ సామ్రాజ్యానికి ముందు, క్రీస్తుకు ముందు, బుద్ధుడికి ముందు, ఇప్పటి భారతదేశానికి ముందు.. మొహెంజోదారో పట్టణాన్ని ప్రాణప్రదంగా భావించిన ఒక యువ రైతు, అక్కడి ఒక సౌందర్యవతిని ప్రేమించిన ధీరోదాత్తుడు.. పట్టణాన్ని, ప్రియురాలిని కాపాడేందుకు ప్రాణాలు తెగించే ప్రణయగాథ.. మొహెంజోదారో. ఈ చిత్రం ట్రైలర్ ఈవారమే విడుదలైంది. సినిమా ఆగస్టు 12న రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్, పూజా హెగ్డే నాయకానాయికలుగా నటిస్తున్నారు. లగాన్, జోధా అక్బర్ చిత్రాల దర్శకుడు అశుతోశ్ గోవరికర్ తీస్తున్న ఈ చిత్రంలోని సన్నివేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో ట్రైలర్ చూసి తెలుసుకోవచ్చు. క్రీ.పూ. 2016లో సింధూ లోయలో కథ మొదలౌతుంది. మనిషిలోని దురాశ అతి ప్రాచీనమైన మొహెంజోదారో నాగరికతను నాశనం చేస్తుంటే ఆ విధ్వంసాన్ని ఆపేందుకు హీరో రంగంలోకి దిగుతాడు. ప్రధాన పూజారి కూతుర్ని ప్రేమిస్తాడు. ఆ క్రమంలోనే మొహెంజోదారో గురించి, తన గురించి, హీరోయిన్ గురించి కొన్ని రహస్యాలను తెలుసుకుంటాడు.
బాత్ ఇన్ కోక్
నిడివి : 4 ని. 7 సె.
హిట్స్ : 69,02,016
ఓ అమెరికన్ కోక్ ప్రియుడి ఈత కొలను వీడియో ఇది. కొన్ని వేల కోక్ బాటిళ్లను కొని ఇంట్లో జమచేసుకున్నాడు. ఇందుకు కొన్ని వారాల సమయం పట్టింది. కోక్ బాటిళ్ల మూతలు తీసి కొలను నింపుకున్నాడు. ఇందుకు కొన్ని గంటల సమయం పట్టింది. తర్వాత ఐస్ గడ్డలు వేసుకున్నాడు. ఆ తర్వాత కోక్ కొలనులోకి అంతెత్తున ఎగిరి దూకాడు. ఈత కొట్టాడు. స్నానం చేశాడు. పాటలు పాడాడు. ఆటలు ఆడాడు. తనతో పాటు కొలనులోకి తెచ్చుకున్న కోక్‌ను కొద్దిగా తాగి, మిగతాదంతా కోక్ సముద్రంలోకి ఒంపేశాడు. అక్కడితో ఆగలేదు. టెక్నాలజీ విధ్వంసానికి పాల్పడ్డాడు. (అదేమిటో వీడియోలో చూడండి). మొత్తం 1500 గ్యాలన్ల కోక్‌ను ఇందుకోసం వినియోగించాడు. అంటే 5678 లీటర్లు! మరి ఈ మాత్రం దానికి కొలను ఫుల్ అయిపోయిందా? ఫుల్ కాలేదు. నీళ్లను కోక్‌తో ఫిల్ చేశాడు. అతడు కుమ్మరించిన కోక్ పరిమాణం.. కొలను కెపాసిటీలో 7 శాతం మాత్రమేనట! ఏదైనా మంచి ఎక్స్‌పరిమెంట్. చిల్డ్ ఎక్స్‌పీరియెన్స్.