సంజు ట్రైలర్
నిడివి 3 ని. 04 సె. ,హిట్స్ 3,02,86,580
వెండి తెర మీద కనిపించే సంజయ్ దత్ వల్ల సంజయ్ దత్ మనకు కొంచెమే తెలుసు. మీడియా ద్వారా తెలిసే సంజయ్ దత్ వల్ల మనకు సంజయ్ దత్ కొంచెమే తెలుసు. సంజయ్ దత్ తండ్రికే సంజయ్ దత్ పూర్తిగా తెలియ లేదు. అతని తోబుట్టువులకు కూడా అతను పూర్తిగా తెలియదు. స్నేహితులు అతడికి ఎరిగినది కొంతే. ఒక మనిషి సంపూర్ణత్వం ఆ మనిషికే తెలుస్తుంది. ఎదుటివారికి ఎంతమాత్రమూ కాదు. అయినప్పటికీ వారిని పూర్తిగా పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి.
సంజయ్ దత్ ఆత్మకథ ఆధారంగా ఇప్పుడు రాబోతున్న ‘సంజు’ కూడా అలాంటి ప్రయత్నమే. రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్ర పోషించగా రాజ్‌కుమార్ హిరాణి దర్వకత్వంలో తయారైన ఈ సినిమా– ట్రైలర్‌లో కనిపిస్తున్న మేరకు సంజయ్ దత్ రహస్యాలను చాలానే చెప్పేలా ఉంది. అన్ని దశల్లో అతడు ఎదుర్కొన్న సన్మానాన్ని అవమానాన్ని చూపేలా ఉంది. ఉదాహరణకు జైలు గదిలో అతడి లావెటరీ లీకై గదంతా బీభత్సంగా మారితే భయంతో వికారంతో పెనుకేకలు పెడుతున్న సంజయ్ దత్ ఈ ట్రైలర్‌లో ఉన్నాడు.
అలాంటి మరెన్ని ఘట్టాలు ఉన్నాయో. సంజయ్ దత్ ఈ దర్శకుడికి అన్ని కోణాలు విపులంగా చెప్పి ఉండాలి. అయితే వాటి సారం ఒకటే– తాను టెర్రరిస్టు కానని తన దగ్గర ఏకే 56 రైఫిల్ దొరకడం వెనుక కారణాలు వేరని. మనిషి తప్పులు ఎక్కువ చేస్తే సమాజం అతణ్ణి దూరంగా పెడుతుంది. సంజయ్ అదృష్టం ఏమిరా అంటే అతణ్ణి అతడి తప్పొప్పులతో పాటు ప్రేమించే అభిమాన గణం ప్రేక్షకులు ఉన్నారు. అతడిలో కనిపించే హానెస్టీ ఇన్నోసెన్స్ ఇందుకు కారణం కావచ్చు. ఏమైనా సంజయ్ దత్ మీద తీసిన సినిమా సంచలనం సృష్టించక మానదు. దీనివల్ల సంజయ్ దత్‌కు వచ్చే పేరు కంటే రణబీర్‌కు వచ్చే పేరే ఎక్కువగా ఉండబోతోందని ట్రైలర్ రూఢీ పరుస్తోంది.
ఓరుగల్లు కోటనడుగు – తెలంగాణ ఆవిర్భావ గీతం
నిడివి 4 ని. 50 సె. ,హిట్స్ 28,44,770
‘ఓరుగల్లు కోటనడుకు... కోటలోని కత్తినడుగు చెపుతాయిలే ఈ నేల ఘనతనే తెలంగాణ చరితనే’... అని మొదలవుతుంది ఈ పాట పల్లవి. తెలంగాణ సాధన, ఆవిర్భావం తరాల కల. ఆ కల సాధన కోసం ఎందరో త్యాగాలు చేశారు. పోరాటాలు చేశారు. తెలంగాణ సాధించుకున్నాక ప్రతి సంవత్సరం జూన్ 1న ఆ వీరుల త్యాగాన్ని ఈ నేల గొప్పతనాన్ని తలుచుకోవడం బాధ్యతగా భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ‘మైక్ టీవీ’ తెలంగాణ ఆవిర్భావ గీతాన్ని సమర్పించింది. మంగ్లి, జంగి రెడ్డి ఆలపించిన ఈ గీతాన్ని కందికొండ రచించారు. పాపులర్ ఉదాహరణతో కాకుండా సబ్ ఆల్టర్న్ సంస్కృతిని ఈ పాటలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అంగీకారం, అభ్యంతరం కలిగిన ఉదంతాలు, ఉద్యమాలు కూడా ఈ పాటలో కనిపిస్తాయి. తెలంగాణ అంటే అదంతా కదా. అదంతా కలిసే తెలంగాణ అని చెప్పే ప్రయత్నం ఈ పాటలో కనిపించింది. తెలంగాణలోని వివిధ లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాటను అప్పిరెడ్డి నిర్మిస్తే, దామురెడ్డి కొసనం దర్శకత్వం వహించారు. సంగీతం: నందన్‌రాజ్ బొబ్బిలి.
ఫ్రాంక్లీ విత్ టి.ఎన్.ఆర్. రమాప్రభ ఇంటర్వ్యూ
నిడివి 2గం.55ని.50సె. ,హిట్స్ 4,08,220
పాతతరం వాళ్లు జ్ఞాపకాల గని. ఎంతగా వారిని తవ్వుకుంటూ వెళితే అన్ని జ్ఞాపకాలు బయటపడతాయి. రమాప్రభ కామెడీలో సూపర్‌స్టార్. నిజ జీవితంలో ఆమె ఉత్థాన పతనాలు ఒక బయోపిక్ తీయడానికి తక్కువైనమేమీ కావు. అలాంటి స్టార్ ప్రస్తుతం మదనపల్లెల్లో అయినవాళ్ల సమక్షంలోనే అయినా ఒంటిరి జీవితం గడుపుతున్నారు. ఆమె సావిత్రి గురించి ఏం చెప్పారు... తన కాలపు నటీనటుల గురించి ఎటువంటి జ్ఞాపకాలు పంచుకున్నారు ఈ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది.
‘సావిత్రి మొండితనమే ఆమె కష్టాలకు కారణం’ అంటారు రమాప్రభ. ప్రజల సహాయార్థం మైలాపూర్‌లోని ఒక ఇంటిని ఆమె క్షణాలలో రాసివ్వడం గురించి రమాప్రభ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నటనకు, అనుభవానికి గౌరవం ఇవ్వాలనుకుంటే ముందు నాకు ఇవ్వాలి. కాని డబ్బు లేని కారణాన నన్ను తక్కువ చూస్తానంటే మాత్రం ఒప్పుకోను’ అంటారు రమాప్రభ.
ఆమె ఒక లెజెండ్. ఎన్నో గౌరవాలు, సత్కారాలు పొందాల్సిన నటి. ఆ నటి అంతరంగం తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ కూడా ఒక మార్గం. ఇంటర్వ్యూ: టి.ఎన్.ఆర్, లొకేషన్: మదనపల్లె
Comments
Please login to add a commentAdd a comment