
ప్రియురాలి ప్రతీకారం
టేలర్ స్విఫ్ట్ : రెడీ ఫర్ ఇట్?
నిడివి - 3 ని. 30 సె.
హిట్స్ - 2,99,99,836
బాయ్స్ ఎప్పుడూ టేలర్ స్విఫ్ట్ ఎటాక్ కోసం ఎదురు చూస్తుంటారు.. కళ్లు, ఒళ్లు అప్పగించేసి! ఇరవై ఏడేళ్ల ఈ అమెరికన్ పాప్ దెయ్యప్పిల్ల.. వరల్డ్‌వైడ్‌గా అబ్బాయిల ప్రాణం తియ్యడానికి ఇదిగో ఇప్పుడు మళ్లీ వచ్చింది.. రెడీ ఫర్ ఇట్? అని అడుగుతూ! టేలర్ ఆరో ఆల్బమ్ ‘రెప్యుటేషన్’లోని ఈ సాంగ్‌లో ఆమె రెండు దేహాలతో దర్శనమిస్తుంది.
ఒకటి సైబర్ రూపం. ఇంకొటి సైతాన్ రూపం. సైతాన్‌కి సైబర్ అంతరాత్మ. ఈ ప్రేమ మూర్తి సైతాన్ కావడం ఏమిటి? ప్రతీకారం మరి! నమ్మించి, నట్టేట ముంచిన మాజీ ప్రేమికుల గొంతులకు బిగించడానికి టేలర్ ఈ సాంగ్‌ని ఒక ఉరితాడులా గిర్రున తిప్పి విసిరారు. ‘ఎంతమందిని ప్రేమిస్తావు? ఎంతమందిని నీ వెంట తిప్పుకుంటావు? హృదయాలను దొంగిలించి, పారిపోతావు. కనీసం క్షమాపణైనా చెప్పవు. చూస్తా నీ అంతు..’ అంటూ బెదిరించినట్లే ఉంటుంది.. ఈ వీడియోను మోసకారులైన మగ ప్రేమికులెవరైనా చూస్తే కనుక.
రాణిగారు మిమ్మల్నీ ఆవహిస్తారు
పద్మావతి : ఘూమర్ సాంగ్
నిడివి - 3 ని. 19 సె.
హిట్స్ - 2,41,27,424
కాంట్రావర్షియల్ మూవీ ‘పద్మావతి’ లోంచి బయటికి వచ్చిన ఫస్ట్ సాంగ్ ‘ఘూమర్’. మంచి ట్రెండింగ్‌లో ఉంది. రాచరికపు జానపదాల్లోని ‘ఘూమర్’ అనే పాటను తీసుకుని ఆ సారాన్ని రాజస్థాన్ గాయకుడు స్వరూప్‌ఖాన్‌తో కలసి శ్రేయాఘోషల్ ఆలపించారు. భన్సాలీ మ్యూజిక్‌లోని ఈ అంతఃపుర నృత్య ప్రధాన గీతం.. మీరు ఆడపిల్ల గనుకైతే కాసేపు మీ గాజుల చేతుల్నీ, మువ్వల కాళ్లను కదిలిస్తుంది.
మీరు కదలకపోవచ్చు. మీ గాజులు, గజ్జెలు కదులుతాయి. దీపికా పడుకోన్ (పద్మావతి) తన భర్తపై గుండె నిండా ప్రేమను నింపుకుని నృత్యం చేస్తుంటుంది. అయితే ఎంతైనా ఆమె రాణి గారు కదా! పరదాల పరిమితుల్లోనే కొద్దిపాటి కదలికలతో, కనుసైగలతో తన ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. పై మందిరం నుంచి షాహిద్ కపూర్ (రావల్ రతన్ సింగ్) చిరునవ్వుతో దీపికను చూస్తుంటాడు. యూట్యూబ్‌లో ఈ సాంగ్ విడుదలైన కొద్ది వ్యవధిలోనే హిట్లు కోట్లకు చేరుకున్నాయి.
అమెరికన్ రెడ్డి
డ్రేమండ్ గ్రీన్ అండ్ బ్రాడ్‌లీ బీల్ : రియల్ ఫైట్
నిడివి - 2 ని. 25 సె.
హిట్స్ - 20,14,573
‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూశారా? చూడకపోయినా నో ప్రాబ్లం. ఈ వీడియో చూడండి. అర్జున్‌రెడ్డి చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ కాలేజ్ స్టూడెంట్. బాస్కెట్‌బాల్ ఆడుతుంటాడు. అవతలి జట్టులో అమిత్ అనే స్టూడెంట్ ఉంటాడు. హీరో గోల్ కొట్టి, ‘ఏయ్ అమిత్..’ అని రెచ్చగొట్టి, మిడిల్ ఫింగర్ చూపిస్తాడు. ఆట ఆగిపోయి, ఇద్దరి మధ్య ఫైట్ మొదలౌతుంది. ఇంచుమించు అలాంటి సీన్‌నే మీరు ఈ వీడియోలో చూస్తారు.
కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో శుక్రవారం రాత్రి ‘గోల్డెన్ స్టేట్ వారియర్స్’, ‘వాషింగ్టన్ విజార్డ్స్’ జట్ల మధ్య బాస్కెట్‌బాల్‌లో టఫ్ ఫైట్ నడుస్తోంది. సెకండ్ క్వార్టర్‌లో ఇంకా ఇరవై సెకన్లు ఉందనగా, కడుపులో ఎంత కోపాన్ని దాచుకుని ఉన్నాడో ఏమో.. బ్రాడ్‌లీ బీల్ వెళ్లి డ్రేమండ్ గ్రీన్ మీద పడి అతడి ముఖం మీద, మెడ మీద కొట్టేశాడు. యాక్షన్‌కి రియాక్షన్ ఉండకుండా ఉంటుందా? గ్రీన్ కూడా అతడిని కొట్టాడు.
పనిష్మెంట్‌గా ఇద్దర్నీ బయటికి పంపించారు. సోమవారం (ఇవాళ) వీరిద్దరి వాదన విన్నాక, ఎవరికి ఏ శిక్ష విధించాలన్నది ఫైనల్ అవుతుంది. రెడ్ డ్రెస్‌లోని బీల్ ‘వాషింగ్టన్ విజార్డ్స్’ ఆటగాడు. వైట్ డ్రెస్‌లోని గ్రీన్.. ‘గోల్డెన్ స్టేట్ వారియర్స్ ప్లేయర్. ఇద్దరూ అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు. ఆటలోని కోపం కొట్టుకునేవరకూ వెళ్లిందంటే.. చిన్నపిల్లలం అయిపోయామనే!
ఇంగ్లిష్ అండ్ ఇవాంక
ఇవాంక ట్రంప్ డజంట్ అండర్‌స్టాండ్ వర్డ్స్
నిడివి - 3 ని. 17 సె.
హిట్స్ - 18,84,394
అమెరికన్‌లకు ఇంగ్లిష్ రాకపోవడం మనకు వండర్. వాళ్లకు కామెడీ. రోజూ పొద్దుపోయాక ‘లేట్‌నైట్‌తో షో’లతో అమెరికన్‌లను నవ్విస్తుండే టీవీ హోస్ట్ స్టీఫెన్ కాల్బెర్ట్ గారి కామెడీ గేలానికి ఈసారి ట్రంప్ కుమార్తె ఇవాంక చిక్కారు! ట్విట్టర్‌లో ఆమె కామెంట్స్‌నీ, ఇంటర్వ్యూలలో ఆమె సమాధానాలను ఎంపిక చేసుకుని ఆమె ఇంగ్లిష్‌పై ఆయన సెటైర్లు వేసి నవ్వించారు. ‘ఇవాంక ఎంతో తెలివైన అమ్మాయి.
కానీ ఆమెకు ఇంగ్లిష్ పదాలకు అర్థం తెలీదు’ అని మొదలు పెట్టి, ‘మనం మాత్రం ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం’ అని షోని ముగించి ఆ పూటకి గుడ్‌నైట్ చెప్పేశారు స్టీఫెన్. ‘కంప్లిసిట్’ అంటే నేరంలో భాగస్వామ్యం అని అర్థం. అయితే ఒక ఇంటర్వ్యూలో ఇవాంక దానికి పూర్తి భిన్నమైన అర్థంలో ‘ఐ యామ్ కంప్లిసిట్’ అని చెప్పుకున్నారు! ‘ఒక మంచి పనిలో పాలుపంచుకోవడం కంప్లిసిట్’ కనుక అయితే నేను కంప్లిసిటే అని కూడా వివరణ ఇచ్చారు.
దాన్ని పట్టుకుని స్టీఫెన్ కొద్దిసేపు ప్రేక్షకులను నవ్వించారు. తర్వాత ఇవాంక గతంలో చేసిన ఒక ట్వీట్‌ని పట్టుకున్నారు. ‘థియోడర్‌కి 8 నెలలంటే నేను నమ్మలేకపోతున్నాను. హ్యాపీ బర్త్‌డే’ అనే ట్వీట్ అది. థియోడర్ ఇవాంక కొడుకు. వాడికి ఎనిమిది నెలలు ఉన్నప్పుడు ఆమె ఈ ట్వీట్ పెట్టారు. ఎనిమిది నెలలకే హ్యాపీ బర్త్‌డేనా అని స్టీఫెన్ నోట్లో చెయ్యిపెట్టుకున్నాడు. షో నవ్వుల్తో షేక్ అయిపోయింది. మన పిల్లలకు తెలుగు సరిగా రానట్లే.. అమెరికాలో ఇవాంక లాంటి అమ్మాయిలకు ఇంగ్లిష్ రాదేమో మరి!
రేపు రాత్రి బయటికి రాకండి
హాలోవీన్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ : లెలె పాన్స్
నిడివి - 4 ని. 31 సె.
హిట్స్ - 34,64,712
రేపు హాలోవీన్ డే. పిల్లలు డెవిల్స్‌లా డ్రెస్ చేసుకుని చీకట్లో ఒకర్నొకరు భయపెట్టుకుని ఆనందించే రోజు. పశ్చిమ దేశాల్లోని ఈ క్రైస్తవ ఆచారం క్రమంగా మన దేశానికీ వచ్చింది. చనిపోయిన ప్రవక్తలు, అమర వీరుల ఆత్మలు ఆ రోజు సమాధి నుంచి లేచి రాత్రి వేళ ఊళ్లలో సంచరిస్తారట.
ఆత్మలు లేచి వచ్చినా రాకపోయినా, పిల్లలు మాత్రం అంత సీన్ క్రియేట్ చేస్తారు. ఎవరెంత బాగా భయపెట్టారన్నది ఎవరెంత బాగా (పిశాచిలా) డ్రెస్ చేసుకుని, మేకప్ వేసుకున్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. ఈ వీడియోలోని ‘లెలె పాన్స్’ అనే అమ్మాయిని చూడండి. ఎంత చక్కగా ఉంటుందో! హలోవీన్ మేకప్ వేసుకోగానే భూతంలా మారిపోతుంది.
అఫ్‌కోర్స్.. అందమైన భూతం. లెలె పాన్స్ వెనిజులా అమెరికన్. ఇంటర్నెట్ పర్సనాలిటీ. హలోవీన్‌డేకి ‘మంచి మంచి’ ఐడియాలు ఇవ్వడం కోసం ఒక పోటీ నిర్వహించి దాన్ని షూట్ చేసి యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేశారు లెలె పాన్స్. దీన్ని మీరూ ఫాలో అవ్వొచ్చు. లేదంటే ఊరికే చూసి హ్యాపీగా భయపడొచ్చు.
ఏడంతస్తుల దెయ్యాల మేడ
ది విన్‌చెస్టర్ : ది హౌస్ దట్ ఘోస్ట్స్ బిల్ట్
నిడివి - 1 ని. 56 సె.
హిట్స్ - 23,44,264
వాస్తుకు విరుద్ధంగా కట్టిన ఏడంతస్థుల భవంతి అది! పేరు విన్‌చెస్టర్. శాన్‌ఫ్రాన్సిస్కోకి 50 మైళ్ల దూరంలో.. నిర్మానుష్యమైన ఒక ప్రదేశంలో ఉంటుంది. చెక్కల భవంతి. లోపల ఎప్పుడూ కిర్రుమనే చప్పుళ్లు. శారా విన్‌చెస్టర్ అనే వృద్ధురాలు కట్టించుకుంటుంది.
విన్‌చెస్టర్‌ల కొండంత సంపదకు ఆమె ఏకైక వారసురాలు. భర్త, బిడ్డ యాక్సిడెంట్‌లో చనిపోయి ఉంటారు. ఆ భవంతి... ఏ గదిలోంచి ఏ గదిలోకి తీసుకెళుతుందో తెలియనంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అది కాదు విషయం. ఆ భవంతి నిర్మాణం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందులో దెయ్యాలున్నాయని ఆమె అనుమానం.
ఆమెను ట్రీట్ చెయ్యడానికి ఒక సైకియాట్రిస్ట్ వస్తాడు. అతడితో ఆ మాట అంటే.. ‘చూడని దానిని నేను నమ్మను’ అంటాడు. ‘నేను చూశాను’ అంటుంది విన్‌చెస్టర్. డాక్టర్‌కీ చూపిస్తుంది! 2018 ఫిబ్రవరి 18న మనమూ చూడొచ్చు. థియేటర్‌కి వెళితే. ఈలోపు ఈ టీజర్‌లోని దెయ్యాలతో సరిపెట్టుకోండి. సూపర్ నేచురల్ హాలీవుడ్ హారర్ మూవీ ఇది.
Comments
Please login to add a commentAdd a comment