
చెఫ్ కనిపెట్టిన టేస్టీ లైఫ్
నిడివి – 2 ని. 9 సె.
హిట్స్ – 98,03,502
డెడ్‌పూల్‌స్ ‘వెట్ ఆన్ వెట్’ టీజర్
వేడ్ విల్సన్ ఒక కెఫెటేరియాలో చెఫ్. పశువులకు వచ్చే బోవైన్ వైరస్ ఏ విధంగానో అతడికి సోకి మనిషి కొంచెం దెబ్బతింటాడు. ముఖ్యంగా అతడి రుచిగ్రంథులు దెబ్బతింటాయి. చెఫ్‌కి ఏది అవసరమో అదే లేకుండా పోతుంది. మేబెర్రీ ప్రాంతపు చెయ్యి తిరిగిన వంటగాడిగా పేరు తెచ్చుకోవాలన్న అతడి కల నెరవేరేదెలా మరి?! ఆ కలను వదిలేసి జీవితంలోని రుచుల్ని అన్వేషించే పనిలో పడతాడు. ప్రపంచం మొత్తం తిరుగుతాడు. సాహసాలు చేస్తాడు.
ఊహించని శత్రువులతో చేసే పోరాటాలు అతడికి జీవితానుభవాన్ని ఇస్తాయి. స్నేహాలు, కుటుంబ అనుబంధాలలోని మధురిమల్ని టేస్ట్ చేస్తాడు. చివరికి ‘వరల్డ్స్ బెస్ట్ లవర్’ టైటిల్ గెలుస్తాడు. వచ్చే ఏడాది జూన్ 1న రిలీజ్ అవుతున్న అమెరికన్ సూపర్‌హీరో ఫిల్మ్ ‘డెడ్‌పూల్ 2’ కథ ప్రస్తుతానికైతే ఇదే కానీ, పూర్తిగా ఇదే కాకపోవచ్చు! ఈ కొంచెం కథైనా ‘ట్వంటీయెత్ ఫాక్స్ సెంచరీ’ విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ వల్ల బయటికి వచ్చింది.2016లో వచ్చిన ‘డెడ్‌పూల్’ చిత్రానికి సీక్వెల్ ఇది. పేరింకా పెట్టలేదు. అందుకే డెడ్‌పూల్ 2 అంటున్నారు.
మూవీ టీజర్‌కు మాత్రం ‘వెట్ ఆన్ వెట్’ అనే పేరు ఇచ్చారు. టీజర్ కూడా తమాషాగా ఉంది. ఇటీవలి కాలంలో హాలీవుడ్‌లో ఇంత వింతైన టీజర్ రాలేదు. వీడియో మొదలవగానే మాస్క్, ‘రాస్ విగ్గు’ పెట్టుకుని ఒక పెయింటర్ ప్రత్యక్షం అవుతాడు. (అమెరికన్ పెయింటర్ ఒకాయన ఉండేవారు. చనిపోయారు. ఆయన పేరు బాబ్ రాస్. ఆయన హెయిర్ స్టైల్‌ను పోలిన విగ్గే రాస్ విగ్). టీజర్‌లో మనకు కనిపించే పెయింటర్.. కాన్వాస్‌పై ‘వెట్ ఆన్ వెట్’ పెయింటింగ్ వేస్తూ కెఫెటేరియా చెఫ్ కథను చెబుతుంటాడు.
వెట్ ఆన్ వెట్ అంటే పెయింట్ పచ్చిగా ఉన్నప్పుడే కోటింగ్ మీద కోటింగ్ ఇవ్వడం. వీడియోలోని చివరి పది సెకన్లలో అకస్మాత్తుగా సీన్ మారిపోతుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు వచ్చేస్తాయి... ధడ్ ధడ్.. మంటూ! మార్వెల్ కామిక్స్‌లో యాంటీ హీరో కోడ్ నేమ్ ‘డెడ్‌పూల్’. అతడి అసలు పేరు వేడ్ విల్సన్. కోడ్‌నేమ్‌నే ఈ సీరీస్ సినిమాలకు పెడుతున్నారు.
ఆత్మసఖీ.. పట్టుకో నన్ను గట్టిగా..!
నిడివి – 3 ని. 36 సె.
హిట్స్ – 27,66,489
ఫాల్ అవుట్ బాయ్ : హోల్డ్ మీ టైట్ ఆర్ డోన్ట్
అమెరికన్ రాక్ బ్యాండ్ ‘ఫాల్ అవుట్ బాయ్’ ఏడవ ఆల్బమ్ ‘మేనియా’ త్వరలో విడుదల కాబోతోంది. అందులోని నాలుగో సింగిల్ ట్రాక్ ఈ ‘హోల్డ్ మీ టైట్ ఆర్ డోన్ట్’. ఇదొక అందమైన డెడ్‌థీమ్ సాంగ్. వీడియో ఆరంభంలో ఒక పుర్రె, దాని కింద క్రాస్‌గా పెట్టిన రెండు ఎముకల సింబల్.. ప్రవేశ ద్వారం దగ్గర గోడ మీద దర్శనం ఇస్తుంది. అది రాత్రి వేళ. కొంతమంది మహిళలు కొవ్వొత్తులు పట్టుకుని మిడ్‌నైట్ ఫంక్షన్‌కు బయల్దేరుతుంటారు. ఓ వైపు మేరి మాత విగ్రహం ఉంటుంది.
ఇదంతా హాలోవీన్ సెట్. మెల్లిగా పొగమేఘాల్లోంచి ఓ దెయ్యం పళ్లికిలిస్తుంది. ఇమ్మీడియట్ షాట్‌లో ముఖాన్ని చక్కెర పలుకులతో పెయింట్ చేసుకున్నట్లున్న ఓ అమ్మాయి అందంగా నవ్వుతుంది. చిన్నా పెద్ద వచ్చేస్తారు. కొందరి చేతుల్లో మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. కొందరు డాన్స్ చేస్తుంటారు. ఆత్మీయ ఆత్మల్ని నిద్రలేపి, ‘అనదర్ డే గోస్ బై.. సో హోల్డ్ మీ టైట్, హోల్డ్ మీ టైట్ ఆర్ డోన్ట్’ అని పాడుతుంటారు. హలోవీన్ డే అయిన అక్టోబర్ 31 లోపే విడుదల అవాల్సిన ఈ ట్రాక్ ఎందుకనో రెండు రోజుల క్రితమే సమాధిలోంచి పైకి లేచింది!
చూడ్డానికైతే బాగుంది
నిడివి – 54 సె.
హిట్స్ – 85,50,921
వాటీజ్ న్యూ, అట్లాస్?
ప్రతి పనీ రోబోలు చేస్తుండడం వల్లనో ఏమో, రోబోలు ఇప్పుడు ఏ పని చేస్తున్నా మనకు పెద్దగా సర్‌ప్రైజింగ్‌గా అనిపించడం లేదు. లేదా, మనుషులే రోబోలుగా పనిచేస్తున్నందు వల్ల రోబోలు ఏం చేస్తున్నా మనకు గొప్పగా అనిపించడం లేదేమో! బోస్టన్ డైనమిక్స్ వాళ్లు కొత్తగా ఇప్పుడొక రోబోను క్రియేట్ చేసి, దానికి ‘అట్లాస్’ అని పేరు పెట్టి.. ‘అందరూ చూడండి, మా రోబో ఎలా జిమ్నాస్టిక్స్ చేస్తోందో’ అని ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
కానీ ఎందుకు పనికొస్తుందో తెలీదు! బోస్టన్ డైనమిక్స్ అనేది రోబోలను డిజైన్ చేసే అమెరికన్ ఇంజనీరింగ్ కంపెనీ. 2005లో ఈ కంపెనీ.. సైనికుల కోసం ‘బిగ్‌డాగ్’ అనే రోబో శునకాన్ని తయారు చేసింది. అయితే అది పెద్దగా వర్కవుట్ కావడం లేదని 2015లో డంప్‌లో పడేసింది. సైనిక సామగ్రి కోసం ‘ప్యాక్ మ్యూల్’గా (బరువులు మోసే గాడిద) ఆ బిగ్‌డాగ్‌ను వాడేవారు. పేరుకు డాగే అయినా అది గాడిద బరువు మోయాలి. రోబో కాబట్టి మోస్తుంది.
అయితే పెట్రోలుతో నడిచే ఆ బిగ్‌డాగ్ ఇంజిన్ డబడబమని చప్పుడు చెయ్యడం సైనికులకు చికాగ్గా ఉండడంతో ‘ఆ బరువేదో మనమే మోసుకుందాం’ అనే నిర్ణయానికి వచ్చి, దాన్ని వదిలించుకున్నారు. ఈ అట్లాస్ రోబో కూడా అలానే వ్యర్థ ఆవిష్కరణ అవుతుందా? ఇప్పటికైతే తెలీదు కానీ.. నో డౌట్ ఇందులో ఉన్నది గ్రేట్ ఇంజనీరింగ్. లెక్క తప్పకుండా ఈ హ్యూమనాయిడ్... దిమ్మెల పైకి దుమికి రివర్స్ విన్యాసాలు కూడా ఎలా చేస్తోందో చూడండి!
చచ్చినా ఎక్కకండి.. చచ్చిపోతారు
నిడివి – 2 ని. 17 సె.
హిట్స్ – 14,99,918
బ్రెంట్ పెల్లా: వై యు షుడెంట్ ఫ్లయ్ ఆన్ స్పిరిట్ ఎయిర్‌లైన్స్
యు.ఎస్.లోని స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌లో జర్నీ చచ్చేంత చీప్! అయితే ‘దటీజ్ నాట్ ట్రూ’ అట. బ్రెంట్ పెల్లా అనే కమెడియన్ అంటున్నారు. మరేమిటి నిజం? స్పిరిట్ ఎయిర్‌లైన్స్ చచ్చేంత కాదు, చంపేంత చీప్ అట. యు.ఎస్.లో ‘స్పిరిట్ ఎయిర్ లైన్స్’ కంపెనీ లోకల్ ఫ్లయిట్స్‌ని తిప్పుతుంటుంది. ఈ మధ్య బ్రెంట్‌కి ఆ ఫ్లయిట్‌లో ఓ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఆ అనుభవాన్ని సర్కాస్టిక్‌గా ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. డయాస్ మీద ఒక స్టాండింగ్ యానిమేటెడ్ కమెడియన్ మైక్ పట్టుకుని ఉంటాడు.
యానిమేషన్ వెనుక గొంతు బ్రెంట్‌ది. ‘‘నేను ఫ్లయిట్‌లో ఉన్నాను. ఫ్లయిట్ ఎంతకీ బయల్దేరడం లేదు. ఈలోపు ఒక అటెండెంట్ వచ్చి అనౌన్స్ చేసింది. ఫ్లయిట్ వెయిట్ బ్యాలెన్స్ కుదరడం లేదు.. ఎవరైనా వెనక్కి వెళ్లి కూర్చుంటారా అని. ఎవరూ కదల్లేదు. నేనే వెళ్లి కూర్చున్నాను. నా పక్కన ఒక సీటు ఖాళీగా ఉంది. అది కూడా నిండితేనే కానీ బరువు బ్యాలెన్స్ అయ్యేలా లేదు. చివరికి ఇందాకటి అటెండెంటే వచ్చి నా పక్కన కూర్చుంది.
‘ఇప్పుడు సరిగానే ప్రయాణిస్తుందా?’ అని అడిగాను. అప్పుడు తనేమందో తెలుసా.. ‘చూద్దాం.. ఏం జరుగుతుందో’ అని!’’. బ్రెంట్ ఈ మాట చెప్పగానే వీడియోలో నవ్వులే నవ్వులు. ఇంకా అతడు వేసిన ఇలాంటì జోక్స్ చాలానే ఉన్నాయి. సర్వీస్ బాగా లేనప్పుడు చికాకు పడి తిట్టుకుంటాం. బ్రెంట్ లాంటి కళాకారులకు మాత్రమే వాటిని పది మంది దృష్టికీ తెచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకూ ఆయన చెప్పడం ఏమిటంటే... చచ్చినా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఎక్కొద్దని.
Comments
Please login to add a commentAdd a comment