యూ ట్యూబ్‌ వెర్రి చేష్టలు... | YouTube silly antics . | Sakshi
Sakshi News home page

యూ ట్యూబ్‌ వెర్రి చేష్టలు...

Published Tue, Jan 10 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

యూ ట్యూబ్‌ వెర్రి చేష్టలు...

యూ ట్యూబ్‌ వెర్రి చేష్టలు...

పక్క దోవ

ఈ మధ్య వచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమా గుర్తు ఉందా? అందులో యూట్యూబ్‌ హిట్స్‌ కోసం హీరో ఒంటి మీద కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు నటిస్తూ తండ్రి కంట్లో పడి తిట్లు తింటాడు. ఇప్పుడు చాలామంది కుర్రాళ్ల వెర్రి ఈ స్థాయిలోనే ఉంది.గతంలో కుర్రాళ్లు పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్ చుకుని నలుగురి దృష్టిలో పడేవాళ్లు. లేదంటే సమాజానికి పనికొచ్చే పనులు చేసి  ఆకర్షించేవారు. గొప్ప  గొప్ప ఉద్యోగాలు సాధించినా కూడా మెచ్చుకోలు దక్కేది. కాని ఇవన్నీ కష్టమైన పనులు కావడాన అందరి దృష్టిలో పడటానికి ఇవాళ కొందరు కుర్రకారు చేస్తున్న పని వెర్రి వేషాల వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెట్టడం. వీధి కుక్కను మేడ మీద నుంచి కింద పడేయడం, పులి బోనులో అడుగుపెట్టడం, దెయ్యం వేషాలు వేసుకొని భయపెట్టడం లాంటి చేష్టలు చేసి ఆ వీడియోలు యూట్యూబ్‌లో పెట్టబోయి అభాసు పాలైన వారు ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీకి చెందిన మరో కుర్రాడు కూడా  ఊచలు లెక్కబెట్టబోతున్నాడు.

ఢిల్లీకి చెందిన సుమిత్‌కు యూ ట్యూబ్‌లో ‘ది క్రేజీ సుమిత్‌’ అనే చానెల్‌ ఉంది. దారిన పోయే జనం పై ప్రాంక్స్‌ (ఆట పట్టించడం) చేసి ఆ వీడియోలను యూ ట్యూబ్‌లో పెడుతుంటాడు. మొన్న జనవరి ఒకటిన ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఒక ప్రాంక్‌ చేశాడు. ఏమిటంటే దారిన పోతున్న ఆడపిల్లలను సడన్‌గా ముద్దు పెట్టి పరిగెత్తడం. ఈ ప్రాంక్‌ను ముగ్గురు నలుగురు ఆడపిల్లలపై చేసి దానిని యూట్యూబ్‌లో పెట్టాడు.  రెండు వేల మంది దానిని చూసి ‘లైక్‌’ కొట్టారు కూడా. కాని ఆ వెంటనే స్త్రీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇది ఆట పట్టించడం కాదని లైంగిక దాడి చేయడం అని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ అధికారి స్వాతి మలివాల్‌ ఈ వీడియోను ఖండించడంతో వేడి పుంజుకుంది. దాంతో పోలీసులు రంగంలో దిగి ఆ వీడియో ఎక్కడ ఎవరు అప్‌లోడ్‌ చేశారన్న దానిపై విచారణ మొదలెట్టారు. ఇది లైంగికదాడిగా భావిస్తే సుమిత్‌పై ఐ.పి.సి. సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపే అవకాశం ఉంది.

కాని ఇంతలోనే సుమిత్‌ ఆ వీడియోని తొలగించి క్షమాపణ పోస్ట్‌ పెట్టి, చెంపలు వేసుకున్నాడు. ఇలా మహిళలు వ్యతిరేకిస్తారని ఊహించలేకపోయానని ఏదో అందరూ ఎంజాయ్‌ చేస్తారని భావించానని కనుక క్షమించమని వేడుకున్నాడు. కాని వ్యవహారం అంత సులభంగా అతణ్ణి వదిలిపెట్టేలా లేదు.కెరీర్‌పై దృష్టి పెట్టాల్సిన వయసులో కుర్రాళ్లు ఇలాంటి వైపరీత్యాలకు పోయి జీవితాలు పాడు చేసుకోవడం ఈ కాలపు విషాదం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement