ఫోన్ చేస్తే చాలు పోలీసులు వాలిపోతారు!
అమెరికాలో ప్రజలు తమకు ఏ ఆపద ఎదురైనా వెంటనే 911కు ఫోన్ చేస్తారు. నిమిషాల్లో పోలీసులు వాలిపోయి సమస్య పరిష్కరిస్తారు. అందువల్ల ఈ నంబర్ ఎల్లప్పుడు అమెరికాలో బిజీగా ఉంటుంది. హ్యుస్టన్‌లో తన తండ్రికి గుండెపోటు రాగా, ఒక 6 సంవత్సరాల బాలిక పోలీసులకు ఫోన్ చేసి, ప్రాణాలను కాపాడుకున్న సంఘటనను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సంచార పోలీస్ వాహనాలు అమెరికాలో విరివిగా ఉన్నాయి. 911కు ఫోన్ చేయగానే ఆపద ఏర్పడిన అడ్రసుకు సమీపంలో ఉన్న సంచార వాహనానికి సమాచార మిస్తారు. నిమిషాల వ్యవధిలోనే సంఘటన జరిగిన స్థలానికి పోలీసులు చేరుకుంటారు. అర్థరాత్రి కూడా మహిళలు స్వేచ్ఛగా సంచరిస్తారు. విద్యార్థినులను ఈవ్ టీజింగ్ చేయం కనిపించదు. అమెరికా ప్రజలు ఎవరి పనులను వారు చక్కగా చేసుకుంటారు. శ్రమను గౌరవిస్తారు. ఎవరి ఇళ్లను వారే శుభ్రం చేసుకుంటారు. పని మనుషులు లేరు. ఒక వేళ ఎవరైనా పని మనుషులను పెట్టుకోవాలంటే చాలా డబ్బులు వ్యయం చేయాలి. చలి ప్రదేశాల్లో ప్రతి ఇంట్లోనూ ఉన్నితో తయారు చేసిన కార్పెట్ ఉంటుంది. దానిని యంత్రంతో శుభ్రం చేస్తారు.
సోషల్ సెక్యూరిటీ నంబర్
అమెరికాలో నివసించే ప్రతి స్వదేశీ, విదేశీ పౌరులకు అక్కడి ప్రభుత్వం ఒక సోషల్ సెక్యూరిటీ నంబర్ కేటాయిస్తుంది. ఆ నంబర్ పైనే ఆయా పౌరుల వివరాలు రికార్డు అవుతాయి. ఎక్కడైనా పొరపాటుగా కారు నడిపి ప్రమాదం కలిగిస్తే, అలాంటి విషయాలను కూడా రికార్డు చేస్తారు. అమెరికాలో విశాలమైన రోడ్లు, అడుగడుగునా సిగ్నల్స్‌తో ప్రమాదం జరిగేందుకు ఆస్కారముండదు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి కూడా పోలీసులు జరిమానా విధిస్తారు. ఒక సారి జరిమానా టికెట్ కట్ చేసిన తరువాత ఫైన్ చెల్లించవలసిందే. అక్కడ ఎలాంటి పైరవీలకు ఆస్కారం ఉండదు. మన దేశంలో ఆధార్ నంబర్ మాదిరిగానే ఇది కూడా పని చేస్తుంది. అయితే ఆధార్ నంబర్ పూర్తిగా ఇక్కడ మనుగడలోకి రాలేదు.
అమెరికా అంతటా లోకల్ మొబైల్ ఫోన్లు
ఇంటర్‌నెట్ ఆధారంగా అమెరికా అంతటా లోకల్ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. ఇవి మన ఫోన్ల కంటే చాలా చౌక. అందువల్ల అమెరికాలో ఉన్న వారు మన దేశంలోని బంధువులతో మాట్లాడేందుకు ఈ ఫోన్ ఉపయోగిస్తారు. ఏటీ అండ్ టీ ఫోన్లను ఫిక్స్‌డ్ ఫోన్లుగా అక్కడ వాడతారు. అమెరికాలో ఇంటర్‌నెట్ వినియోగం ఎక్కువగా ఉంది. ప్రతి రెస్టారెంట్లో, షాపులో ఇంటర్‌నెట్ వినియోగంలోకి వచ్చింది. అక్కడ కాఫీ షాపులు రీడింగ్ అండ్ రైటింగ్ రూంలుగా ఉపయోగపడుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం ద్వారా అమెరికా ప్రజలు తమ జీవన విధానాన్ని మెరుగు పర్చుకున్నారు. వాస్తవానికి మన దేశంలోనే అమెరికా కంటే ఎక్కువగా సహజ వనరులున్నాయి. సంవత్సరంలో సుమారు 6 నుంచి 8 మాసాలపాటు అమెరికా చాలా ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. రోడ్లపై సులభంగా తిరిగేందుకు అవకాశం ఉండదు. ఆఫీసులకు వెళ్లలేక అనేక మంది ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో పనిచేస్తారు.
ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ స్టౌలు ఉంటాయి. అక్కడ వంటగ్యాస్ వినియోగం లేదు. అద్దె ఇళ్లలో సోఫాలు, ఫ్రిజ్, ఓవెన్.... ఇతర సౌకర్యాలుంటాయి. అపార్టుమెంట్లలో వాచ్‌మేన్ ఉండరు. ప్రతి ఫ్లాట్ యజమానికి ఒక కీ ఇస్తారు. డోర్ ఓపెన్ చేసుకుని రావాలి. ఎవరైనా బంధువులు వస్తే, ఫ్లాట్ నంబర్‌కు సంబంధించిన నంబర్ నొక్కుతారు. అప్పుడు ఫ్లాట్ ఉన్న వ్యక్తి ఆడియో సిస్టం ద్వారా మాట్లాడి నిర్ధారించుకుని మీటనొక్కగానే డోర్ తెరుచుకుంటుంది. అమెరికాలో బహిరంగ మలవిసర్జన పూర్తిగా నిషేధం. అడుగడుగునా ప్రజల కోసం మరుగు దొడ్లు నిర్మించారు. అమెరికాలోని చాలా నగరాల్లో దుమ్ము ధూళీ లేదు. కాలుష్యం చాలా తక్కువ. ఏడాదిలో చాలా కాలం పాటు మంచు కురవడం వల్లనే ఈ పరిస్థితి ఉందని భావిస్తున్నారు.
- జి.గంగాధర్, సీనియర్ సబ్ ఎడిటర్.