చిలకలు వాలిన చెట్టు | a school for parents in working as a Movementt style | Sakshi
Sakshi News home page

చిలకలు వాలిన చెట్టు

Published Thu, Jul 10 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

చిలకలు వాలిన చెట్టు

చిలకలు వాలిన చెట్టు

పోటీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల్లా బాల్యం ఎప్పుడో దూరమైపోయింది. డాలర్ల వేటలో దాన్ని గుర్తు చేసుకోవడానికి కూడా టైమ్ లేకపోయింది. మళ్లీ పిల్లల రూపంలో బాధ్యతొచ్చిపడితే గానీ.. తోటి పిల్లలతో పోటీపడి ఇసుక గూళ్లు కట్టిన జ్ఞాపకం, నాన్న డైరీ చింపి వాన నీటిలో కాగితపు పడవలతో పాటూ ఈదులాడిన స్మృతి.. సాయంత్రం పూట నాన్నమ్మ చేతి గోరుముద్దలు తింటూ ఆమె చేతిలోనే నిద్రపోయిన పసితనం.. ఒక్కసారిగా గిర్రుమని కళ్లముందరకొచ్చిపడతాయి. అవేవీ అందుబాటులో లేని ఈ జనరేషన్‌లో పిల్లలను ఆడించడమే కష్టమవుతోంది మోడరన్ పేరెంట్స్‌కి. అలాంటి వారి కోసమే ఈ ‘జింబోరీ’ స్కూల్. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ టెంపుల్ దగ్గరగా ఉన్న ఈ స్కూల్‌ను శని, ఆదివారాల్లో చూస్తే చిలకలు వాలిన చె ట్టులా ఉంటుంది.
 
 పిల్లలతో పాటు తల్లిదండ్రులు పసి పిల్లలైపోయే వీకెండ్ స్కూల్ జింబోరీ. ఆడుకోవడమెలాగో, పిల్లలకు అన్ని విషయాలపై అవగాహన కల్పించడమెలాగో.. ఆటల ద్వారా తల్లిదండ్రులకు చెబుతారిక్కడ. వారంలో ఐదురోజులు ఉద్యోగాలకు అంకితమైపోయిన తల్లిదండ్రులు శని, ఆదివారాల్లో తమ పిల్లలతో పాటే వచ్చి నేర్చుకుంటారు. పాలు పట్టడం దగ్గర నుంచి పిల్లల కోసం ప్రత్యేకంగా వంటలెలా చేయాలి, ఎలాంటి బట్టలు వేయాలి? ఎలాంటి బొమ్మలైతే బాగా ఆడుకుంటారు? పిల్లలకు ఆడుతూనే అన్నీ నేర్పించడం ఎలా? చదివించడమెలా? అనే అంశాలను నేర్పిస్తారు. కంఫర్ట్స్ కోసం పరుగులు పెడుతూ పిల్లల కోసం సమయం వెచ్చించలేకపోతున్న తల్లిదండ్రులకు పిల్లలతో అనుబంధం పెంచుకోవడమెలాగో చెబుతారు.
 
 ఇప్పటికే పిల్లలు ఉన్నట్టయితే తల్లిదండ్రులు ఆ పిల్లలను కూడా తీసుకొని ఫ్యామిలీగా కూడా క్లాసులకు అటెండ్ అవ్వొచ్చు. దీనివల్ల పెద్ద పిల్లలకు తమ చిట్టి చెల్లితోనో, తమ్ముడితోనో ఎలా మెలగాలి అనే విషయాలను కూడా చెబుతారు. ఈ యాక్టివిటీస్ అన్నీ ఆటలు, సంగీతం, కళల చుట్టూనే ఉంటాయి. ఇక ఇసుకగూళ్ల వంటి ఆటలు, మట్టితో సంబంధమున్న  క్లేఆర్ట్ వంటి కళలు కూడా నేర్పిస్తారు. తమ సుతిమెత్తని చేతులతో అందమైన ఆకృతులు చేసిన పిల్లలకు బహుమతులు కూడా ఇస్తారు. ఇక వారం రోజులు పిల్లలకు కొత్తగా ఉండటం కోసం రోజుకోరకంగా రంగురంగు బొమ్మలతో గదులను తీర్చిదిద్దుతారు.
 ‘పిల్లల ఆలోచనలకు అనుగుణంగా వారి ఊహల ప్రపంచంలోకే వెళ్లి తల్లిదండ్రులు కూడా పిల్లలైపోయి ఆడుకోవాలన్నదే మా కాన్సెప్ట్. అలా తల్లిదండ్రుల సపోర్ట్, అనుబంధం ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. దానివల్ల పిల్లల్లో నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ యాక్టివిటీస్ ద్వారా తల్లిదండ్రులు తమ చిల్డ్రన్ ఎలా ఎదుగుతున్నారనే విషయాన్ని చాలా దగ్గరగా తెలుసుకోగలుగుతారు’ అంటున్నారు జింబోరీ మేనేజర్ నిఖిత.
 ..: శిరీష చల్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement