సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా విధానంలో మార్పులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చడం పక్కన బెడితే, కొన్ని చాప్టర్లు తీసివేయడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని విద్యావేత్తలు అంటున్నారు. పురాతన చరిత్ర స్థానంలో క్లాసికల్ హిస్టరీని తేవాలని తాజాగా జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీన్ని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు స్వాగతించడం లేదు. ఇప్పటికే రాష్ట్రాల పరిధిలో స్థానిక అంశాలతో సిలబస్ ఉంది. వీటిని పరిగణనలోనికి తీసుకుని సిలబస్‌లో మార్పులు చేస్తేనే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
వేర్వేరు సిలబస్‌లతో ఇబ్బందులు
ప్రపంచీకరణ ప్రభావం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రం వేర్వేరు సిలబస్‌లు అమలు చేయడం వల్ల పోటీ పరీక్షల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదన విద్యావేత్తల నుంచి విన్పిస్తోంది. మారిన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా రాష్ట్రాల్లోని సిలబస్‌లో మార్పులు తేవాలనే అంశంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి.
పోటీ పరీక్షలుసవాలే..
ఎన్‌సీఈఆర్టీ సూచించిన మార్పుల్లో అనేక అంశాలున్నాయి. క్లాసికల్ హిస్టరీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటోంది. ప్రాచీన చరిత్రను ఎత్తివేయడమే సమంజసమని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులను తీసివేయాలనే ప్రతిపాదన రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మొఘల్ సామ్రాజ్యం, గాందీజీ హత్య, ప్రజాస్వామ్యం–రాజకీయ పారీ్టలు అనే చాప్టర్స్‌ను ఎన్‌సీఈఆర్టీ అనవసరమైనవిగా చెబుతోంది.
పాత చరిత్రలో విజయాలకన్నా, అపజయాల గురించే ఎక్కువగా ఉందనేది ఎన్‌సీఈఆర్టీ అభిప్రాయం. అయితే ఇవి రాష్ట్రాల పరిధిలో ఇప్పటికీ బోధనాంశాలుగా కొనసాగుతున్నాయి. పోటీ పరీక్షల్లోనూ వీటిలోంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఎడ్‌సెట్, లాసెట్, గ్రూప్స్, వివిధ రకాల పోటీ పరీక్షల్లో ఆర్ట్స్’ విద్యార్థులు వీటిని చదవాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్ చదివే వాళ్ళకు ఈ చాప్టర్లు చదివే వీలుండదు. దాంతో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో విద్యార్థులకు నష్టం కల్గించే వీలుందని నిపుణులు అంటున్నారు.
సైన్స్ నేపథ్యంతో సీబీఎస్‌ఈ చదివే విద్యార్ధులకు...
సైన్స్‌లో డార్విన్ సిద్ధాంతాన్ని కేంద్ర విద్యా సంస్థ ఎత్తివేయాలని ప్రతిపాదించింది. మానవ పరిణామ క్రమాన్ని సహేతుకంగా నిరూపించే సిద్ధాంతాన్ని ఎన్‌సీఈఆర్టీ కమిటీ విభేదించినట్టు తెలుస్తోంది. దీంతో పాటే పైథాగరస్ సిద్ధాంతానికి స్వస్తి పలకాలని సూచి స్తోంది. దీనివల్ల కూడా సైన్స్ నేపథ్యంతో సీబీఎస్‌ఈ చదివే విద్యార్థులు రాష్ట్రాల్లోని పోటీ పరీక్షలకు హాజరవ్వడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కేంద్ర స్థాయిలో నిర్వహించే పరీక్షలకు సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఇస్తారు. రాష్ట్ర బోర్డు పరిధిలో ఉండే విద్యార్థులు కొత్త చాప్టర్స్ చదివే వీలుండదు. వాళ్లు చదివిన పురాతన భారత చరిత్ర వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని పలువురు అంటున్నారు.
అన్ని రాష్ట్రాలనూ పరిగణనలోకి తీసుకోవాలి
ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానంలో వస్తున్న మార్పులను ఆకళింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా విద్యార్థి విద్యా విధానంలోనే స్కిల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ దిశగా పాఠ్యాంశాలు ఉండటం మంచిది. అయితే, మార్పు జరిగేటప్పుడు రాష్ట్రాల పరిధిలోని విద్యా విధానాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. లేనిపక్షంలో అనేక మంది విద్యార్థులు రెండు సిలబస్‌లతో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్)
వక్రీకరణ సరికాదు
చరిత్రను వక్రీకరించే విధానం ఎన్‌సీఈఆర్టీ సిఫార్సుల్లో బోధపడుతోంది. ప్రాచీన చరిత్రను తీసివేయాలనే ధోరణి మంచిది కాదు. చరిత్ర తెలుసుకుంటేనే ప్రతిభ పెరుగుతుంది. ఇది తెలియకుండా ఇష్టానుసారంగా చరిత్రను పాఠ్యాంశాల్లో జోడిస్తే ప్రతికూల ఫలితాలొస్తాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వేర్వేరు సిలబస్‌లు వల్ల కూడా నష్టం జరుగుతుందనే విషయాన్ని కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
Comments
Please login to add a commentAdd a comment