సైన్యానికి నిధుల వరద, శాంతికి బెడద
2012లో అమెరికా 682 బిలియన్ డాలర్లు సైనిక వ్యయం చేసింది. ఇది ఆ సంవత్సరంలో చైనా, రష్యా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఇండియా, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్ దేశాల మొత్తం సైనిక వ్యయం కంటె కూడా ఎక్కువ.
‘శాశ్వతమైన శాంతి మీద నాకు నమ్మకం లేదు’ అంటాడు బెనిటో ముస్సోలినీ. భూమండలాన్ని రణభూమిగా మార్చిన రెండు ప్రపంచ యుద్ధాలలోనూ పాల్గొన్న ముస్సోలినీ ప్రపంచం మీదకు సంధించిన సిద్ధాంతం ఫాసిజం. ఫాసిజానికి ఆద్యుడైన ముస్సోలినీ నోట మరో మాటను ఆశించనక్కరలేదు. కానీ అతడు మరణించిన కొన్ని దశాబ్దాల తరువాత కూడా ఆయన ప్రవచనాలు ప్రపంచంలో చలామణి అవుతున్నాయి. శాంతి అంటే పిచ్చివాడి కల అన్న భావననే ఇప్పుడు అగ్రరాజ్యాలు ప్రగాఢంగా నమ్ముతున్నాయని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఏవేవో కారణాలతో అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందిన దేశాలు సైనిక వ్యయాన్ని అంచనాలకు అందనంతగా పెంచుతున్నాయి. సైనిక వ్యయం ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగమైపోయింది.
సరిగ్గా నూరేళ్ల క్రితం జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ఉద్దేశం - సమస్త యుద్ధాలను నిరోధించడమే. కానీ రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తరువాత మరెన్నో యుద్ధాలకు మొదటి ప్రపంచ యుద్ధం బీజాలు వేసింది. దేశాలు ఏదో ఒక పేరుతో సైనిక వ్యయాన్ని పెంచుతూనే ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత నానా జాతి సమితి, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐక్య రాజ్య సమితి ఆవిర్భవించాయి. అయినా యుద్ధాలు లేని ప్రపంచం ఒక ఊహగానే మిగిలి ఉంది. శాశ్వతమైన శాంతిని ఎవరూ విశ్వసించడంలేదన్నమాటే.
అగ్రరాజ్యమైన అమెరికా, అభివృద్ధికి నమూనాగా చెప్పుకుంటున్న చైనా సైనిక వ్యయాన్ని విచ్చలవిడిగా పెంచుతున్నాయి. జపాన్‌తో సంబంధాలు, ఆసియా పరిస్థితులను బట్టి చైనా తన సైనిక సంపత్తిని పెంచుకుంటోందని ఒక వాదన ఉంది. కానీ చాలా ప్రపంచ దేశాలు కూడా ఏదో కారణంతో సైనిక వ్యయాన్ని ఇతోధికంగా పెంచుతున్నాయి. స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా చైనా రెండంకెల శాతంతో సైనిక వ్యయాన్ని పెంచుతోంది. అమెరికా అయితే నలభై శాతం వరకు రక్షణ కేటాయింపులు పెంచుకుంటోంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత జరిగిన సైనిక వ్యయంలో 2011 సంవత్సరానికి ప్రత్యేకత ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అత్యధిక సైనిక వ్యయం ఆ సంవత్సరంలోనే జరిగింది. అసలు ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక పోటీ అంటే అది ఏటా ట్రిలియన్ డాలర్ల మేర సైనిక వ్యయంగా ఎందుకు మారిపోవాలో సమాధానం సాధించవలసి ఉంది.
అమెరికా బడ్జెట్‌లో రక్షణ కేటాయింపులలో కోత విధించడానికీ, దళాల కుదింపునకూ కాంగ్రెస్ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అయినా 2012లో అమెరికా 682 బిలియన్ డాలర్లు సైనిక వ్యయం చేసిం ది. ఇది ఆ సంవత్సరంలో చైనా, రష్యా, బ్రిట న్, జపాన్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఇండి యా, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్ దేశాల మొత్తం సైనిక వ్యయం కంటె కూడా ఎక్కువ. ఈ అన్ని దేశాల సైనిక వ్యయం 652 బిలియన్ డాలర్లు.
చైనా చేసిన సైనిక వ్యయం గురించి ఆ దేశం రహస్యంగా ఉంచడం లేదు. ఈ సంవత్సరం తమ రక్షణ బడ్జెట్ 12.2 శాతం పెరిగిందని చైనా ప్రకటించింది. హైటెక్ ఆయుధాల కోసం; తీర, గగన రక్షణల విస్తరణలో భాగంగా ఈ పెంపు అవసరమైందని ఆ దేశం వివరణ ఇచ్చింది. అమెరికా తరువాత రెండంకెల స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు పెంచుకున్న దేశం చైనా కావడం విశేషం. దీని మీద జపాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సైనికీకరణ ఇప్పుడు పెట్టుబడిదారీ విధానంలో అంతర్భాగంగా చూడవచ్చునని నిపుణుల అభిప్రాయం. సరిహ ద్దులతో సంబంధం లేకుండా పెట్టుబడిదారీ విధానం ప్రపంచ దేశాలతో ముడిపడి ఉంది. ఇరవయ్యో శతాబ్దంలో కని పించే సామ్రాజ్యవాదానికి భిన్నంగా కనిపించినా, అదే అడుగుజాడలలో ఉండే ఆర్థిక గుత్తాధిపత్యం సాధించడానికి సైన్యం పెంపు ఆయుధంలా పనిచేస్తున్నదంటే వాస్తవదూరం కాదు.
కల్హణ