ఫాసిజం అంతానికి 70 ఏళ్లు
సోవియట్ యూనియన్‌కి చెందిన ఎర్రసైన్యం బెర్లిన్‌ని ముట్టడించి కైవశం చేసుకోవడంతో హిట్లర్ నెలకొల్పిన థర్డ్ రీచ్, రెండో ప్రపంచ యుద్ధం 1945 మే 9న ముగిసి పోయాయి. జర్మనీ బేషరతుగా లొంగిపోవడంతో మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మారణకాండకు ముగింపు పలికినట్లయింది. హిట్లర్ హయాంలో జరిగిన అమానుష ఘటనలు సాంప్రదాయకమైన మానవ చిం తనపై ఎలాంటి ప్రభావం వేశాయంటే ఆనాడు నిజంగా ఏం జరిగిందన్నది అవగాహన చేసుకోవడం నేటివరకు చరిత్రకు సాధ్యం కావడం లేదు. ప్రముఖ తత్వవేత్త థియొడర్ అడోర్నో దీనిపై స్పందిస్తూ ఆస్చ్‌విట్జ్ (నాజీ చిత్రహింసల కేంద్రం)లో మారణకాండ పరంపర తర్వాత, కవిత్వ రచనను కొన సాగించడం కూడా అనా గరికమే అని వ్యాఖ్యానించారు. నాజీలు ఒక పద్ధతి ప్రకారం ఏకపక్షంగా లక్షలాది మందిని ఊచకోతకు గురి చేసిన తర్వాత ఇక కవిత్వం రాయడానికి ఏమీ లేదన్నది ఆయన భావన. ఆనాడు యూదులపై, తదితర ప్రజా నీకంపై జరిపిన చిత్రహింసలు, దౌర్జన్యాల గురించి తెలుసుకుని భయవిహ్వలతకు గురైనవారు మళ్లీ సాధా రణ జీవితం గడపటం సాధ్యం కాకపోయింది. ‘మళ్లీ ఎన్నడూ ఫాసిజం వద్దు. యుద్ధం వద్దే వద్దు’ అనేది వారి పవిత్ర ప్రమాణంలా మారింది.
ఫాసిజంపై విజయం 20వ శతాబ్దికి చెందిన అత్యంత కీలక ఘటనల్లో ఒకటి. ఆ శతాబ్ది ద్వితీయా ర్థం నుంచి నేటి వరకు ఈ మహద్ఘటన మానవ నాగరి కతా వికాసానికి మెరుగులద్దుతూనే ఉంది. అది సాధిం చిన గొప్ప విజయం వలస పాలన నుంచి కోట్లాది మం ది ప్రజలను విముక్తి చేయడం. అనేక దేశాల్లో స్వాతం త్య్ర పోరాటానికి వీలు కల్పించింది. సంక్షేమ రాజ్యం, పెట్టుబడి దారీ దేశాల్లోని ప్రజలకు సామాజిక భద్రతా యంత్రాంగాన్ని నెలకొల్పడం, ప్రజాస్వామ్యాన్ని మరిం త విస్తృతపర్చడం వంటివి ఆ విజయ ఫలితాలే. అనంతరం జరిగిన మానవ చింతన అభివృద్ధిలో నుంచే ఆధునిక ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు, మానవ హక్కులకు కొత్త నిర్వచనాలు కూడా పుట్టుకొచ్చాయి.
కానీ ఈ ఆశ, ఈ విశ్వాసం మనలో ఎంతమేరకు ఇప్పటికీ కొనసాగుతోందంటే చెప్పడం కష్టమే. హిట్లర్ గతించి 70 ఏళ్లు గడిచిన తర్వాత నేడు కూడా మనం శాంతియుత ప్రపంచంలో జీవించలేకపోతున్నాం. పైగా చరిత్రలో ఎన్నడూ లేనంత అధికంగా మనుషులు ప్రస్తుతం బానిస జీవితం గడుపుతున్నారు. ఆకలి చావు లు, వలసలు అనేవి మనిషిపట్ల జరుగుతున్న ఘోర అన్యాయానికి నిద ర్శనాలుగా నిలబడుతు న్నాయి. 2001 సెప్టెంబర్ 11తో మొదలుకుని నేటివరకు మధ్యప్రాచ్యంలో జరు గుతున్న యుద్ధాల్లో పది లక్షల మందికిపైగా పౌరులు చనిపోయారు. దేశాలకు దేశాలు బాంబుదాడుల్లో శిథిలమయ్యాయి. ఇక చిత్రహింసలు, అత్యాచారాలు, పాశవిక చర్యల మాట చెప్పనవసరం లేదు. ద్రోన్ దాడుల పేరుతో ఒబామా యంత్రసమన్విత హత్యాకాండను పరాకాష్టకు తీసుకు పోతున్నారు. ఇక యూరప్ మరోసారి ప్రపం చాధిపత్య శక్తుల మధ్య రణస్థలిలా మారే ప్రమాదం పొంచుకుని ఉంది. పాశ్చాత్య దేశాలకు, రష్యాకు మధ్య ఘర్షణ అనంతంగా సాగుతోంది. యూరప్‌లో అణు యుద్ధ ప్రమాదం ఎన్నడూ లేనంతగా పొడసూపు తోంది. సంపన్న రాజ్యాలుగా భావిస్తున్న యూరప్, ఉత్తర అమెరికాల్లో అసంఖ్యాక ప్రజలు దారిద్య్రంలోకి కూరుకుపోతుండగా, కులీన వర్గాలు పోగుచేసుకుం టున్న సంపద చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో సామాజిక అసమానతను పెంచి పోషిస్తోంది. భవిష్య త్తుపై నమ్మకం కోల్పోతున్న ప్రజలకు అవినీతి కరమైన పాలక వర్గంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ పరిణామాలన్నీ కలసి 70 ఏళ్ల క్రితం జర్మనీలో వైమర్ రిపబ్లిక్ చివరి రోజుల్లో నెలకొన్న పరిస్థితిని తలపిస్తు న్నాయి. నాడు సైతం అత్యంత అధికస్థాయికి చేరుకున్న ఆర్థిక అసమానత్వమే ఫాసిజానికి దారి తెరిచింది. గ్రీస్, ఫ్రాన్స్, హంగరీలలో మితవాదశక్తులు పుంజుకుంటున్న తీరు చూస్తే 1933 నాటి ఫాసిస్టు ప్రమాదం విజృం భించడానికి ఎంతో కాలం పట్టదనిపిస్తోంది. నోమ్ చామ్‌స్కీ కొన్నేళ్ల క్రితం దీనిపై ఎంతో ముందు చూపుతో హెచ్చరించారు కూడా.
చరిత్రపై ఇంతటి ప్రభావాన్ని కలిగించిన ఫాసి జంపై విజయ ఘటనకు మన దేశంలో కనీస గుర్తింపు లేకుండాపోవడమే విషాదకరం. వలసపాలనలోని బ్రిటిష్ ఇండియాకు చెందిన 25 లక్షల మంది సైనికులు ఫాసిజంపై వీరోచిత పోరులో పాలుపంచుకున్నారు. రెండో ప్రపంచయుద్ధంలో హిట్లర్ పక్షాన నిలిచిన జపా న్‌ను ఓడించడంలో అద్వితీయ పాత్ర భారతీయ సైనికు లదే. ఫాసిజంపై గెలుపులో భారతసైనికుల త్యాగాలు రూపుమాసిపోకూడదు. అలాగే ఫాసిజం చేదు జ్ఞాపకా లను ప్రపంచంలో ఏ ఒక్కరూ మరువకూడదు కూడా.
(ఫాసిజంపై విజయానికి నేటికి 70 ఏళ్లు)
కె. రాజశేఖరరాజు